Share News

వైద్యమిత్రలకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:10 AM

డా. ఎన్.టి.ఆర్. వైద్య సేవా పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యమిత్రలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగికి ప్రభుత్వ...

వైద్యమిత్రలకు న్యాయం చేయాలి

డా. ఎన్.టి.ఆర్. వైద్య సేవా పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యమిత్రలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగికి ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అందే వరకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం, సమన్వయం అందిస్తూ వారు రోగికి – ఆసుపత్రి వ్యవస్థకు మధ్య ఒక ముఖ్యమైన వారథిగా పనిచేస్తున్నారు. రోగుల నమోదు, పత్రాల పరిశీలన, కౌన్సెలింగ్, ఎంఈడీసీవోతో సమన్వయం, ప్రాథమిక వైద్య పరీక్షలకు సహకారం, ఇన్‌పేషెంట్‌గా చేర్పించే ప్రక్రియలో సహాయం, ప్రీ–ఆథరైజేషన్ ప్రక్రియ, బెడ్‌సైడ్ ఫాలో అప్, మొబైల్ యాప్‌లో వివరాల నమోదు, ఫిర్యాదుల పరిష్కారం, డిశ్చార్జి ప్రక్రియలో సహకారం, డిశ్చార్జి పత్రాల అందజేత వంటి అనేక బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు.

వైద్యమిత్రలలో చాలా మంది 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా సేవలందిస్తున్నా, వారి వేతనాలు అందుకు అనుగుణంగా పెరగకపోవడం ఆందోళనకరం. వారిలో ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర విద్యార్హతలు కలిగినవారు కూడా ఉన్నారు. ఇంతటి దీర్ఘకాలిక సేవా అనుభవం కలిగిన సిబ్బందికి ఇప్పటికీ సుమారు రూ.15,000 వేతనమే ఇస్తున్నారు. జీవన వ్యయాలు పెరిగిన ఈ రోజుల్లో ప్రస్తుత వేతనంతో కుటుంబ అవసరాలను నిర్వహించడం వారికి కష్టసాధ్యంగా మారుతోంది. కాబట్టి వారి వేతనాన్ని పెంచడం అత్యవసరం.

2022లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ7లో కేటగిరీ–1కు నెలకు రూ.21,500 పారితోషికాన్ని నిర్ణయించింది. ఈ కేటగిరీలో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ వంటి బాధ్యతాయుతమైన పనులు ఉన్నాయి. వైద్య మిత్రలు నిర్వహిస్తున్న పనులు కూడా అంతకుమించి ఉన్నాయి. అందువల్ల కేటగిరీ–1 వేతన ప్రమాణాన్ని వారికి వర్తింపజేయడం న్యాయమైనదే. దీంతో పాటు భవిష్యత్తులో కూడా వారికి వేతన ప్రగతి ఉండేలా ప్రతి ఆరు సంవత్సరాల పూర్తి సేవకు 10శాతం చొప్పున వేతన పెంపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. వైద్య మిత్రలకు మెరుగైన వేతనంతో పాటు తగిన సేవా భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి సంక్షేమ చర్యలు కూడా కల్పించాలి. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే వైద్యమిత్ర కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించడం, కుటుంబంలోని అర్హత కలిగిన ఒకరికి ఉపాధి కల్పించే అంశాన్ని కూడా మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరిశీలించాలి.

టి.ఎం.బి. బుచ్చిరాజు

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 01:10 AM