Share News

పిడికిలి వదిలినప్పుడు

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:19 AM

వృద్ధాప్యం ఓ ఖాళీ కుర్చీ కాదు కొత్త విత్తనాల కోసం ఎదురు చూస్తున్న నేల. మనమే నాటిన చెట్లు మన నీడ కోసం కాదు, ఆకాశం హద్దుగా ఎదగడానికి....

పిడికిలి వదిలినప్పుడు

వృద్ధాప్యం ఓ ఖాళీ కుర్చీ కాదు

కొత్త విత్తనాల కోసం ఎదురు చూస్తున్న నేల.

మనమే నాటిన చెట్లు

మన నీడ కోసం కాదు,

ఆకాశం హద్దుగా ఎదగడానికి.

పూర్తిగా నిండిన పాత్రలో

మన మనసును వంపాలనుకుంటే

ప్రేమ పొంగిపోయి పొర్లిపోతుంది.

అతి దగ్గరగా నిలిచిన రెండు చెట్లు

సూర్యకాంతిని కోల్పోయినట్లే,

అతి సామీప్యం కూడా

సంబంధాల శ్వాసను ఆపేస్తుంది.

పిడికిలిలో బిగించి పట్టుకున్న ఇసుకలా

ప్రేమను బంధిస్తే

అది వేళ్ల మధ్య జారిపోతుంది.

వదిలిన కాలమే

గాలిలో పరిమళంలా తిరిగి వస్తుంది.

అడిగితే రాని ఆప్యాయత

ఆశలు విడిచినప్పుడు చేరువవుతుంది.

మనసు ఓ తోటగా మారినప్పుడు

పిల్లలు పక్షుల్లా వచ్చి వాలుతారు.

స్వేచ్ఛే నిజమైన సాన్నిహిత్యం

బలవంతం కాదు, అతిబంధమూ కాదు.

పంచిన ప్రేమే

శాశ్వతంగా మనకు తిరిగి లభిస్తుంది ..!

పెరుగు రామకృష్ణ

98492 30443

ఇవి కూడా చదవండి..

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

Updated Date - Jun 15 , 2026 | 02:19 AM