Share News

అమెరికాతో అనుక్షణ అనిశ్చితి!

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:51 AM

సమస్త దేశాలపై తాను విధించిన సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహాన్ని దెబ్బతీసింది. ప్రపంచం హర్షిస్తున్న ఆ తీర్పు పట్ల ట్రంప్‌ మహాశయుడు...

అమెరికాతో అనుక్షణ అనిశ్చితి!

సమస్త దేశాలపై తాను విధించిన సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహాన్ని దెబ్బతీసింది. ప్రపంచం హర్షిస్తున్న ఆ తీర్పు పట్ల ట్రంప్‌ మహాశయుడు మూర్చ రోగిలా ప్రతిస్పందించారు! అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద ఏప్రిల్‌ 2, 2025న అమెరికా అధ్యక్షుడు సమస్త దేశాలపై ‘ప్రతీకార’ సుంకాలు విధించిన విషయం విదితమే.

సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. సుంకాలను వ్యతిరేకించిన సర్వోన్నత న్యాయమూర్తులను ఆయన నానా దుర్భాషలాడారు (గౌరవనీయ న్యాయమూర్తులను విమర్శించడంలో ట్రంప్‌ ఉపయోగించిన పరుష పదజాలం మన దేశంలో అయితే కోర్టు ధిక్కారం కిందకు వచ్చి ఉండేది). అమెరికా సర్వోన్నత న్యాయమూర్తులు తమ రాజ్యాంగ స్ఫూర్తికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. ఇందుకు వారు అభినందనీయులు.

గౌరవనీయ న్యాయమూర్తులను దూషించడంతోనే ట్రంప్‌ ఆగిపోలేదు. ఆ తీర్పు వెలువడిన తరువాత ఇతరేతర చట్టాలను ఉపయోగించుకుని అవే సుంకాలను సమస్త దేశాలపై ట్రంప్‌ మళ్లీ విధించారు. అవి: వాణిజ్య చట్టం, 1974లోని సెక్షన్‌ 122; వాణిజ్య విస్తరణ చట్టం, 1962లోని సెక్షన్‌ 232; వాణిజ్య చట్టం, 1974లోని సెక్షన్‌ 301 (ఈ చట్ట నిబంధన కింద పలు దేశాల ఎగుమతులపై దర్యాప్తునకు ఆదేశిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు); స్మూట్‌–హాలే టారిఫ్‌ చట్టం, 1930లోని సెక్షన్‌ 338.


సరే, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భారత్‌ పరిస్థితి ఏమిటి? అమెరికాకు మన ఎగుమతులు దాదాపు అన్నిటిపైన 15శాతం సుంకం వసూలు చేస్తారు (ఫిబ్రవరి 2, 2026న ప్రకటించిన సుంకం రేటు 18 శాతం). వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్‌ కింద ఉక్కు, అల్యూమినియం, సెమీ కండక్టర్లు, కొన్ని ఆటో విడిభాగాలపై 50శాతం సుంకం అమల్లో ఉంది. ఈ సుంకాలన్నీ హెచ్చు స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ మన ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి, సందేహం లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనంతర పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉభయ దేశాలపై ఆ తీర్పు తక్షణ ప్రభావమేమిటో ఒక పరిణామం చెప్పకనే చెప్పింది: అమెరికా–భారత్‌ మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుదిరూపునిచ్చి సంతకాలు చేసేందుకు అవసరమైన చర్చలను వాయిదా వేయాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి. అయితే ఆ చర్చలు ఎప్పుడు జరిగేది ఏ దేశమూ నిర్దిష్ట తేదీని పేర్కొననే లేదు!

ఇదిలావుండగా సుంకాల పరిణామాలపై అమెరికా కాంగ్రెస్‌ నుంచి పలు వాదనలు వినవస్తున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఐఈఈపీఏ సుంకాలను కొట్టివేసేంత వరకు, కార్యనిర్వాహక వర్గం, అంటే అధ్యక్షుడు ట్రంప్‌ పాలనా యంత్రాంగం పన్ను విధింపు అధికారాలను స్వాయత్తం చేసుకోవడంపై అమెరికా కాంగ్రెస్‌ నిస్సహాయంగా ఉండిపోయింది. తీర్పు వెలువడిన తరువాత కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోనే కాంగ్రెస్‌ ఉన్నది. సుంకాల విధింపునకు తనకు అధికారాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను ట్రంప్‌ అభ్యర్థించే అవకాశం లేదు. సుంకాల విధింపు విషయంలో కాంగ్రెస్‌ ఇప్పటికే తనకు అధికారాల నిచ్చిందని ఆయన విశ్వసిస్తున్నారు. ట్రంప్‌ సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు ఇటీవలే అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు కూడా నిస్సహాయంగా ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన భారత్‌ సంగతి మరి చెప్పనవసరం లేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న ఏ దేశ ప్రతినిధి కూడా తనను కలిసి తాము వాణిజ్య ఒడంబడిక నుంచి వైదొలగనున్నట్టు చెప్పలేదని అమెరికా వాణిజ్యమంత్రి జమియెసన్‌ గ్రీర్‌ చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు ‘మంచి బాలురు’ అని వారు ‘మంచి బాలురు’గానే ఉండిపోవాలని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారు. ట్రంప్‌ అయితే సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలిగిన దేశాలపై చాలా కఠినమైన భారీ సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించారు. మంచి బాలురు మంచి బాలురుగా ఉండకుండా ఎదురుతిరిగితే అందుకు తగిన శిక్ష నెదుర్కోవలసి ఉంటుందనేది ట్రంప్‌ హెచ్చరికలలో అంతర్‌ గర్భితంగా ఉన్న బెదిరింపు. ట్రంప్‌ మాటలను తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు. ఈ పెద్దమనిషి చపలచిత్తుడు. పైగా పక్షపాత వైఖరులతో వ్యవహరించే వ్యక్తి. సుంకాలను కేవలం పన్నులుగా కాకుండా ఆయుధాలుగా ఆయన పరిగణిస్తున్నారు.


ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డి సిల్వా పిలుపునిచ్చారు. అర్థవంతమైన, అవశ్యం పాటించవలసిన పిలుపు అది. బహుశా చైనా మినహా, మరే దేశమూ అమెరికాను ఒంటరిగా ధిక్కరించగల స్థితిలో లేదు. అసమానతలు అనంతంగా ఉన్న ప్రపంచమిది. అత్యంత శక్తిమంతమైన దేశాధ్యక్షుడు నియమరహితంగా ఎవరూ ఊహించలేని రీతుల్లో వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలకు భారత్‌ తలొగ్గింది. జపాన్‌, దక్షిన కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకూ ఈ పరిస్థితి తప్పలేదు. అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికాలో ప్రజాదరణను కోల్పోతున్నారు. ఆయన పాలనప్రశస్తంగా ఉందని అంగీకరిస్తున్ వారు అంతకంతకూ తగ్గిపోతున్నారని పలు సర్వేలు ధ్రువీకరిస్తున్నాయి. ఉద్యోగాలు దుర్లభమైపోతున్నాయి. ధరలు భరించలేని రీతిలో పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతోంది. ట్రంప్‌ అనుసరిస్తున్న వలసల వ్యతిరేక విధానానికి ప్రజామోదం ఉన్నది. అయితే దానిని అమలుపరుస్తున్న తీరుతెన్నులు మానవ హక్కులు, బాలల హక్కులు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని హరించివేస్తున్నాయి.

అమెరికా అంతర్గత వ్యవహారాలలో పరిణామాలు ట్రంప్‌ పలుకుబడిని దెబ్బతీశాయి. ఆయన రాజకీయ ప్రాబల్యాన్ని బలహీనపరిచాయి. నవంబర్‌ 2026లో జరగనున్న ఎన్నికలలో ఆయనకు పరాజయాలు అనివార్యమనే అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ దిగువ సభ లేదా ఉభయ సభలపై రిపబ్లికన్లు నియంత్రణ కోల్పోయే అవకాశమున్నది. అదే జరిగితే ట్రంప్‌ పదవీ కాలంలో మిగిలిన రెండు సంవత్సరాలలోనూ ఆయన పాలన అప్రయోజనకరమవుతుంది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను గౌరవిస్తూ మళ్లీ నియమ ఆధారిత వాణిజ్య పద్ధతులను అనుసరించవచ్చు. అప్పటివరకు భారత్‌కు సానకూల ప్రత్యామ్నాయాలు ఏవీ లేవు. శీఘ్రగతిన మారిపోతుండే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సదా సంసిద్ధమై ఉండడమే తరుణోపాయం.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 01:51 AM