Share News

అమెరికా చలిమంటలకు ఏ చమురు అనర్హం!

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:26 AM

అవకాశవాదం... అమెరికా.. ఈ రెండిటినీ విడదీసి చూడటం అసాధ్యం. ప్రపంచానికి ఎన్ని ఆదర్శాలను అమెరికా చెప్పిందో అంతకుమించి అవకాశవాదాలనూ ప్రదర్శించింది. స్వేచ్ఛా జీవితాన్ని గడపటానికీ....

అమెరికా చలిమంటలకు ఏ చమురు అనర్హం!

అవకాశవాదం... అమెరికా.. ఈ రెండిటినీ విడదీసి చూడటం అసాధ్యం. ప్రపంచానికి ఎన్ని ఆదర్శాలను అమెరికా చెప్పిందో అంతకుమించి అవకాశవాదాలనూ ప్రదర్శించింది. స్వేచ్ఛా జీవితాన్ని గడపటానికీ, ఆనందాన్ని అనుభవించటానికీ పుట్టుకతోనే మనిషికి కొన్ని హక్కులు ఉంటాయని చాలా గొప్పగా తన స్వాతంత్య్ర ప్రకటనలో చెప్పిన అమెరికా దాన్ని ఏనాడూ పాటించలేదు. ఆఫ్రికా నుంచి కొనుగోలు చేసి అమెరికాకు తెచ్చిన లక్షలాది నల్లజాతీయులకు ఆ హక్కులను ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. బానిసత్వాన్ని సహజసిద్ధమైన వ్యవస్థగా ఆమోదించి దశాబ్దాలపాటు దాన్ని అమలుచేసింది. 1965 వరకూ నల్లజాతీయులకు సమానహక్కులను ఇవ్వలేదు. అట్లాంటిక్‌ తీరం నుంచి పసిఫిక్‌ తీరం వరకూ దేశాధికారాన్ని విస్తరించే క్రమంలో వందలాది ఆదిమ తెగలను హరించివేసింది. ప్రజాస్వామ్య రాజకీయాలనూ, వ్యక్తి స్వేచ్ఛనూ, ప్రైవేటు వ్యాపారాలనూ ప్రపంచమంతా విస్తరించటమే తన లక్ష్యాలని చెబుతూ అనేక దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచింది. మత, ఛాందసవాద సమూహాలను ప్రోత్సహించింది. ప్రపంచ ప్రయోజనాల పేరుతో నిన్నటి దాకా తప్పు.. తప్పు.. అని చెప్పి.. ఒక్కరోజులోనే దాన్ని ఒప్పు.. ఒప్పు అనగలిగిన అవకాశవాద నేర్పరితనం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. రష్యా నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఘనంగా చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. నాలుగేళ్లకు పైగా సాగుతోన్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచమే అట్టుడికిపోతోంది. రష్యాది దురాక్రమణగా భావించిన అమెరికా ఎన్ని ఆంక్షలు విధించాలో అన్నీ విధించింది. ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలను అదిరించి బెదిరించి లొంగదీసుకుంది. భారత్‌ కూడా ఒకదశలో రష్యా నుంచి కొనుగోళ్లను దాదాపుగా ఆపివేసింది. రష్యాతో లావాదేవీలను నడిపే దేశాలపై దిగుమతి సుంకాలనూ అమెరికా పెద్దఎత్తున విధించింది. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడే పేరుతో విదేశాల్లో ఉన్న రష్యా ఆస్తులనూ స్తంభింపచేసింది. ఇంతటి శత్రుపూరిత వైఖరిని అతి తేలికగా మార్చుకుని అవకాశవాదంలో తనకు సాటిలేదనే విషయాన్ని అమెరికా మరోమారు స్పష్టంచేసింది. ఇలాంటి అవకాశవాదాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా నిర్వాకాలపై గతంలో లోతైన విశ్లేషణలూ, కవిత్వాలూ చాలానే వచ్చాయి. 1961లో మహాకవి శ్రీశ్రీ కూడా ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీని ఉద్దేశిస్తూ కవిత రాశారు. ‘అరువులిచ్చి కరువు తెచ్చి.. రుణంపెట్టి రణం తెచ్చి.. జనంధనం ఇంధనమై.. చరణ కరాబంధనమై.. జనన జరా మరణ దురాక్రమణల సంగ్రంథనమై.. ఒకనాడోహో అనిపించుక తిరిగిన.. ధనికవాద మికపై వెగటై జిగటై..’ అంటూ ఆనాడు శ్రీశ్రీ రాసిన కవితలో కొన్ని పంక్తులు ఇప్పటికీ బాగా సరిపోతాయి. ట్రంప్‌ హయాంలో అమెరికా ధనికవాదం వెగటై.. జిగటై గతంలో ఎన్నడూ లేనంతగా అసహ్యం పుట్టిస్తోంది. ఒకప్పటి అమెరికా అధ్యక్షులైన అబ్రహం లింకన్‌, జాన్‌.ఎఫ్‌.కెన్నడీ లాంటి వారు వ్యక్తంచేసిన ఆదర్శ అభిప్రాయాలకు ప్రభావితమైన ప్రజాస్వామ్య ప్రియులు చాలామందే ఉండేవారు. ట్రంప్‌ లాంటి వాళ్లకు అట్లాంటివేవీ లేవు కనుక ప్రతి విధానమూ, ప్రతి ప్రకటనా ఇప్పుడు వెగటుగానే అనిపిస్తోంది. అన్నింట్లోనూ అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామనీ, అందుకు అడ్డుగా ఉన్న అంతర్జాతీయ చట్టాలనూ, సంస్థలనూ, ఒప్పందాలనూ కాలరాస్తామని స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెబుతుంటే నాగరీక మనుషులు సహించలేరు. వేల సంవత్సరాల సంస్కృతులు కలిగి, సుదీర్ఘ చరిత్రలో మానవాళి అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన చైనా, భారత్‌ లాంటి దేశాల్లో గతం గురించి సమగ్ర అవగాహన పెరుగుతున్న కొద్దీ అమెరికాపై అసహనం ఎక్కువవుతుందే తప్ప తగ్గదు.


అమెరికా మద్దతు లేకపోతే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇంతకాలం కొనసాగి ఉండేది కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రజాస్వామ్యవాది కాదు. ఆ దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలూ లేవు. నియంతల మనుగడకూ కొన్ని అంశాలు.. ముఖ్యంగా జాతి ప్రయోజనం, గౌరవం, భద్రత పేరుతో కూడినవి.. చాలా బాగా ఉపయోగపడతాయి. అమెరికా సారథ్యంలోని నాటో కూటమి స్వార్థం, అహంకారంతో వేసిన తప్పటడుగులు రష్యాను ఉక్రెయిన్‌ మీదకు ఉసిగొల్పేలా చేయగలిగాయి. జర్మనీ ఏకీకరణ (1990) సందర్భంగా నాటో విస్తరణ ఒక్క అంగుళం కూడా అదనంగా ఉండదని ఆనాటి సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడైన మిఖాయిల్‌ గోర్బచెవ్‌కు అమెరికా హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకే జర్మనీ ఏకీకరణ సాఫీగా సాగటానికి సోవియట్ యూనియన్‌ సహకరించింది. ఆ తర్వాత కొద్దికాలానికే సోవియట్‌ యూనియన్‌ (1991 డిసెంబర్‌ 26) పతనమైంది. రష్యా సహా 15 దేశాలు విడివిడిగా ఏర్పాటయ్యాయి. వీటిల్లో 9 దేశాలు క్రమంగా నాటోలో చేరిపోయాయి. ఒక్క అంగుళం హామీ అలా గాల్లో కలిసిపోయింది. రష్యాలో 2000 సంవత్సరం వరకూ ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులే ఉన్నాయి. వీటికీ ఒక రకంగా అమెరికాయే కారణం. దశాబ్దాల పాటు కొనసాగిన ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక వ్యవస్థను ఒక్కపెట్టున ప్రైవేటుపరం చేయటంతో పరిస్థితులు గాడితప్పాయి. ప్రభుత్వ సంస్థలనూ, కంపెనీలనూ కారుచౌకగా ప్రైవేటు రంగానికి కట్టబెట్టారు. అన్నిటినీ మార్కెట్‌కే వదలివేయటంతో ధరలూ, నిరుద్యోగమూ విజృంభించాయి. బ్లాక్‌మార్కెట్‌ సర్వసాధారణమైంది. విద్య, వైద్యరంగం, ప్రాథమిక సౌకర్యాల్లో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటంతో జీవన ప్రమాణాలు క్షీణించాయి. ప్రైవేటురంగంతో పోటీ పెరిగి రష్యా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్న జోస్యాలు ఏ రకంగానూ నిజంకాలేదు. ఒకరకంగా అరాచకమే ప్రబలిపోయింది. అట్లా అమెరికా ప్రభుత్వమూ, ఆ దేశ మేధావులూ సూచించిన విధానాలు అస్తవ్యస్త పరిస్థితులకే దారితీశాయి. పుతిన్‌ అధికారాన్ని చేజిక్కించుకోటానికి అవే కారణమయ్యాయి. ఆ నేపథ్యంలోనే రష్యాకు మళ్లీ ఒకనాటి వైభవాన్ని తీసుకువస్తానన్న పుతిన్‌ వాగ్దానాలు ప్రజలపై ప్రభావాన్ని కలగచేశాయి. ఒక భాష, ఒక మతం, ఒక జాతి (Ethnic Community) దేశ అస్తిత్వానికి పునాదిగా ఉన్నచోట భావోద్వేగాలను రెచ్చగొట్టటం తేలిక. రష్యాకు చుట్టూ ప్రమాదం ముంచుకొస్తోందన్న పుతిన్‌ ప్రచారానికి ఆ ఉద్వేగాలు తోడ్పడ్డాయి. ఉక్రెయిన్‌, జార్జియాలు కూడా భవిష్యత్తులో నాటోలో చేరతాయన్న ప్రకటనతో (2008) రష్యాలో భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఇక అక్కడి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బాగా దృష్టి పెట్టింది. రష్యాకు అనుకూలంగా ఉండే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యూనుకోవిట్‌ అధికారాన్ని కోల్పోవటంలో అమెరికా, పశ్చిమ యూరప్‌ దేశాల పాత్ర చాలా ఉంది. మైదాన్‌ విప్లవం పేరుతో ఉక్రెయిన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలకు అమెరికా పూర్తిగా సహకరించింది. ఆ వెంటనే క్రిమియాను రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్‌లోని రష్యా సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాట్లను పోత్సహించింది. చివరికి 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది.


ఉక్రెయిన్‌కు యుద్ధ సహాయం కింద అమెరికా ఈ ఏడాది మార్చివరకూ రూ.12 లక్షల కోట్లను ఖర్చుపెట్టింది. మొత్తంగా రూ.17 లక్షల కోట్లు వ్యయం అవుతాయని లెక్కలుకట్టింది. ఇవిగాక ప్రపంచ బ్యాంకు నుంచి ఉక్రెయిన్‌కు రూ.1.90 లక్షల కోట్లను రుణంగా ఇప్పించింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మరో రూ.22 లక్షల కోట్లను ఉక్రెయిన్‌ యుద్ధానికి ఖర్చు చేస్తోంది. అంటే అమెరికా, ఈయూ కలిసి దాదాపు రూ.40 లక్షల కోట్లను వెచ్చిస్తున్నాయి. ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా ఉంటుందనీ, నాటో కూటమిలో చేర్చుకునేది లేదనీ స్పష్టంచేయకుండా, నాలుగున్నర ఏళ్ల నుంచీ దౌత్యపరమైన చొరవను ప్రదర్శించకుండా, లక్షల మరణాలకూ, భౌతిక ఆస్తుల విధ్వంసానికి అమెరికాయే ప్రధానంగా ప్రత్యక్ష, పరోక్ష కారణమైంది. ఇంతగా కకావికలు చేసి మధ్యంతర ఎన్నికల్లో గెలవటానికి రష్యా చమురు కొనుగోలునే అస్త్రంగా చేసుకుని రాజకీయంగా దిగజారిపోతున్న ప్రతిష్ఠను కాపాడుకోటానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే మళ్లీ రష్యా చమురు అమ్మకాలపై నిషేధాన్ని విధించొచ్చు. యుద్ధం వల్ల ఇప్పటికే జరిగిన ప్రాణనష్టం లక్షల్లో ఉంది. అనధికార అంచనాల ప్రకారమే ఇరు దేశాలకు చెందిన 6 లక్షల మంది సైనికులు మరణించారు. ఇందులో రష్యను సైనికులే నాలుగున్నర లక్షల దాకా ఉండొచ్చు. పౌరులు 20 వేల మంది చనిపోయి ఉంటారన్నది అంచనా. గాయపడిన వాళ్లు 15 లక్షల దాకా ఉండొచ్చు. ఆస్తుల విధ్వంసం, ఆర్థిక వ్యవస్థకు ఇతరత్రా జరిగిన నష్టం ఉక్రెయిన్‌లోనే రూ.82 లక్షల కోట్లు ఉంటుంది. యుద్ధం ముగిస్తే ఆ దేశంలో పునర్‌ నిర్మాణానికి రూ.56 లక్షల కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ఇక రష్యాలో జరిగిన నష్టం గురించి అంచనాలు బయటకు రావటం లేదు. ఉక్రెయిన్‌తో పోల్చితే అది నాలుగో వంతే ఉండొచ్చు.


ఈ శతాబ్దంలో అమెరికా ప్రత్యక్షంగా యుద్ధాలు చేసిన చోటా (ఆఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌), పరోక్షంగా యుద్ధాలను రగిల్చిన చోటా ఎక్కడా శాంతిని నెలకొల్పిన దాఖలాల్లేవు. అవకాశవాదమే పైచేయి అవ్వటంతో మధ్యలోనే తప్పుకొని బాధితులనే పరిస్థితులను చక్కదిద్దుకోమని వదిలివేయటమే ఎక్కువ. ఆఫ్ఘానిస్థాన్‌లో అదే చేసింది. చివరికి తాలిబన్లకే అక్కడ అధికారం అప్పగించింది. వాళ్లక్కడ ఆటవిక పాలనను అమలుచేస్తున్నారు. ఉక్రెయిన్‌ విషయంలో కూడా అదే చేసే అవకాశం ఉంది. రష్యా కోరిన విధంగా భూభాగాలను అప్పగించి శాంతిని కుదుర్చుకోవాలనే లోపాయికారిగా చెబుతోంది. అణ్వస్త్రాలను తయారుచేసే సామర్థ్యాన్ని సంతరించుకుంటోందన్న నెపంతో ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి, చేయాల్సిన విధ్వంసం చేసిన తర్వాత అనుకున్నది సాధించలేని అశక్తతలో పడిపోయింది. ఎన్ని బీరాలు పలికినా ఇరాన్‌ నియంత్రణను కాదని హోర్ముజ్‌ జలసంధిలో చమురు రవాణాను సమగ్రంగా పునరుద్ధరించలేకపోయింది. అందుకే అవకాశవాదాన్ని మరోమారు ఆశ్రయించి రష్యా చమురు విక్రయాలకు అనుమతించింది. అన్ని రంగాల్లో ముందున్నామని ప్రకటించుకునే అమెరికా అవకాశవాదంలోనూ అగ్రగామిగా ఉండటం కొత్తేమీ కాకపోవచ్చు. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో, ఆసియా దేశాలు దూసుకుపోతున్న శతాబ్దంలో అమెరికా ఏకాకిగా మారే తరుణం ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ఆ ఛాయలు కన్పిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ తప్ప ఎవరూ ఇప్పుడు అమెరికాను విశ్వసించటం లేదు. భారత్‌ వాణిలో కూడా ఇటీవల మార్పులు వస్తున్నాయి. అమెరికా ఒంటరితనాన్ని కోరితెచ్చుకుంటోందని విదేశాంగమంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించటమే అందుకు నిదర్శనం.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:26 AM