Share News

అమెరికా ఎన్నికల్లో సాంస్కృతిక పోరాటాల్లేవ్‌ !

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:10 AM

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు ‘తప్పులు సరిదిద్దుకోవటం’లో ప్రజాస్వామ్యానికున్న బలాన్ని చాటాయి. చాలామంది ఊహించినదానికంటే ఎక్కువ మార్పునే అమెరికా ఓటర్లు చూపారు. అధ్యక్షుడు...

అమెరికా ఎన్నికల్లో సాంస్కృతిక పోరాటాల్లేవ్‌ !

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు ‘తప్పులు సరిదిద్దుకోవటం’లో ప్రజాస్వామ్యానికున్న బలాన్ని చాటాయి. చాలామంది ఊహించినదానికంటే ఎక్కువ మార్పునే అమెరికా ఓటర్లు చూపారు. అధ్యక్షుడు తాననుకున్నది చేయటానికి కాంగ్రెస్‌లో మెజారిటీ కీలకం. లేదంటే విదేశీ విధానాల్లో, రక్షణ, దేశ భద్రత విషయాలలో తప్ప ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాల ఫలితాలు పరిమితంగా ఉంటాయి. తాజా ఎన్నికల తర్వాత ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్‌ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. సెనేట్‌లోనూ దాని ఆధిక్యం గణనీయంగా పెరిగింది. అధ్యక్షుడి రెక్కలు కత్తిరించారు ప్రజలు. అటు ప్రతినిధుల సభ, ఇటు సెనెట్‌ రెండింటి లోనూ అధికార పార్టీకి భారీ వ్యతిరేకత వ్యక్తమవటం చాలా అరుదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946, 1994, 2010లో మాత్రమే అలా జరిగింది.

సరిహద్దుల్ని కట్టుదిట్టం చేసి, అక్రమ వలసల్ని ఆపుతారనే నమ్మకంతోనే ట్రంప్‌కి చాలామంది సంప్రదాయ డెమోక్రాట్‌ ఓటర్లు మద్దతిచ్చారు. కానీ దాన్ని క్రూరంగా, మానవ హక్కుల ఉల్లంఘనలా, ఆయా దేశాల్లో ఎన్నికైన ప్రభుత్వాధినేతల్ని అవమానించేలా మార్చి ట్రంప్‌ వ్యవహరించటం, వాచాలత్వాన్ని ప్రదర్శించటం అధిక శాతం అమెరికన్లకు ఆమోదయోగ్యం కాలేదు. అదేవిధంగా, ఇరాన్‌పై యుద్ధంతో అనుకున్న ప్రయోజనాలు నెరవేరకపోగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించి, డీజిల్‌, గాసోలిన్‌ ధరలు పెరిగేట్టు చేసింది. అమెరికా విదేశాంగ విధానం ఆధారంగా ఆ దేశ ప్రజలు ఓటు వేయటం ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా అరుదు. కానీ, ఈసారి సుంకాలు, ఇరాన్‌ యుద్ధం పర్యవసానంగా స్థానికంగా ఇంధన ధరలు, ఇతర వ్యయాలు అధికమైనాయి. సగటు అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెరగకపోగా, వలసవిధానం అమలు తీరుతో రైతులు, చిన్నా పెద్దా సంస్థలు మానవ వనరులు దొరక్క ఇబ్బంది పడ్డాయి. వీటన్నింటికీ అధ్యక్షుడి అరాచక ధోరణే కారణమని ప్రజలు భావించారు. కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లోనూ రిపబ్లికన్‌ పార్టీ ఓడింది. ఆఫ్రో అమెరికన్‌, లాటిన్‌ అమెరికన్‌ తొలిసారి గవర్నర్లుగా ఎన్నికయ్యారు. ఎనిమిది రాష్ట్రాల్లో రిపబ్లికన్‌లకు అనుకూలంగా 16 స్థానాలను ట్రంప్‌ పునర్విభజించినా కొత్త కాంగ్రెస్‌ సీట్లలో ప్రతి అయిదులో ఒకటి మాత్రమే రిపబ్లికన్లు గెలవగలిగారు. ప్రపంచ ప్రజాస్వామ్యానికి దిక్సూచిలాంటి తమ దేశం అప్రజాస్వామిక, భావోద్వేగ నిర్ణయాల బారిన పడటాన్ని సహించలేని అమెరికన్లు జాతి, మత, తెగ, వర్ణాలకు అతీతంగా ఏకమైనారు. తాము ఏ పార్టీకీ శాశ్వత ఓటర్లం కాదని, కొన్ని విలువలకి, తమ జీవితంలో బాగోగులకి అనుగుణంగా ఓటుని మార్చుకునే శక్తి ఉందని రుజువు చేశారు. ఇలా ఓటర్లు పార్టీ విధేయత కంటే విలువలు, ఉమ్మడి ప్రయోజనాలకి పెద్దపీట వెయ్యటం ప్రజాస్వామ్యం మనుగడకి, విజయానికి కీలకం. ఈ మధ్యంతర ఫలితాల తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తిరిగి తన అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సమీక్షించుకోవచ్చు. ట్రంప్‌ నీడ నుంచి పలువురు నేతలు బయటపడి ప్రజాస్వామ్యానికి కీలకమైన హేతుబద్ధతతో వ్యవహరించవచ్చు.


ఈ ఎన్నికల్లో ఎటువంటి సాంస్కృతిక పోరాటాలూ లేవు. కేవలం అధ్యక్షుడి వ్యవహారశైలి వల్ల రోజువారీ జీవితంలో కష్టాలు పడుతున్నామన్న భావనే ప్రజల ఓటింగ్‌ సరళిని మార్చింది. టెక్సాస్‌, ఓహయో, జార్జియా లాంటి మితవాద రాష్ట్రాలన్నింటిలోనూ డెమోక్రాటిక్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. ఫ్లోరిడాలో గవర్నరు ఎన్నికలో కేవలం 1.3శాతం ఓట్లతో డెమోక్రాట్లు ఓడారు. అమెరికన్‌ ప్రజల ఓటు డెమోక్రాటిక్‌ పార్టీలో వామపక్ష అతివాదులకు కాక, మధ్యేవాద, మితవాదులకి అనుకూలంగా పడింది. డెమోక్రాట్లు తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలంటే ఈ మధ్యేవాద రాష్ట్రాలలో ప్రజలని ఆకట్టుకోవాలి. ఈ పరిస్థితి డెమోక్రాటిక్‌ పార్టీ భవిష్యత్తుకి, అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం. అతివాదం, మితిమీరిన పక్షపాత ధోరణి, ద్వేష రాజకీయం స్థానంలో మితవాదం, మధ్యేమార్గం, ఇతర వర్గాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి బలపడే అవకాశం ఉంది.

తమ 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సంవత్సరంలో అమెరికన్లు ఇచ్చిన తీర్పు వల్ల ట్రంప్‌ పశ్చిమాసియా యుద్ధంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. భారత్‌కు వీసాల విషయంలో ఊరట లభించవచ్చు. భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చు. ఇవన్నీ భారత్‌ని కొంత ఊపిరిపీల్చుకునేలా చేస్తాయి. మెరుగైన విద్య, అవకాశాల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న మధ్యతరగతి భారతీయులకు ఈ ఫలితాలు ఉపశమనం. రిపబ్లికన్‌ అభ్యర్థుల్ని గెలిపిస్తే 5 వేల డాలర్ల చెక్‌ ఇస్తానని ట్రంప్‌ హామీ ఇవ్వటం, మస్క్‌ లేజర్‌ కిరణాల్లా డబ్బును వెదజల్లటం వంటివి ఉన్నా, ప్రజలు తమ రోజువారీ జీవితం, భవిష్యత్తు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ఓటు వేశారు. ట్రంప్‌ అతివాద దూకుడును సహించబోమని మధ్యేమార్గానికి పట్టం గట్టారు. మన దేశంలోనూ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అధికారమే లక్ష్యంగా హేతుబద్ధతలేని విధానాలు, సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు వంటివి కొనసాగిస్తే ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ఎంత అద్భుతంగా సోషల్‌ ఇంజినీరింగ్‌ చేసి ప్రజల్ని విభజించి ఒకరిమీద ఒకరిని ఉసిగొల్పి లబ్ధిపొందాలని చూసినా అది తాత్కాలికమేనని, తటస్థ ఓటర్లు ఏ పార్టీకీ గుత్తాధిపత్యాన్ని అందించరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అంతిమం మాత్రమే కాదు, అది నిరంతరం మారుతూ దేశాన్ని సమాజాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి సంస్కరణల్ని అమలు చేస్తేనే ఎంత చరిత్ర ఉన్న పార్టీలు, నేతలకైనా భవిష్యత్తు ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్‌ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రజల తీర్పు కీలక సమయంలో మనందరికీ గుర్తుచేసింది.

జయప్రకాశ్‌ నారాయణ్‌

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 15 , 2026 | 03:10 AM