Share News

అంతంలేని ఆయుధప్రేమ.. అంతేనయా!

ABN , Publish Date - May 01 , 2026 | 01:58 AM

ఆయుధంతో అన్నీ సాధించాలనే లక్ష్యం ఉన్నవారు చివరకు దానికే బలి అవుతారని మనం తరచూ వింటూంటాం. హింసతో అంతిమంగా దేన్నీ సాధించలేమని చెప్పటానికి ఇట్లాంటి హితబోధనలు 20వ శతాబ్దంలో...

అంతంలేని ఆయుధప్రేమ.. అంతేనయా!

ఆయుధంతో అన్నీ సాధించాలనే లక్ష్యం ఉన్నవారు చివరకు దానికే బలి అవుతారని మనం తరచూ వింటూంటాం. హింసతో అంతిమంగా దేన్నీ సాధించలేమని చెప్పటానికి ఇట్లాంటి హితబోధనలు 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం పొందాయి. రాజకీయాధికారాన్ని పొందటానికి ప్రజాస్వామ్యం శాంతిమార్గాన్ని ఏర్పరచిందనీ, సమాజంలో సమూల సంస్కరణలను అమల్లో పెట్టాలనుకునే వారందరూ ఆ మార్గంలోనే నడవాలనటంలో అమెరికా పాలకులే ముందంజలో ఉన్నారు. ఆ తరహా బోధనలకూ, హితోక్తులకూ అనుగుణంగా అమెరికా వ్యవహరిస్తోందా? అని ప్రశ్నించుకుంటే జవాబు భయానకంగా ఉంటుంది. తుపాకీ సంస్కృతికి వందలేళ్ల నుంచి పెద్దపీట వేసిన దేశం 21వ శతాబ్దంలోనూ దాన్ని వదిలించుకోలేకపోతోంది. ఏప్రిల్‌ 25న శ్వేతసౌధంలో విలేఖరులకు ఇచ్చే విందు సమావేశంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికా తుపాకీ సంస్కృతికి ఒక మచ్చుతునక మాత్రమే. అయినా ఆ సంస్కృతికి స్వస్తిచెప్పటానికి అవసరమైన చర్యలను అమెరికా పాలకులు తీసుకోలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నూ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌నూ ఇతర మంత్రులనూ కాల్పులబారిన పడకుండా కాపాడటం తన సమర్థతకు గీటురాయిగా రహస్య పోలీసు విభాగం ప్రకటించుకుంది. అదే సమర్థతను అన్ని సందర్భాల్లోనూ ప్రదర్శించిన దాఖలాల్లేవు. అమెరికా చరిత్రలో నలుగురు అధ్యక్షులు తుపాకీ గుళ్లతో ప్రాణాలను కోల్పోయారు. నల్లజాతి ప్రజలకు సమానహక్కులు ఉండాలని పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సైతం తుపాకీ సంస్కృతికి బలైపోయారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వల్లే పౌరసమానత్వం అమెరికాలో సాధ్యమైంది. 1964 నాటి పౌరహక్కుల చట్టం అమెరికా చరిత్రలోనే ఒక కీలక మలుపు లాంటిది. రంగు, జాతి, లింగం, మతంతో ప్రమేయం లేకుండా పౌరహక్కుల్లో అందరికీ సమానత్వం లభించే పరిస్థితి అంతకుముందు అమెరికాలో లేదు.


దేశాధినేతల మరణాలకే కారణమైన తుపాకీ సంస్కృతి ప్రజల జీవితాల నుంచి జారిపోకుండా దాన్ని పదిలంగా కాపాడటానికి పెద్ద లాబీనే అమెరికాలో పనిచేస్తోంది. అమెరికాలో పరిశ్రమాధిపతులూ, పెట్టుబడిదారులూ తమ ప్రయోజనాలను కాపాడుకోటానికీ పెంచుకోటానికీ రాజకీయనేతలను బహిరంగంగానే ప్రభావితం చేస్తారు. కోట్ల డాలర్లను అందుకోసం కుమ్మరిస్తారు. తమ తరఫున పనిచేయటానికి లాబీయింగ్‌ చేసే సంస్థలతో ఒప్పందాలనూ కుదుర్చుకుంటారు. ఎంతగా లాబీయింగ్‌ చేసినా తక్షణావసరం లేని పిస్టళ్లనూ, రివాల్వర్లనూ, హ్యాండ్‌గన్లనూ ప్రజలు ఎందుకు కొంటున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. నిరంతర అభద్రత అనేది ఇప్పటి అమెరికన్ల జీవితాల్లో కనపడదు. అసాధారణ నేరాలు జరిగే పరిస్థితులూ అక్కడలేవు. కనీసం సరిహద్దు ప్రాంతాల్లో అటువంటివి ఎక్కువ జరుగుతున్న దాఖలాల్లేవు. అయినా ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా అక్కడి ప్రజలు ఆయుధాలను కొంటూనే ఉంటారు. తుపాకులను ఉంచుకోవటం ధీరోదాత్తలక్షణంగా, వీరోచిత వారసత్వం కొనసాగింపుగా, వ్యక్తి స్వతంత్రకు నిదర్శనంగా ప్రజల సంస్కృతిలో, ఆలోచనల్లో నాటుకుపోయేలా చేయటంలో అక్కడి ఆయుధ పరిశ్రమల లాబీ విజయవంతమైంది. అలా అవ్వటానికి కథలనూ, కవిత్వాలనూ, సినిమాలనే కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని సాంస్కృతిక రూపాలనూ ఉపయోగించుకున్నారు. తుపాకీని ప్రయోగించటం, పేల్చటం పురుష లక్షణంగా, కుటుంబ సంరక్షకుడికి ఉండాల్సిన నేర్పరితనంగా, సాహసగుణానికి ప్రతీకగా ప్రజలు భావించేలా చేయగలిగారు. కౌబాయ్‌ల జీవితాల చుట్టూ అల్లిన కథలూ గాథలూ అందులో భాగమే. సినిమాలను ఉపయోగించుకుని కౌబాయ్‌ల తుపాకీ సాహస విన్యాసాలపై చాలా ఆసక్తిని కలిగించారు.

సంస్కృతి అనేది ఒక్క ఏడాదిలో ఏర్పడదు. దానికి దశాబ్దాల, శతాబ్దాల కాలం కావాల్సి వస్తుంది. తుపాకీ కలిగి ఉండటం అన్నది సంస్కృతిలో ప్రధానభాగం కావటం అమెరికాలో ఆషామాషీగా జరగలేదు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అమెరికా ఖండంలో స్థానికజాతులతో యుద్ధాలు, వాళ్ల భూములను ఆక్రమించుకోవటాలు, వాళ్ల నుంచి నిరంతరం రక్షించుకోవాలన్న అవసరాలు అక్కడి చరిత్రలో ఒకనాడు ప్రధానమైనవి. వీటితోపాటు తుపాకుల తయారీ ఒక పరిశ్రమగా పాదుకున్న తర్వాత దానికి ఇంటాబయటా నిరంతరం మార్కెట్‌ను విస్తరించుకోవాల్సిన ఆధునిక వ్యాపార అవసరమూ ఏర్పడింది. ఈ రెండు కారణాలు అమెరికాలో తుపాకీ సంస్కృతి బలపడటానికీ కొనసాగటానికీ కీలకంగా పనిచేశాయి. ఇంకా చేస్తున్నాయి కూడా.


అమెరికా స్వాతంత్య్రం ప్రకటించుకున్న నాటికి 13 వలస రాష్ట్రాలే ఉన్నాయి. బ్రిటన్‌ నుంచి అమెరికా స్వాతంత్ర్యాన్ని ఖాయపరిచిన 1783 ప్యారిస్‌ ఒప్పందం నాటికి ఆ రాష్ట్రాల కింద 2.3 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల భూభాగమే ఉండేది. ప్రస్తుత అమెరికా విస్తీర్ణం 9.8 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు. ఇంత విస్తీర్ణంలో అమెరికా అజమాయిషీ వ్యాప్తిచెందటానికి దశాబ్దాలు పట్టింది. 1783 నుంచి 1959 వరకూ అది కొనసాగింది. ఆ దశను ప్రధానంగా పశ్చిమ విస్తరణగా పేర్కొంటారు. అట్లాంటిక్‌ సముద్రాన్ని అంటి ఉన్న రాష్ట్రాల నుంచి ఫసిఫిక్‌ సముద్రం వరకూ అమెరికా విస్తరించటం మామూలుగా, ప్రశాంతంగా జరగలేదు. ఆ విస్తరణ కాలంలో స్థానిక జాతులతో, ప్రజలతో అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కానీ ఆనాటి అన్ని సంఘర్షణలూ, యుద్ధాలూ చరిత్రలోకి ఎక్కలేదు. ఎందుకంటే పరాజితుల సంపూర్ణచరిత్రలు విజేతల జ్ఞాపకాల్లోకి చేరవు. విజయానికి తోడ్పడ్డ ఘటనలకే అవి పరిమితం అవుతాయి. పశ్చిమ విస్తరణ కాలంలో చిన్నవీ పెద్దవీ కలిసి 100కు పైగా యుద్ధాలు, సంఘర్షణలు జరిగాయని మాత్రమే ఇప్పటివరకూ తెలుస్తోంది. ఇక స్థానిక జనాభా గురించిన లెక్కలు కూడా కచ్చితమైనవి లేవు. ఉన్నవన్నీ అంచనాలు మాత్రమే. వాటి ప్రకారం 1783 నాటికి 60 లక్షల నుంచి 150 లక్షల మంది స్థానిక జాతుల ప్రజలు ఉండేవారు. పశ్చిమ విస్తరణలో భాగంగా యుద్ధాల వల్లే గాక ఇతరత్రానూ జీవన విధ్వంసం జరిగింది. యూరపు నుంచి వలస వచ్చిన వారి ద్వారా సంక్రమించిన వ్యాధులు కూడా స్థానిక ప్రజల మరణాల్లో కీలకపాత్రనే పోషించాయి. 50 రాష్ట్రాల అమెరికా భౌగోళిక రాజకీయ పటం స్పష్టంగా రూపుదిద్దుకున్న నాటికి (1959) స్థానికప్రజలు చాలావరకూ సమిధలైపోయారు. 4లక్షల మంది మాత్రమే నామమాత్రంగా మిగిలారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన నాటికి ఉన్న 13 రాష్ట్రాలు మినహా మిగిలిన 37 రాష్ట్రాల భూభాగాల గురించి అప్పటికి తెలిసింది చాలా తక్కువ. కొత్త ప్రాంతాల్లో ప్రతిఘటించే స్థానిక ప్రజలను లొంగదీసుకోవటంతో పాటు ఇతరత్రానూ తుపాకులు అవసరమయ్యాయి. జంతువుల వేట, అడవుల్లోకి చొచ్చుకువెళ్లటం లాంటివి కూడా ఆయుధాలను అనివార్యం చేశాయి. స్వాతంత్య్ర ప్రకటన నాటికే కొత్త ప్రాంతాల్లోకి విస్తరించటం అత్యవసరంగానూ గుర్తించారు. ఆఫ్రికా నుంచి బానిసలుగా కొనుక్కుని వచ్చిన నల్లజాతి ప్రజలను అదుపులో పెట్టుకోటానికి కూడా తుపాకులు కావాల్సి వచ్చాయి. అందుకే తుపాకులను ఉంచుకోవటాన్ని మౌలిక హక్కుల్లో భాగం చేశారు. 1791లో రాజ్యాంగానికి చేసిన రెండో సవరణలో భాగంగా రూపొందిన బిల్‌ ఆఫ్‌ రైట్స్‌లో తుపాకీని చేతబట్టే హక్కు ఒక ప్రధాన నిబంధనగా చేరింది.


విచ్చలవిడి తుపాకీ కాల్పుల్లో అమాయకులైన పిల్లలూ, పెద్దలూ అమెరికాలో మరణించినప్పుడల్లా ఆయుధాలపై పరిమితులు విధించటానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రభుత్వాలు ఆ దిశగా వేద్దామనుకున్న ప్రతి అడుగునూ తుపాకీ పరిశ్రమ లాబీ అడ్డుకుంది. వ్యక్తిస్వేచ్ఛ, ఆత్మరక్షణ అనేవి రాజ్యాంగహక్కు అనీ ఆయుధాలపై నిషేధం విధించటం దాన్ని హరించటమేనంటూ యాగీ చేసింది.

అమెరికా పౌరుల చేతుల్లో ప్రస్తుతం 39 కోట్ల వివిధ రకాల గన్‌లు ఉన్నాయి. అంటే ప్రతి 100 మందికి 120 ఆయుధాలు ఉన్నాయి. ఎవరిదగ్గర ఎన్ని గన్లు ఉన్నాయని స్పష్టంగా తెలుసుకోటానికి ఇప్పటికీ నేషనల్‌ రిజిస్ట్రీ అనేది లేదు. సమగ్ర సమాచార సేకరణకు చాలా రాజకీయ వ్యతిరేకత ఉంది. వ్యక్తిగత గోప్యతా హక్కు పరిరక్షణ పేరుతో కూడా సమాచారాన్ని రాబట్టటం లేదు. ఏటా పౌరులకు అమ్మే తుపాకీల వ్యాపార విస్తృతి చూస్తే ఆశ్చర్యపోతాం. 15 నుంచి 25 బిలియన్‌ డాలర్ల (రూ. 2.37 లక్షల కోట్ల వరకూ) వరకూ ఏటా ఈ వ్యాపారం ఉంటుంది. గత 30 ఏళ్లలో 11 లక్షల మంది తుపాకీ కాల్పులకు బలైపోయారు. వాళ్లలో తుపాకులతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 60శాతం వరకూ ఉన్నారు. క్షణికావేశానికి లోనైనప్పుడు ఆయుధాలు అందుబాటులో ఉండటం హత్యలకూ, ఆత్మహత్యలకూ దారి తీయటం ఎక్కువవుతుంది. మనోవైకల్యంతో విపరీతపోకడలకు లోనయ్యేవారికి ఆయుధాలు తేలికగా దొరకటంతో తాము ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఊరూపేరూ తెలియని వారి ప్రాణాలుతీసిన ఘటనలూ చాలా ఉన్నాయి.


అమెరికాకు ఇప్పుడు సరిహద్దు విస్తరణ లేదు. స్థానికజాతుల నుంచి భూములను ఆక్రమించుకునే అవసరమూ లేదు. ఆనుపానులు తెలియని ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకుని వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అగత్యమూ లేదు. గతంలో లాగా ఎక్కడికక్కడ ప్రజలు సాయుధులుగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితీ లేదు. ఆయుధాలు అవసరమైన ఒకనాటి సమాజం ఛాయలే ఇప్పుడు లేవు. అయినా అమెరికాలో ఆయుధప్రేమ ఇప్పటికీ బలంగానే ఉంది. ఆయుధంలేని జీవితంలో లోపం ఉందనే విపరీత భావనను ఆ సమాజం దాటలేకపోవటానికి గన్‌ పరిశ్రమ లాబీయింగే ప్రధానకారణం. లాభాల కోసం సమాజం ఎటుపోయినా పర్వాలేదనే పోకడ స్వేచ్ఛా వాణిజ్యానికి పెద్దపీట వేసే చోట సహజంగానే ఉంటుంది. దాన్ని కట్టడి చేయటానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గన్‌ లాబీయింగ్‌కు దాసోహం అంటోంది. ప్రజలు కావాలంటున్నారు కాబట్టి ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నామని తుపాకీ తయారీ కంపెనీలు చేసుకునే సమర్థనల్లో ఎంత డొల్లతనం ఉందో ‘ద గన్నింగ్‌ ఆఫ్‌ అమెరికా’ పుస్తకంలో పమేలా హాగ్‌ ఎండగట్టారు. ఇబ్బడిముబ్బడిగా తుపాకీలను తయారుచేసి ఆ తర్వాత ప్రజలు వాటిని కొనేలా కృత్రిమ అవసరాన్ని సృష్టించారు. అందుకే అమెరికాలో ఆయుధప్రేమ అన్ని హద్దులనూ దాటింది. అది కలగచేసే విపరీతాలనూ తెచ్చిపెట్టే లాభాలనూ వ్యక్తి స్వేచ్ఛకు నిదర్శనంగా భావించే ధోరణి ఆ సమాజంలో చెల్లుబాటు అవ్వటానికీ అదే కారణం. అదుపులేని ఆయుధప్రేమకు ఎంతటి మూల్యాన్నైనా చెల్లించటానికి ఈ రోజుకూ అమెరికా సిద్ధంగానే ఉంది! మనుషుల ప్రాణాలకంటే తుపాకీ అమ్మకాలే అక్కడ విలువైనవి! సాక్షాత్తూ దేశాధ్యక్షుడే గన్‌ చేతబట్టిన ఫోటోపోజుతో ప్రపంచం ముందు తనను తాను ప్రదర్శించుకోవటం అమెరికా ఆయుధ దాహానికి నిలువుటద్దంగాక మరేమిటి?

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 01:58 AM