Share News

‘అర్బన్ నిక్సనైట్లు’ ఉన్నారు జాగ్రత్త!

ABN , Publish Date - May 13 , 2026 | 12:11 AM

దాదాపు పది సంవత్సరాలుగా బి.జె.పి ప్రభుత్వం నోటినించీ, దాని సమర్ధకుల నోళ్ళ నించీ విరివిగా వినవస్తున్న మాట: ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘అర్బన్ నక్సలైట్లు’. ఈ మాటని ప్రధానంగా, మావోయిస్టుల్ని...

‘అర్బన్ నిక్సనైట్లు’ ఉన్నారు జాగ్రత్త!

దాదాపు పది సంవత్సరాలుగా బి.జె.పి ప్రభుత్వం నోటినించీ, దాని సమర్ధకుల నోళ్ళ నించీ విరివిగా వినవస్తున్న మాట: ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘అర్బన్ నక్సలైట్లు’. ఈ మాటని ప్రధానంగా, మావోయిస్టుల్ని సమర్ధించే పట్టణవాస మేధావుల్ని ఉద్దేశించి అంటారు. కానీ, ప్రధాని మోదీ దృష్టిలో, మావోయిస్టులే కాకుండా, తన ప్రత్యర్ధులైన రాహుల్‌గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా ‘అర్బన్ నక్సల్సే.’ ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో, నక్సలైట్ల అణచివేతను సాగించిన పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ కూడా ‘అర్బన్ నక్సలైటే’నా? ఎంత విచిత్రం? ‘రాజకీయ పదాల డిక్షనరీ’లోకి కొత్తగా వచ్చిన ఈ పదం పుట్టుపూర్వోత్తరాలు చూడండి!

‘అర్బన్ నక్సల్స్’ అనే మాటని మొదట వాడినది ‘వివేక్ అగ్నిహోత్రి’ అనే సినిమా దర్శకుడు. ఈయనకి బి.జె.పి అనుకూలుడిగా, ప్రత్యేకించి మోదీ సమర్ధకుడిగా గుర్తింపు ఉంది. ఇతను తీసిన ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాని మోదీ చూడడమే కాకుండా, బి.జె.పి ఎమ్మెల్యేలు అందరూ చూడాలని సిఫార్సు చేసిన వార్త 2022 మార్చి 15న అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ వచ్చింది. ఏది ఏమైనా, శతృ శిబిరానికి చెందిన మేధావుల్ని వర్ణించడానికి, ఒక కొత్త పదాన్ని సృష్టించాడూ అంటే, వివేక్ అగ్నిహోత్రిలో చెప్పుకోదగ్గ సృజనాత్మకత ఉందన్న మాట! ఇది ప్రశంసనీయం! అవును మరి, వర్గ సమాజంలో, కవులూ కళాకారులు, తమ సృజనాత్మకతని, తమ తమ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించడం సహజం. దానికి తగిన ప్రతిఫలం పొందడం కూడా సహజం. మార్చి 9న విడుదలైన ఆ సినిమాని, మోదీ 15న వీక్షించి, ‘ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి’ అని ప్రకటించిన తర్వాత, ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రంగా, ఆ మరుసటి సంవత్సరం ప్రభుత్వ సినిమా అవార్డుల కమిటీ ప్రకటించింది. ‘రాజు తలుచుకుంటే...’ అంటారే, అలాగ!

ఇంక ఇప్పుడు, అసలు ‘నక్సలైట్లు’ అనే పదం ఎలా పుట్టిందో చూడాలి. 1967 మార్చిలో, పశ్చిమ బెంగాల్‌లో, నక్సల్బరీ అనే ప్రాంతంలో కొంతమంది కమ్యూనిస్టులు ప్రారంభించిన ఉద్యమానికి ‘నక్సల్బరీ ఉద్యమం’ అనే పేరు వచ్చింది. ఆ ఉద్యమాన్ని నడిపిన వారినీ, దాని సమర్ధకుల్నీ ఇంగ్లీషులో ‘నక్సలైట్స్’ అనడం మొదలైంది. అదే పదాన్ని, తెలుగుతో సహా దాదాపు అన్ని భాషల్లోనూ వాడుతున్నారు. హిందీ లాంటి భాషల్లో, దానికి తోడు, ‘నక్సల్ వాది’ లాంటి మాటలు కూడా వాడతారు.


నక్సలైట్ అనే పదంలో, ‘నక్సల్’ అనే మాట, ‘నక్సల్ బరీ’ నించీ తీసుకున్నది. ‘–ఐట్’ అనేది ఇంగ్లీషు వ్యాకరణంలో ఒక ‘సఫిక్స్’. తెలుగు వ్యాకరణ భాషలో, ‘ప్రత్యయం’. ‘ఐట్’ అనే ముక్కని, ఇంగ్లీషులో, ఒక మాటకి చివరిలో చేర్చితే, అది ఆ మాటకి ఉన్న గుణాన్ని లేదా సంబంధాన్ని తెలియపరుస్తుంది. ‘నక్సలైట్’ అంటే, నక్సల్బరీ ప్రాంతానికి లేదా ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి అని అర్థం. 1969 నాటికి ఈ పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది, పత్రికల వార్తల్లోనూ, ఇతర రకాల వ్యాసాలలోనూ. (అదే సమయంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొంటున్న వారిని, స్తానిక ఇంగ్లీషు పత్రికలు, ‘తెలంగనైట్స్’ అని ప్రస్తావించేవి. తెలంగాణ+ఐట్=తెలంగనైట్.)

1967–1970 మధ్య ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో, బియ్యేలో మూడు సబ్జెక్టులలో, ఒకటి ‘లింగ్విస్టిక్స్’ (భాషా శాస్త్రం). దానిలో, అనేక విషయాలతో పాటు, పదాలు ఎలా ఏర్పడతాయి–అనే సంగతులు కూడా, మా లెక్చరర్లు చెప్పేవారు. (అలాంటి వాటిలో, ‘ఎనలాజికల్ క్రియేషన్’ అని ఒక పద్ధతి ఉంది. దీన్ని కష్టమైన తెలుగు వ్యాకరణ భాషలో ‘సారూప్య పద సృష్టి’ అంటారనుకుంటాను. అదేమిటంటే, భాషలోనే ఉన్న ఒక మాటని ఆధారం చేసుకుని, ఆ మాటలో ఉన్న శబ్దాల్ని పోలివున్న ఇంకో పదాన్ని సృష్టించడం. ఆ కొత్త పదానికి ఉండే అర్థం, పాత పదానికి ఉన్న అర్థం నించీ తేడాగా ఉంటుంది. (ఇక్కడ ఇంతకన్న వివరాలు చెప్పుకోలేము.)

అప్పట్లో మాకు పాఠాలు చెప్పిన వారిలో ఒకరైన చేకూరి రామారావు, పదాలు ఏర్పడే పద్ధతి గురించి చెపుతూ, ఒక కొత్త పదాన్ని ఉదాహరణగా చెప్పారు. అదే, ‘నిక్సనైట్లు’ అనే పదం! ‘నిక్సనైట్లు’ అంటే, నక్సలైట్లను వ్యతిరేకించేవారు–అని అర్థం. ఈ చమత్కార పదాన్ని సృష్టించింది శ్రీశ్రీ. దీనికి ఒక సందర్భం ఉంది. నక్సలైటు ఉద్యమం బాగా వార్తల్లో ఉన్న రోజుల్లో, రిచర్డ్ నిక్సన్ అమెరికాకి అధ్యక్షుడిగా (1969 జనవరిలో) వచ్చాడు. పెట్టుబడిదారీ అమెరికాకు అధ్యక్షులైన వారందరిలాగే నిక్సన్ కూడా కమ్యూనిజానికి సహజ వ్యతిరేకి. కమ్యూనిస్టులు ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించే వారిని ఉద్దేశించి, తెలుగులో ‘అభినవ శబ్ద వాంగ్మయ బ్రహ్మ’ అనదగ్గ శ్రీశ్రీ, ‘నిక్సనైట్లు’ అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాడు.

30–5–1969 నాటి, ‘ప్రగతి’ వారపత్రికలో, ఒక పాఠకురాలు అడిగిన ప్రశ్న: ‘‘నక్సలైట్లంటే అర్థమేమిటండీ?’’ దానికి, శ్రీశ్రీ జవాబు: ‘‘నిక్సనైట్లకి సింహ స్వప్నం.’’ నిక్సన్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన అయిదు నెలలకి, అభినవ ‘వాగనుశాసనుడు’గా, ‘కవి బ్రహ్మ’గా, రోణంకి అప్పలస్వామి వంటి బహుభాషా పండితుల చేత ప్రశంసలు పొందిన శ్రీశ్రీ, మరుసటి యేడాది నక్సలైట్ల గురించి ఒక పద్యం ఇలా రాశాడు: ‘‘సమాజ శస్త్ర వైద్యులు/ విచిత్ర వీరులు/ అన్యాయాలకి డైనమైట్లు/ అంధకారంలో టార్చిలైట్లు/ నవయువ జీవన కాస్మోనాట్లు/ వాళ్ళంటే హడిలిపోతారు నిక్సనైట్లు.’’ (జ్యోతి, మాసపత్రిక, ఆగస్టు, 1970).


‘నిక్సనైట్లు’ అన్న పదం గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, నక్సలైట్ల నిర్మూలన పూర్తైనట్టేననీ, ఇక అర్బన్ నక్సలైట్ల పని పడతామనీ, హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన, మార్చి 30న, పార్లమెంటులో వచ్చింది. ఈ ప్రకటననే, కొందరు ‘అర్బన్ నిక్సనైట్లు’ ఇలా పునరుద్ఘాటిస్తున్నారు: ‘‘ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల అణచివేతపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది’’– అని! ‘నిక్సనైట్లు’ అనే పదానికి, ‘అర్బన్’ అనే విశేషణాన్ని తగిలించి, ‘అర్బన్ నిక్సనైట్లు’ అనే పదబంధాన్ని నేను వాడడానికి కారణం వివరించి ముగిస్తాను. దండకారణ్యం అడవుల్ని సర్వనాశనం చేసి, పర్యావరణ విధ్వంసానికి దారితీసే, గనుల తవ్వకాలకి కాంట్రాక్ట్ తీసుకున్న కార్పొరేట్ సంస్థల యజమానుల్ని ‘నిక్సనైట్లు’ అనవచ్చును. ఆ ఫారెస్టు నిక్సనైట్లను, ఇక్కడ పట్టణాలలో కూచుని సమర్ధించే వాళ్ళని ‘అర్బన్ నిక్సనైట్లు’ అనవచ్చును. వాళ్ళు సమర్ధించి ఊరుకుంటే ఫరవాలేదు. కానీ, వాళ్ళు ‘అర్బన్ నక్సలైట్ల’ని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ వ్యాసానికి పేరు: ‘అర్బన్ నిక్సనైట్లు ఉన్నారు జాగ్రత్త!’ మరి, అర్బన్ నక్సలైట్లు ఏమంటారో? 1979 నాటి పాకిస్తాన్ నియంత జియా–ఉల్–హక్ పాలనను దృష్టిలో పెట్టుకుని, కమ్యూనిస్టు కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హం దేఖెంగే’–అనే పాటలోని చరణాలతో జవాబు ఇస్తారా? ‘‘పీడకుల కిరీటాలు ఉరుముల గర్జనలో నేలకొరిగిపోతాయి!’’ అని!

బి.ఆర్. బాపూజీ

హైదరాబాద్ విశ్వవిద్యాలయం (1991–2014)

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 12:11 AM