ఇది ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:18 AM
ప్రస్తుత వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్నాయి. ఈ వేసవిలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 48 డిగ్రీలు ఉత్తరప్రదేశ్‌లోని ‘బాండా’ పట్టణంలో....
ప్రస్తుత వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్నాయి. ఈ వేసవిలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 48 డిగ్రీలు ఉత్తరప్రదేశ్‌లోని ‘బాండా’ పట్టణంలో నమోదయింది. గతంలో మధ్యాహ్నం పూట ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం వల్ల వేడి నుంచి రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పగటి ఉష్ణోగ్రతల కంటే వేగంగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇరుకైన ఇళ్లు, సరైన గాలి– వెలుతురు లేని గదులు, సరైన డిజైన్ లేని భవనాలు ఇంటి లోపలి వేడిని పెంచుతున్నాయి. రాత్రి సమయంలో శరీరం వేడి నుంచి కోలుకోవాలి. కానీ రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నిద్ర, విశ్రాంతి సాధ్యం కాదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తాయి.
గత 115 సంవత్సరాల్లో పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది పగలు– రాత్రి మధ్య ఉష్ణోగ్రతల తేడాను తగ్గిస్తోంది. దేశంలోని వివిధ నగరాలలో పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి కారణం ‘అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం’. అంటే నగరాలు, పట్టణ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉండటం. ఉదాహరణకు సౌత్ ఢిల్లీలోని పచ్చని ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాల కంటే 2– 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత కారణంగా చల్లగా ఉంటాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, బంజారాహిల్స్ ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువ వేడిగా ఉంటాయి. అదే నగరం బయటకు వెళ్తే ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా తగ్గడం గమనించవచ్చు.
కాంక్రీటు భవనాలు, రోడ్లు, గాజు, మెటల్ వంటివి పగటిపూట వేడిని గ్రహించి రాత్రి సమయంలో ఆ వేడిని విడుదల చేస్తాయి. ఎయిర్ కండీషనర్లు ఇంటి లోపల చల్లగా చేస్తాయి కానీ వాతావరణంలోకి వేడిని విడుదల చేస్తాయి. అందమైన రూపం కోసం కార్పొరేట్ ఆఫీసులలో గ్లాస్ ఫసాడ్స్‌ను అధికంగా వాడటం వల్ల పరిసరాల ఉష్ణోగ్రత కనీసం 7 డిగ్రీలు పెరుగుతుంది. హైదరాబాద్‌లో గాజు నిర్మాణాల కార్పొరేట్ ఆఫీసులు ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. శిలాజ ఇంధనాల వాహనాలు, ఫ్యాక్టరీలు... వేడి, కాలుష్యాన్ని పెంచుతాయి. ఎత్తైన భవనాలు గాలి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల వాతావరణంలో వేడి పెరుగుతుంది. చెట్లు, పార్కులు, తోటల సంఖ్య తగ్గిపోవటం కూడా మరో సమస్య.
అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం నిరంతరం వేడికి గురై డీహైడ్రేషన్, అలసట, హీట్ స్ట్రోక్, నిద్ర సమస్య, మరణాలు సంభవించవచ్చు. పేదలు, ఎయిర్ కండీషనర్ లేనివారు, ఇంట్లో గాలి– వెలుతురు సరిగ్గా లేనివారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. విద్యుత్ కొరత, నీటి కొరత, పంటల నష్టం జరుగుతుంది.
ఎక్కువగా నీరు త్రాగడం, ఇంటిని చల్లగా ఉంచుకోవటం, పగలు వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవటం, కాటన్ దుస్తులు ధరించటం, టోపీ లేదా గొడుగు ఉపయోగించటం, రాత్రి సమయంలో మంచి వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ చెట్లు నాటాలి. వృక్షాలు సహజసిద్ధమైన ఎయిర్ కండీషనర్స్‌గా పనిచేస్తాయి. వాతావరణం వేడెక్కినప్పుడు వృక్షాలు భూమిలోని నీటిని వేర్ల సాయంతో గ్రహించి, ఆకుల ద్వారా ఆ నీటిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. అలాగే కార్పొరేట్ ఆఫీసుల భవనాలలో గాజు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. గ్లాస్ వాడకం శీతల దేశాలకు అవసరం, భారతదేశం వంటి ఉష్ణమండల దేశాలకు శ్రేయస్కరం కాదు. భవనాలకు మెరుగైన వెంటిలేషన్ కల్పించుకోవాలి. చెరువుల వంటి నీటి వ్యవస్థలను కాపాడుకోవాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాలి. కూల్ రూఫ్ టెక్నాలజీని వినియోగించుకోవాలి... తద్వారా హీట్ ఐలాండ్ ప్రభావం నుంచి బయటపడవచ్చు.
వాతావరణ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదురవుతున్నాయి. మన దేశంలో ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. భారతదేశంలో మంచు కరిగిపోవడం పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై చర్చకు దారితీస్తోంది. ఈ అంశాలన్నీ మానవాళికి ప్రకృతి పంపిస్తున్న హెచ్చరికలు. ఈ సమస్యలకు మానవ జీవన విధానాలే మూలకారణం. ఆ విధానాలను మార్చుకోవటం ద్వారా వాతావరణ, పర్యావరణ మార్పుల తీవ్రతను తగ్గించుకోవచ్చు.
డా. శ్రీధరాల రాము
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్
Read Latest TG News And Telugu News