యూపీఐ చార్జీలు అవివేక నిర్ణయం!
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:55 AM
ఎలక్ట్రానిక్ లావాదేవీలపై రుసుము (ఎండీఆర్) విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, చట్ట సవరణ చేసింది. రూ. 2,000 లోపు యూపీఐ లావాదేవీలు ఉచితమేనని, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న...
ఎలక్ట్రానిక్ లావాదేవీలపై రుసుము (ఎండీఆర్) విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, చట్ట సవరణ చేసింది. రూ. 2,000 లోపు యూపీఐ లావాదేవీలు ఉచితమేనని, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న లావాదేవీలపై వ్యాపారుల నుంచి 0.25 నుంచి 0.5శాతం వరకు రుసుము ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపారుల అభ్యర్థన మేరకు దీని అమలును వాయిదా వేసినప్పటికీ, దీపావళి అనంతరం మరో నోటిఫికేషన్ ద్వారా రుసుము వసూళ్లను ఆరంభించబోతున్నది. ఈ లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు కంటే సమాజానికి చేకూరే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నందున, యూపీఐని పూర్తిగా ఉచితంగానే కొనసాగించాలి.
యూపీఐ చెల్లింపు నిబంధనలలో ఈ మార్పునకు ప్రభుత్వం పేర్కొన్న కారణం– దానికి అయ్యే ఖర్చులు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం భారతదేశ జీడీపీలో లాజిస్టిక్స్ ఖర్చు 2012–13లో 8.8 నుంచి 10శాతంగా ఉండగా, 2021–22 నాటికి అది 7.8 నుంచి 8.9శాతానికి తగ్గింది. నగదు రహిత లావాదేవీలు ఈ ఖర్చులను తగ్గించడంలో కీలకపాత్ర పోషించాయి. ఫాస్టాగ్ రాకతో టోల్ గేట్ల వద్ద గంటల తరబడి నిలిచిపోయే వాహనాల సమయం, ఇంధనం భారీగా ఆదా అయ్యింది. డ్రైవర్లకు దారి ఖర్చులు, ఇంధనం–మరమ్మతుల కోసం తక్షణమే యూపీఐ ద్వారా నగదు బదిలీ జరగడం వల్ల రవాణాలో నగదు దొంగతనాలు తగ్గాయి. ఈ–కామర్స్ రంగంలో క్యాష్ ఆన్ డెలివరీ వల్ల రిటర్న్ రేట్లు, నగదు ప్రాసెసింగ్ ఖర్చులు ఎక్కువగా ఉండేవి. యూపీఐ చెల్లింపులు ఈ సైకిల్‌ను సెకన్లలోకి మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీల పరిమాణంలో దాదాపు 49శాతం వాటా భారతదేశ యూపీఐదే. లావాదేవీలను వేగవంతం చేసి, వ్యయాలను తగ్గించడంలో ఉచిత యూపీఐ కీలకపాత్ర పోషించింది.
జీరో చార్జీలు, క్యూఆర్ కోడ్ సౌలభ్యం వల్ల వీధి వ్యాపారుల నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయి. సాధారణ వినియోగదారులు నిత్యజీవితంలో చిల్లర సమస్యలు లేకుండా రూపాయి నుంచి వేల రూపాయల వరకు ఉచితంగా, నేరుగా బ్యాంకు ఖాతా నుంచి సురక్షితంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. బ్యాంకులు భౌతిక నగదు నిర్వహణ, ఏటీఎంలు, బ్రాంచ్ కౌంటర్లలో రద్దీ గణనీయంగా తగ్గింది.
వీసా, మాస్టర్‌కార్డ్ లాంటి బహుళజాతి సంస్థల నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే లావాదేవీలపై భారీ మొత్తంలో రాయల్టీ, ప్రాసెసింగ్ ఫీజులు విదేశాలకు తరలిపోయేవి. ఎన్పీసీఐ ప్రవేశపెట్టిన దేశీయ యూపీఐ, రూపే వ్యవస్థల వల్ల వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం దేశంలోనే నిలిచిపోయింది. యూపీఐపై చార్జీలు విధిస్తే విదేశీ కార్డు కంపెనీలకు మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం జీరో–ఎండీఆర్ విధానం భారత డిజిటల్ సార్వభౌమాధికారానికి రక్షణ కవచంగా పనిచేస్తోంది.
యూపీఐ వ్యవస్థ నిర్వహణ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే. యూపీఐ వల్ల బ్యాంకుల నిర్వహణ ఖర్చులు తగ్గి, లాభాలు పెరిగాయి. ఒకవేళ ప్రజలు మళ్లీ నగదు వినియోగానికి మొగ్గు చూపితే, కరెన్సీ నోట్ల ముద్రణకు, పాడైన నోట్ల నిర్వహణ వ్యయాలు రిజర్వ్ బ్యాంకు భరించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్బీఐ లాభాలు తగ్గి, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసే వార్షిక డివిడెండ్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకే నేరుగా నష్టం వాటిల్లుతుంది.
లావాదేవీల నిర్వహణ వ్యయం పెరిగితే చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. ఇది దేశంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (సులభతర వాణిజ్యం) ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న రవాణా, లాజిస్టిక్స్ నిర్వహణ వ్యయాలు తిరిగి పెరిగే ప్రమాదం ఉంది. తయారీ, విక్రయ వ్యయాలు స్వల్పంగా పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరల పోటీతత్వానికి స్వల్పంగానైనా నష్టం వాటిల్లుతుంది.
2025–26లో కరెన్సీ నోట్ల ముద్రణకే ఆర్బీఐ రూ.4,875 కోట్లు వెచ్చించింది. డిజిటల్ చెల్లింపుల వల్ల నోట్ల ముద్రణ, రవాణా, భద్రత వ్యయాలు భారీగా ఆదా అవుతున్నాయి. వ్యాపారాలు వేగవంతం కావడం వల్ల పరోక్షంగా పన్నుల ఆదాయం పెరుగుతోంది. ప్రభుత్వ ఖజానా కోణంలో చూసినా యూపీఐపై రుసుములు విధించడం ఏ మాత్రం వివేకవంతమైన నిర్ణయం కాదు. భారత ఆర్థిక వ్యవస్థను క్రమంగా ‘తక్కువ నగదు’, తుదిగా ‘నగదు రహిత’ వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి కూడా ఈ చర్య పూర్తిగా విరుద్ధం.
డా. బి.సారంగపాణి
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి.