ఆంధ్రకు మేలు చేసిన కేంద్ర బడ్జెట్
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:55 AM
సంవత్సర కాలంగా పట్టిపీడిస్తున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూడాలి...
సంవత్సర కాలంగా పట్టిపీడిస్తున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూడాలి. గందరగోళంలో పడ్డ ఐటీ రంగం; ట్రంప్ హెచ్1బి సమస్యలు; ఉత్పాదక రంగంలో తగ్గిన వృద్ధి, తగ్గిన పన్ను ఆదాయం; అమెరికా, చైనా ఆంక్షలు, ట్రంప్ టారిఫ్‌లు వంటి సమస్యలతో, గత 20 ఏళ్లుగా భారతదేశం అంతగా అలవాటుపడని పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికిన కేంద్ర బడ్జెట్ ఇది. అమెరికా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించిన బడ్జెట్ ఇది.
దేశ ఆదాయం తగ్గింది. ఫలితంగా ప్రధాన రంగాల మీద పెట్టిన వ్యయం కూడా తగ్గింది. అంచనా వేసిన 14.38 లక్షల కోట్ల రూపాయల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లు 1.26 లక్షల కోట్లు తక్కువ. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో, 1.31 లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. కేవలం కార్పొరేట్ పన్నుల ద్వారా అదనంగా వచ్చిన రూ.27,000 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా అదనంగా వచ్చిన రూ.19,500 కోట్లు, కస్టమ్స్ సుంకాల ద్వారా అదనంగా వచ్చిన రూ.18,250 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఊరటనిచ్చాయి. ఫలితంగా, 2025–26 బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం వ్యయం రూ.1,00,503 కోట్లు తక్కువగా ఉంది. మూలధన వ్యయం కూడా రూ.25,335 కోట్లు తక్కువగా ఉంది. విద్య, వ్యవసాయం వంటి రంగాలలో రూ.6,300 కోట్లు తక్కువ ఖర్చు చేశారు. గ్రామీణాభివృద్ధి వ్యయం రూ.53,067 కోట్లు, పట్టణాభివృద్ధి వ్యయం రూ.39,573 కోట్లు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంపై వ్యయం కూడా రూ.3,686 కోట్లు తక్కువగా ఉంది.
భారతదేశానికి ఇరవయ్యేళ్ళుగా సురక్షితమైన రంగంగా ఉన్న ఐటీ– అకస్మాత్తుగా గందరగోళంలో పడింది. ట్రంప్ విధించిన హెచ్1బి ఆంక్షల వల్ల భారత ఐటీ నిపుణులు నిజంగానే కొంత ప్రాభవాన్ని కోల్పోయారు. జీఎస్టీ శ్లాబులను తగ్గించినా ఉత్పాదక రంగంలో ఎలాంటి వేగవంత వృద్ధీ కనిపించలేదు. దీంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గింది.
ఆర్థిక మంత్రి దేశీయ బలహీనతలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు దృష్టి పెట్టని కొత్త రంగాలపై దృష్టి సారించారు. ఖాదీ, చేనేతతో సహా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSME) లక్ష్యంగా చేసుకుని సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. వస్త్రాలు, బయో ఫార్మా, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, కంటైనర్లు మొదలైన ఏడు రంగాలకు మద్దతు ఇవ్వడం, ఇటీవలి సంవత్సరాలలో అంతగా విజయవంతం కాని ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ను దాటి ముందుకు వెళ్లడానికి చేసిన ఒక మంచి ప్రయత్నం. బడ్జెట్‌లో వస్త్ర, తోలు, సముద్ర ఉత్పత్తుల రంగాలకు మద్దతు ఇచ్చే చర్యలు, యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో చేసిన ప్రయత్నంగా చూడాలి.
సెమీకండక్టర్ మిషన్ 2.0కు మద్దతు ఇవ్వడం ప్రపంచ వాల్యూ చెయిన్లపై, ముఖ్యంగా చైనా, అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, అసెంబ్లింగ్ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం స్పష్టంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించినది. అరుదైన ఖనిజాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. దీనికోసం మంత్రి ఖనిజ సంపన్న రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ గుండా వెళ్లే ఒక ప్రత్యేక ‘‘అరుదైన ఖనిజాల భూముల కారిడార్’’ పథకాన్ని తెచ్చారు. ఇది అరుదైన ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, తయారీని ప్రోత్సహిస్తుంది. బ్యాటరీ నిల్వ కోసం లిథియం అయాన్ సెల్స్‌పై పన్ను మినహాయింపులు కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రతిపాదించినవే.
2026–27 కేంద్ర బడ్జెట్‌లో, ఉత్పత్తి రంగ పునరుజ్జీవనం కోసం కొత్త రంగాలపై దృష్టి సారించినా, ఆంధ్రప్రదేశ్‌కు సరైన వాటా లభించినట్లే కనిపిస్తోంది. అరుదైన ఖనిజ భూముల కారిడార్ వెళ్లే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండటం మన అదృష్టం. అయితే, దానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించడం... కీలక ఖనిజాల తవ్వకం–ప్రాసెసింగ్–పరిశోధనలో శ్రమశక్తి ఆధారిత ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ పథకం కోసం కేటాయించిన రూ.7,280 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన వాటా లభించనుంది. అధిక వేగవంతమైన రైలు అనుసంధానం... దక్షిణాది ఎంతగా అభివృద్ధి చెందిందో, మరింత వేగవంతమైన అనుసంధానం ఎంత అవసరమో తెలియజేస్తుంది. కొత్తగా ప్రకటించిన ఏడు హై–స్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్–బెంగళూరు, చెన్నై–బెంగళూరు కారిడార్ల ద్వారా రాష్ట్రం బహుళ ప్రయోజనం పొందుతూ ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాలైన రాయలసీమ, కోస్తాంధ్రల గుండా వెళ్తూ రాష్ట్రాన్ని మిగతా దేశంతో అనుసంధానించడాన్ని మెరుగుపరుస్తాయి.
నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన సెమీ కండక్టర్ పరిశ్రమకు ఇప్పుడు క్రమబద్ధమైన నిధులు లభించాయి. ప్రకటించిన రూ.40,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి వాటా లభిస్తుంది. ఇప్పుడు నిధులు ఖరారు కావడంతో, అమరావతిలోని క్వాంటం వ్యాలీ, విశాఖపట్నంలో రాబోతున్న అనేక కోడింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా, రాష్ట్రంలో గొప్ప సాంకేతిక ఎకో సిస్టం అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు... విశాఖపట్నానికి ఒక పెద్ద వరం. విశాఖ ఇప్పటికే డేటా సెంటర్ల రాజధానిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ పన్ను మినహాయింపు వల్ల మరిన్ని కంపెనీలు ఈ రంగంలో చేరడంతో, ఒక బృహత్ ఎకో సిస్టం ఆవిష్కృతమవుతుంది.
బడ్జెట్‌లో వస్త్ర పరిశ్రమపై దృష్టి పెట్టి, పదివేల కోట్లు కేటాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని భారీ వస్త్ర క్లస్టర్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. 200 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ప్రారంభించే పథకం ఆంధ్రప్రదేశ్‌కు దాని వాటా పారిశ్రామిక క్లస్టర్లతో సహాయపడుతుంది. పర్యాటక రంగానికి సంబంధించి, తూర్పు కనుమలలోని అరకు లోయను ట్రెక్కింగ్, హైకింగ్ కోసం ప్రపంచ స్థాయి, పర్యావరణ అనుకూల పర్వత మార్గాలలో భాగంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులోని పులికాట్ సరస్సు వెంట మూడు పక్షుల వీక్షణ మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయరంగ మద్దతు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పండించే జీడిపప్పు, కోకో, కొబ్బరి కోసం ఉత్పత్తి, విలువ గొలుసులను పెంచడానికి నిధులు కేటాయించారు. అంతర్గత జలమార్గ కేంద్రాల రవాణా పథకంతో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా ప్రయోజనం పొందుతుంది. పోలవరం వంటి ఇప్పటికే ఉన్న పథకాలకు రూ.3200 కోట్ల కేటాయింపు లభించింది. రాజధాని అమరావతికి ఏడీబీ, మొదలైన వాటి నుంచి సుమారు రూ.1500 కోట్లు లభించాయి.
ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ దేశానికి, ఆర్థిక మంత్రికి ఒక సవాలుగా మారింది. ప్రపంచంలో మన దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి కావాల్సిన అన్ని లక్షణాలను పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిజాన్ని గుర్తించింది. నిర్మలా సీతారామన్ ఆ దిశగా ఒక అడుగు వేశారు.
నీలాయపాలెం విజయ్‌కుమార్
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి
ఇవీ చదవండి:
సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు