ప్రేమవన్నె గొడుగు కింద
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:47 AM
వీధులు వాగులవుతున్న సమయాన దిగులు వరదల్లో చిక్కి దారులు వొణుకుతున్న కాలాన మనం కలుసుకోలేమనే గదా....
వీధులు వాగులవుతున్న సమయాన
దిగులు వరదల్లో చిక్కి
దారులు వొణుకుతున్న కాలాన
మనం కలుసుకోలేమనే గదా
తెగ బెంగపోతున్నావు.!?
అడ్డంకుల్ని అడ్డుగోడల్ని
ఛేదించే దారుల్లోనే ప్రేమలో పడ్డా మనకీ
యీ వానొక లెక్కా!
అసలకి యీ వానే కాదు
ఏ వానా ఎప్పుడూ ప్రేమకూటాలకు ఆటంకం గాదు
గొడ్లు తోలుకుని అడవికెళ్లిన అయ్యలు
గూడేసుకుని వరి కలుపులకుబోయిన అమ్మలు
ఇంటికెట్లా వస్తారోనని..
కొండల అంచున
కొండ సిలవల్లా పారుతున్న కాలవలకావల
గొంతులదాకా మునిగిన పంట చేన్లు
చేన్ల నానుకుని దిగులుపిట్టవుతున్న ఊళ్ళు
ఊళ్ళల్లో ఉరిసే ఇళ్లలో
కునుకులేక కుమిలిపోతూ
గడపల్లో ఉగ్గబట్టుకున్న ఊపిరి దీపాలవుతూ
ఎల్లపల్లాల సాయ ఎదురు చూస్తున్న
బిడ్డ గొడ్డుల
గొడ్డుబిడ్డల
కళ్ళలో కలవరింతల్ని కంటజూడటం
కార్తీకనెల కబోదివానికి భలే చెతురు కావచ్చుగాని
మనకేమి భయం లేదు
ముక్కుమీద వేలేసుకుని
వానరాయుడు దిక్కులు చూస్తుండంగా
అమ్మలయ్యల ఒళ్ళల్లో బిడ్డలు
ముద్దుదీపాలై వెలిగిపోయినట్టే
ప్రేమ కాంతుల కంటిపాపలై కలుసుకుంటాము
నడిచే దారుల్లో
ఈత ముళ్ళని చల్లితే ఏరేసుకున్నాం
లోతు కందకాలు తొవ్వితే పూడ్చేసుకున్నాం
ఇనప కంచెలు కడితే తొలగదోసుకున్నాం
ఇట్టా వచ్చి విర్రవీగుతూ కురిసి
అట్టా మాయమై పోయే వానొక లెక్కా!?
ఈదురు గాలులు
ఇసపు వరదలు
వాన వంకన పొంగి పారే డొంకదారులు
పెంకి వంకలు
పెగ్గి తూములు మన దోవలకు అడ్డంకా?
నడినెత్తి మీద
సూరుడు సురుక్కుమనాల్సిన పూట
గుండెల్ని గుబేలుమనిపిస్తూ
దబేలున కురుస్తున్న
యీ పోగరుబోతువాన మనకేమీ అడ్డంకి గాదు
యీ మిట్ట మద్దేనమేలా
మన గుండెలు కలుసుకునే గుట్టలు తావ
ముద్దముద్దకీ ముద్దుముద్దుకీ
కాల్చిన ఎండిచియ్యలు నంజుకుంటూ
కమ్మటి సంగటి ముద్దలు పంచుకు తింటూ
మనం కలుసుకుని తీరుతాము
కన్నీటిచెంపల్ని తుడిచే
కవిత్వాన్ని గొడుగుపడుతూ
‘దేముడున్న దేశింకన్నా
ప్రేమవన్నె గొడుగు మిన్నయ’ని
గొంతులారా వంతలు పాడుకుంటాము
చింతలు లేని కాలాన్ని పేడుకుంటాము.
పల్లిపట్టు నాగరాజు
99894 00881
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..