Share News

‘తుమ్మిడిహెట్టి’పై కుట్రలు మాని బీజేపీ కలిసిరావాలి

ABN , Publish Date - May 19 , 2026 | 12:31 AM

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో గోదావ‌రి, వార్ధా, పెన్ గంగ‌, ప్రాణహిత వంటి న‌దులు.. క‌డెం, ధోతి వాగు, పెద్ద వాగు, కుప్టి వాగు, సా‌త్నాల వాగు వంటి ఇంకా అనేక వాగులు, వంక‌లు ప్రవ‌హిస్తున్నా అవేవి...

‘తుమ్మిడిహెట్టి’పై కుట్రలు మాని బీజేపీ కలిసిరావాలి

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో గోదావ‌రి, వార్ధా, పెన్ గంగ‌, ప్రాణహిత వంటి న‌దులు.. క‌డెం, ధోతి వాగు, పెద్ద వాగు, కుప్టి వాగు, సా‌త్నాల వాగు వంటి ఇంకా అనేక వాగులు, వంక‌లు ప్రవ‌హిస్తున్నా అవేవి పెద్దగా భూముల‌ను త‌డ‌ప‌డం లేదు. ఉప్పు నీటి స‌ముద్రం వైపు ఉర‌కలేస్తూ వెళుతున్నాయి. ఇక్క‌డి నుంచి వెళ్లే ప్ర‌తి చుక్క‌ను ఒడిసిప‌ట్టి ఈ జిల్లాతో పాటు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్‌, మెద‌క్, రంగారెడ్డి జిల్లాల‌కు సాగునీరు, హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు అందించాల‌నే సంక‌ల్పంతో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేడ్క‌ర్ ప్రాణ‌హిత‌–చేవెళ్ల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి తుమ్మిడిహెట్టి వ‌ద్ద శ్రీ‌కారం చుట్టింది. ఉత్త‌ర తెలంగాణ భూముల్లో బంగారు పంట‌లు పండించేందుకు వీలుగా ఈ ప‌థకానికి రూప‌క‌ల్ప‌న చేసింది. రూ.11,500 కోట్ల విలువైన ప‌నులు కూడా పూర్తి చేసింది. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి, మానేరు న‌దిపై మ‌ధ్యమానేరు జ‌లాశ‌యాల ప‌నులను అప్పటి ప్ర‌భుత్వం ప్రారంభించింది. శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు ఉమ్మ‌డి రాష్ట్రంలోనే పూర్త‌యింది. మ‌ధ్యమానేరు ప‌నులు దాదాపు సగం పూర్త‌య్యాయి. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డ‌డంతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్త‌వుతుంద‌ని ఉమ్మ‌డి ఆదిలాబాద్‌తో పాటు మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆశ‌ప‌డ్డారు.

ప్ర‌త్యేక రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం రీడిజైనింగ్ పేరుతో ప్రాణ‌హిత‌–చేవెళ్ల ప‌థ‌కాన్ని కాళేశ్వ‌రం ఎత్తిపోత‌లుగా మార్చి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌యోజ‌నాల‌కు గండికొట్టింది. తుమ్మిడిహెట్టి వ‌ద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించ‌డంతో పాటు చాలా త‌క్కువ గ్రావిటీతో శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి వ‌ర‌కు నీళ్ల‌ను త‌ర‌లించ‌వ‌చ్చు. అక్క‌డి నుంచి పలు దశల్లో వ‌ర్షాభావ ప్రాంతాలైన చేవెళ్ల‌, తాండూరు, ప‌రిగి ప్రాంతాల‌కు నీటిని ఎత్తిపోయ‌వ‌చ్చు. కానీ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల పథకం చేప‌ట్టింది.

తుమ్మిడిహెట్టి వ‌ద్ద అయినా, కాళేశ్వ‌రం వ‌ద్ద అయినా నీటి ల‌భ్య‌తకు ప్రాణ‌హిత నదే ఆధారం. ఎగువ‌న ఉన్న తుమ్మిడిహెట్టి వ‌ద్ద ఉన్న నీరే దిగువ‌న కాళేశ్వ‌రం వ‌ద్ద అందుబాటులో ఉంటుంది. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే, 100 టీఎంసీలు నీరు వినియోగించుకోవ‌చ్చ‌ని జ‌లవ‌న‌రుల నిపుణులు తేల్చి చెప్పారు. 152 మీట‌ర్ల ఎత్తున నిర్మిస్తే మ‌హారాష్ట్రకు చెందిన శివుని గ్రామం ఒక్కటే ప్రభావితమవుతుంది. సుమారు 1100 ఎక‌రాలు ముంపున‌కు గుర‌వుతుంద‌ని, ఆ భూములకు చెందినవారే నిర్వాసితులవుతారని అప్పటి అధ్యయనాలే వెల్లడించాయి. కానీ ఇవేం ప‌ట్టించుకోని కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో రూ.ల‌క్ష కోట్ల‌తో మూడు బ్యారేజీలు నిర్మించారు.


భార‌త‌దేశంలో భాక్రానంగ‌ల్‌, హీరాకూడ్‌; ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగ‌ర్‌, శ్రీ‌శైలం, శ్రీ‌రాంసాగ‌ర్ వంటి భారీ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్ర‌భుత్వాల హ‌యాంలో నిర్మాణమయ్యాయి. ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా అవి చెక్కుచెద‌ర‌లేదు. కానీ కేసీఆర్, ఆయ‌న కుటుంబ స‌భ్యుల అవినీతి కారణంగా కాళేశ్వ‌రం ప‌ట్టుమ‌ని ప‌దేళ్లు కూడా నిల‌వ‌లేదు. గోదావ‌రికి వ‌చ్చిన వ‌ర‌ద‌కు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్ర‌పంచానికి చాటింది. కాళేశ్వ‌రం నిర్మాణంతో పాటు దాని నిర్వ‌హ‌ణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి గుదిబండ‌లా త‌యారైంది. ప్రాణ‌హిత‌–చేవెళ్ల‌లో భాగంగా నిర్మించిన శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి, మ‌ధ్య మానేరు, కాలువ‌లు, ఇత‌ర నిర్మాణాల‌ను కూడా కాళేశ్వ‌రంలో చూపుతూ అదంతా త‌మ ఘ‌న‌తే అని కేసీఆర్, ఆయ‌న పార్టీ నాయ‌కులు చెప్పుకుంటున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి... తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించ‌డానికి పూనుకున్నారు. త‌మ‌ చిరకాల స్వ‌ప్న‌మైన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జలు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, వివేక్ వెంక‌ట‌స్వామి క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న పూర్తి చేశారు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌తో మన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద చేప‌ట్టే ప్రాజెక్టుతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, మెద‌క్‌, రంగారెడ్డి జిల్లాల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్, మెద‌క్‌, చేవెళ్ల లోక్‌స‌భ స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంది. క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కేంద్ర మంత్రి అయ్యారు. వారంతా ప్రాతినిధ్యం వ‌హించే ప్రాంతాల‌కు సాగునీరు, ఆయా ప్రాంతాల్లోని ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నీరు, హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు అందించే ఈ ప‌థ‌కానికి కేంద్రం నుంచి అనుమ‌తులు తీసుకువ‌చ్చే బాధ్య‌త ఇక్క‌డి నుంచి గెలుపొందిన గొడం న‌గేష్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, మాధ‌వ‌నేని ర‌ఘునంద‌న్‌రావు, కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డిల‌పై ఉంది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో మన ముఖ్య‌మంత్రి భేటీ అయ్యి ముంపు సమ‌స్యను పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పిస్తే, తాము రాజ‌కీయంగా స‌మాధి అవుతామ‌నే భ‌యం ఆ నేతలను వెంటాడుతోంది. అందుకే ఆ భేటీ జ‌ర‌గ‌కుండా తెరవెనుక మోకాలడ్డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే జ‌న్మించి రాజ‌కీయంగా ఉన్న‌త ప‌దవులు సాధించ‌డ‌మే కాకుండా మ‌హారాష్ట్రకు గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లందించిన చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు త‌న‌కున్న ప‌లుకుబ‌డితో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను భేటీకి ఒప్పించాలి. ఒక‌ప్పుడు గోదావ‌రి జ‌లాల కోసం పాద‌యాత్ర చేసిన చ‌రిత్ర విద్యాసాగ‌ర్‌రావుకు ఉంది.


తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ‌లోని వ‌ర్షాభావ ప్రాంతాల‌తో పాటు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ముంపు, నిర్వాసితులు వంటి సాకుతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ నాయ‌కులు తుమ్మిడిహెట్టికి గండి కొట్టాల‌నుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ నాయ‌కులు ఒక‌టి గుర్తుంచుకోవాలి. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ముంపు కోస‌మ‌ని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప‌రిధిలోని కూన‌వ‌రం, చింతూరు, వ‌ర‌రామ‌చంద్ర‌పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాల‌ను పూర్తిగా, భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం మిన‌హా భ‌ద్రాచ‌లం మండ‌లం మొత్తాన్నీ, బూర్గంపాడు మండ‌లంలోని మెజారిటీ గ్రామాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విలీనం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కింద విలీన మండ‌లాల‌తో పాటు ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌రిధిలో సుమారు ల‌క్ష మంది నిర్వాసితులవుతున్నారు.. వేలాది ఎక‌రాలు ముంపున‌కు గుర‌వుతోంది. నిర్వాసితుల‌య్యే వారిలో అత్య‌ధికులు కోయ‌, కొండ‌రెడ్డి జాతుల‌కు చెందిన గిరిజ‌నులు... అయినా విశాల ప్ర‌జాప్ర‌యోజ‌నాల కోసం పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రం త‌న నిధుల‌తో చేప‌డుతోంది. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 152 మీట‌ర్ల ఎత్తుతో చేప‌ట్టే ప్రాజెక్టుతో ముంపున‌కు గుర‌య్యే గ్రామం ఒక్క‌టే. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి, బీజేపీ ఎంపీల‌కు ఏ మాత్రం చిత్త‌శుద్ధి ఉన్నా వెంట‌నే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించాలి. లేకుంటే తెలంగాణ భ‌విష్య‌త్ త‌రాలు బీజేపీ ప్ర‌భుత్వాన్ని, బీజేపీ నాయ‌కుల‌ను క్ష‌మించ‌రు.

వెడ్మ బొజ్జు ప‌టేల్‌

ఖానాపూర్ శాస‌న‌స‌భ్యులు

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:31 AM