Share News

ఆదివాసీలను గౌరవించే సంక్షేమం కావాలి!

ABN , Publish Date - May 26 , 2026 | 03:12 AM

ఇటీవల ఒడిశాలో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికర సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జితు ముండా అనే వృద్ధ ఆదివాసీ మరణించిన తన సోదరి ఖాతాలోని కొద్దిపాటి డబ్బు కోసం...

ఆదివాసీలను గౌరవించే సంక్షేమం కావాలి!

ఇటీవల ఒడిశాలో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికర సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జితు ముండా అనే వృద్ధ ఆదివాసీ మరణించిన తన సోదరి ఖాతాలోని కొద్దిపాటి డబ్బు కోసం చివరకు ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు దాకా తీసుకురావాల్సి వచ్చింది. పైకి ఇది సాధారణ బ్యాంకింగ్ సమస్యలా కనిపించినా, వాస్తవానికి ఇది చాలా పెద్ద సంక్షోభానికి సంకేతం. నెలల తరబడి మరణ ధ్రువీకరణ పత్రం రాకపోవడం; ఆధార్ లేకపోవడం వల్ల రేషన్ లభించకపోవడం, వృద్ధాప్య పింఛన్‌ రాకపోవడం; అడుగడుగునా తమ పేదరికాన్ని, అర్హతను నిరూపించుకోవాల్సిన ఒత్తిడి – ఇవన్నీ కలిసి ఆయన కనీస మానవ గౌరవాన్ని పక్కనపెట్టి వ్యవస్థ ముందుకు రావాల్సిన దయనీయ పరిస్థితిని సృష్టించాయి. ఈ సంక్షోభానికి పరిష్కారం ఆదివాసీలకు హక్కుల ఆధారిత, సార్వత్రిక (యూనివర్సల్) సామాజిక రక్షణను హామీ ఇవ్వడంలోనే ఉంది.

సామాజిక సంక్షేమ పథకాల అమలులో రెండు ప్రధానమైన విధానాలు: ‘లక్షిత విధానం’ (Targeting) vs ‘సార్వత్రిక విధానం’ (Universality) ఉదాహరణకు వృద్ధాప్య పింఛన్లనే తీసుకుంటే– ‘లక్షిత విధానం’లో 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించాక, ప్రభుత్వ డేటాబేస్‌ల ద్వారా వారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆదాయపు పన్ను, ఎక్కువ భూమి, నాలుగు చక్రాల వాహనాలు వంటి సంపద సూచికలు లేనివారిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేస్తారు. దీనికి భిన్నమైనది ‘సార్వత్రిక విధానం’. ఇందులో ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బేషరతుగా పింఛన్ అందిస్తుంది. పౌరులందరినీ సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం చాలా పథకాలు ‘పేదరిక ఆధారిత లక్షిత విధానం’ (Poverty targeting)పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రభుత్వాలు దీనిని ‘పరిపాలనా సామర్థ్యం’ పేరుతో సమర్థిస్తుంటాయి. నిధుల లీకేజీలు తగ్గించి, ప్రభుత్వ సహాయాన్ని అర్హులుగా గుర్తించిన వర్గాలకే పరిమితం చేయాలనేది వారి వాదన. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఈ విధానాలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ సహాయం ‘అర్హులకే’ పరిమితం కావాలని భావించే సమాజంలోని ప్రభావశీల వర్గాలు కూడా ఈ లక్షిత విధానాలకే మద్దతు ఇస్తున్నాయి.


సిద్ధాంతపరంగా చూస్తే ఈ ‘టార్గెటింగ్’ విధానం సరైనదిగానే అనిపించవచ్చు. కానీ ఆచరణలో అది చాలా సంక్లిష్టమైన, భారీ పరిపాలనా యంత్రాంగంగా మారుతోంది. ఎందుకంటే ‘నిజమైన పేదలు’ ఎవరో గుర్తించడానికి ప్రభుత్వాలు ఇప్పుడు విస్తృతమైన డేటాబేస్‌లు, ఆధార్ అనుసంధానం, బ్యాంక్ లింకింగ్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్లు, డిజిటల్ ధ్రువీకరణ వంటి వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా సంక్షేమ వ్యవస్థలు ప్రజలకు సహాయం చేసేవిగా కాకుండా, డిజిటల్ ధ్రువీకరణ, అర్హత తనిఖీలపై అధికంగా ఆధారపడే యంత్రాంగాలుగా మారిపోతున్నాయి.

ప్రభుత్వాలు టార్గెటింగ్‌ను డబ్బు ఆదా చేసే విధానంగా చూపిస్తుంటాయి. కానీ ఈ భారీ డిజిటల్ డేటాబేస్‌ల నిర్మాణం, నిర్వహణ, ధ్రువీకరణ వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్ మౌలిక వసతులపై ప్రజాధనం ఎంత ఖర్చవుతోందో చాలా అరుదుగా చర్చకు వస్తుంది. అంతకంటే ముఖ్యంగా, ఈ క్రమంలో ప్రజలు భరిస్తున్న ఖర్చులు పూర్తిగా కనిపించకుండా పోతున్నాయి. ఆధార్ కేంద్రాలకు ప్రయాణాలు, కోల్పోయే కూలి, ఆహార ఖర్చులు, మధ్యవర్తులకు చెల్లింపులు – ఇవన్నీ పేద కుటుంబాల భుజాలపై అదనపు భారంగా మారుతున్నాయి.

దీనికి భిన్నంగా, ‘యూనివర్సల్’ విధానం చాలా సరళమైనది. ఇందులో వ్యవస్థ ప్రధాన లక్ష్యం ప్రజలను వడపోసి తొలగించడం కాదు; అందరినీ రక్షణ పరిధిలోకి తీసుకురావడం. ముఖ్యంగా చారిత్రకంగా వెనుకబడిన సమాజాల విషయంలో, ఈ సార్వత్రిక విధానం మరింత న్యాయసమ్మతమైనది.

సాధారణ ప్రజలకే ఈ వ్యవస్థలు ఇంత క్లిష్టంగా మారుతుంటే, ఆదివాసీ సమాజాల విషయంలో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి స్థిరమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ ఉన్నాయనే ఊహతో డిజిటల్ వ్యవస్థలు పనిచేస్తాయి. కానీ ఆదివాసీల జీవిత వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయి.


గతంలో ఆదివాసీ సంక్షేమం అనగానే షెడ్యూల్డ్ ఏరియాలు, అడవులు, భూమితో ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వలసలు, పట్టణీకరణ, సంప్రదాయ జీవనాధారాలు దెబ్బతినడం, ఉపాధి మార్గాలు మారడం – ఇవన్నీ కలిసి ఆదివాసీల జీవన భౌగోళికతను మార్చేశాయి. చాలామంది ఆదివాసీలు ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాలకు వెలుపల, పట్టణాల అంచుల్లో లేదా అనధికారిక కాలనీల్లో అస్థిర జీవితం గడుపుతున్నారు. ఈ మార్పు కేవలం నివాస ప్రాంతాల మార్పుగానే కాక, సంక్షేమ వ్యవస్థలతో వారి సంబంధాన్నే సంక్లిష్టంగా మార్చుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ‘పేదరిక ఆధారిత లక్షిత విధానాలు’ స్థిరమైన చిరునామాలు, భూమి రికార్డులు, ఆధార్ అనుసంధానం, బ్యాంక్ ఖాతాలు వంటి డాక్యుమెంటేషన్‌పై అధికంగా ఆధారపడుతున్నాయి. కానీ వలసలు, అస్థిర జీవన పరిస్థితులు, బలహీనమైన పరిపాలనా గుర్తింపుల కారణంగా అనేక ఆదివాసీ కుటుంబాలకు ఈ డాక్యుమెంట్లను సమకూర్చుకోవడమే కష్టంగా మారుతోంది.

ప్రత్యేకంగా యానాది, చెంచు వంటి సమాజాల విషయంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. భూమి, స్థిరమైన ఉపాధి లేకుండా, చెత్త ఏరుకోవడం వంటి అసురక్షిత పనులపై ఆధారపడుతున్న అనేక కుటుంబాలు ప్రభుత్వం ఊహిస్తున్న ‘స్థిరమైన పేద కుటుంబం’ అనే పరిపాలనా నమూనాలో సరిపోవడం లేదు. ఫలితంగా, అత్యంత అసురక్షిత పరిస్థితుల్లో ఉన్నవారే సంక్షేమ వ్యవస్థలకు దూరమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ‘టార్గెటింగ్’ కంటే ‘యూని వర్సాలిటీ’ మరింత కీలకం. సంక్షేమం అనేది భౌగోళికతను కాదు, మనిషిని అనుసరించాలి. ఆదివాసీల హక్కులు వారు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి అదృశ్యం కాకూడదు.

అందుకే ఆదివాసీల కోసం ‘యూనివర్సల్, హక్కుల ఆధారిత సామాజిక రక్షణ’ అవసరం. అంటే, ఆదివాసీలను ముందుగా అనుమానంతో చూడకుండా, సంక్షేమాన్ని వారికి సహజ హక్కుగా గుర్తించడం. ఉదాహరణకు, అన్ని ఎస్టీ కుటుంబాలకు ఆటోమేటిక్‌గా ఆహార భద్రత, వృద్ధాప్య పింఛన్ వంటి ప్రాథమిక సామాజిక రక్షణ పథకాలను అందించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కాదు; ఇది రాజ్యాంగ నైతికతకు సంబంధించిన విషయం.


అయితే కేవలం యూనివర్సల్ కవరేజ్ మాత్రమే సరిపోదు. ఆహార భద్రత చట్టం (NFSA), ఉపాధి హామీ చట్టం (MGNREGA) నిరూపించినట్టుగా, సంక్షేమం హక్కుల ఆధారితంగా ఉన్నప్పుడే పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక, చట్టబద్ధమైన స్థానం లభిస్తుంది. సామాజిక రక్షణ హక్కుల ఆధారితంగా లేకపోతే, అది ప్రభుత్వాల ఇష్టానుసార మార్పులకు, పరిపాలనా పరిమితులకు లోనవుతుంది. ఆదివాసీలను కేవలం ‘లబ్ధిదారులు’గా కాకుండా, హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించినప్పుడే నిజమైన సామాజిక రక్షణ సాధ్యమవుతుంది.

ఆదివాసీల సంక్షేమంలో ‘టార్గెటింగ్’ విధానం వల్ల అసలైన పేదలే నష్టపోతున్నారు. అనర్హులకు లబ్ధి చేకూరినా పర్వాలేదు కానీ, అర్హులు మాత్రం ఏ మాత్రం దూరం కాకూడదు. అనర్హులను కత్తిరించడం టార్గెటింగ్ లక్ష్యమైతే అర్హులను అక్కున చేర్చుకోవడం ‘సార్వత్రిక (యూనివర్సల్)’ విధానం ఉద్దేశం.

అటవీ హక్కుల చట్టం స్వయంగా ఆదివాసీలపై జరిగిన చారిత్రక అన్యాయాన్ని అధికారికంగా గుర్తించింది. కానీ ప్రస్తుత డిజిటల్, టార్గెటింగ్ ఆధారిత సంక్షేమ వ్యవస్థలు మాత్రం ఆదివాసీ జీవిత వాస్తవాలను ‘పేదరిక డేటా’గా కుదిస్తూ, వాటిని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోతున్నాయి.

భారత రాజ్యాంగ పీఠిక ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందిస్తామని హామీ ఇస్తోంది. ఆ హామీ నిజంగా అర్థవంతం కావాలంటే, ఆదివాసీల కోసం యూనివర్సల్, హక్కుల ఆధారిత సామాజిక రక్షణ వ్యవస్థను నిర్మించాల్సిందే. సంక్షేమం అనేది అనుమానంతో వడపోసే వ్యవస్థగా కాకుండా, ఆదివాసీలను హక్కులు కలిగిన పౌరులుగా గౌరవంతో రక్షించే రాజ్యాంగబద్ధమైన హామీగా మారాల్సిన సమయం ఆసన్నమైంది.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకులు, లిబ్‌టెక్ ఇండియా

ఈ వార్తలనూ చదవండి:

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్

Updated Date - May 26 , 2026 | 03:12 AM