సమయ దారిద్య్రమే అసలు పేదరికం
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:15 AM
సాధారణంగా సమాజాన్ని పైపై నుంచి పరిశీలించేవారికి ఆకాశాన్నంటే అద్దాల భవనాలు, నిరంతరం ఎగబాకుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు, ఆరు లైన్ల జాతీయ రహదారులు, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు రంగుల మాయాజాలంలా కనిపిస్తుంటాయి
సాధారణంగా సమాజాన్ని పైపై నుంచి పరిశీలించేవారికి ఆకాశాన్నంటే అద్దాల భవనాలు, నిరంతరం ఎగబాకుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు, ఆరు లైన్ల జాతీయ రహదారులు, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు రంగుల మాయాజాలంలా కనిపిస్తుంటాయి. ఇవన్నీ చూసి దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందనే ప్రచారం హోరెత్తుతుంటుంది. కానీ, ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా కేవలం కాగితాల మీద అంకెలలోనో, పారిశ్రామిక ఉత్పత్తిలోనో కాకుండా, ఉత్పత్తి సంబంధాల లోతుల్లో వెతికినప్పుడే అసలు వాస్తవం బయటపడుతుంది. ఆ కోణంలోంచి చూస్తే, ఈ అభివృద్ధి పునాదులు ఎక్కడో, ఆ పునాదుల కింద ఎవరి చెమట ఉచితంగా ఆవిరైపోతున్నదో తెలుస్తుంది.
మహిళల శ్రమ అనగానే దానికి ‘సేవ’ అనే పవిత్రమైన రంగు పులిమి వారి రక్తాన్ని చౌకగా పిండేయడంలో ప్రైవేటు సంస్థల కంటే ప్రభుత్వాలే క్రూరంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన అంశం ‘సమయ దారిద్ర్యం’ తన కోసం తాను కేటాయించుకోవడానికి కనీస సమయం లేకపోవడం కూడా మనిషికి అతి భయంకరమైన పేదరికమే
యావత్ పెట్టుబడిదారీ వ్యవస్థ నడుస్తున్నది సమాజంలో సగభాగమైన మహిళల మీదే. సాధారణ శ్రామిక కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ దోపిడీ స్వరూపం కళ్లకు కడుతుంది. తెల్లవారుఝామున ఐదు గంటలకే నిద్రలేచి, ఇల్లు ఊడ్చి, పొయ్యి వెలిగించి, వంట చేసి, భర్తకు క్యారేజీ కట్టి, పిల్లల్ని బడికి తయారుచేసి పంపి, ఆ తర్వాత తానూ కూలిపనికో, చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగానికో పరుగులు తీసే సగటు మహిళ దినచర్యనే తీసుకుందాం. సంప్రదాయ బూర్జువా ఆర్థికశాస్త్రం దృష్టిలో ఆమె ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో చేసే ఈ చాకిరీకి ఎలాంటి ఆర్థిక విలువా లేదు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం లెక్కలోకి రాని, కేవలం కుటుంబం మీద ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో చేసే వ్యక్తిగత సేవ మాత్రమే. కానీ, ఆ ఇంటి యజమాని అయిన పురుషుడు ఫ్యాక్టరీకో, ఆఫీసుకో వెళ్లి పది గంటల పాటు యంత్రంలా పనిచేసి, యజమానికి లక్షల రూపాయల అదనపు విలువను సృష్టించి పెడుతున్నాడంటే, ఆ శారీరక, మానసిక శక్తి అతనికి ఎక్కడి నుంచి వస్తున్నట్టు?
పెట్టుబడిదారీ ఉత్పత్తికి అత్యంత కీలకమైన ‘శ్రామిక శక్తి’ని ప్రతిరోజూ ఇంట్లో పునరుత్పత్తి చేస్తున్నది అక్షరాలా మహిళల శ్రమే. ఇంట్లో మహిళ ఈ పనిని ఉచితంగా చేయకపోతే, ఫ్యాక్టరీ యజమానే ఆ కార్మికుడికి మూడు పూటలా భోజనం, వసతి, బట్టలు ఉతికే ఖర్చు, పిల్లల సంరక్షణ ఖర్చు భరించాలి. అప్పుడు యజమాని లాభాలన్నీ ఆవిరైపోతాయి. దానర్థం, యజమాని తన లాభాలను పెంచుకోవడానికి కార్మికుడికి ఇవ్వాల్సిన జీతాన్ని కోత కోస్తూ, ఆ భారాన్ని మహిళల ఉచిత గృహ శ్రమ ద్వారా అతి తెలివిగా ఆదా చేసుకుంటున్నాడు. ఈ దోపిడీని కప్పిపుచ్చడానికి పితృస్వామ్య వ్యవస్థ అనాదిగా వేసిన అందమైన ముసుగులే ‘ఇల్లాలు’, ‘తల్లిప్రేమ’, ‘త్యాగమయి’ లాంటి కీర్తనలు. ఈ ముసుగులను తొలగించి, ఇంటి పని అనేది ప్రేమ కాదు, అదొక కఠినమైన శ్రమ అని గుర్తించనంత కాలం మహిళల ఆర్థిక బానిసత్వానికి అంతం ఉండదు.
జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించిన ‘టైమ్ యూజ్ సర్వే’ ప్రకారం, భారతదేశంలో మహిళలు ప్రతిఫలం లేని ఇంటి పనుల కోసం రోజుకు సగటున ఆరు గంటలు వెచ్చిస్తుంటే, పురుషులు కేవలం 90 నిమిషాల లోపే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదికల ప్రకారం భారతీయ మహిళలు ప్రతిరోజూ చేసే ఉచిత ఇంటి పనికి కనీస వేతనం కట్టి లెక్కిస్తే, దాని విలువ ఏడాదికి సుమారు రూ.19 నుంచి 22 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇది మన దేశ జీడీపీలో దాదాపు 15 నుంచి 17శాతానికి సమానం. ఇంత భారీ ఆర్థిక విలువను మహిళల శ్రమను ప్రభుత్వాలు ‘అనుత్పాదక శ్రమ’ కింద జమకట్టడం కంటే పెద్ద వక్రీకరణ మరొకటి లేదు.
1990ల తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాయని ఊదరగొడుతున్నారు. కానీ, ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త నాన్సీ ఫ్రేజర్ చెప్పినట్లుగా ఇదొక మోసం. స్త్రీవాద ఉద్యమాలు మహిళలకు ఇంటి బయట పనిచేసే హక్కు కావాలని పోరాడితే, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ డిమాండ్‌ను తన లాభాల కోసం అత్యంత చాకచక్యంగా మలుచుకుంది. మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకురావడం ద్వారా మొత్తం శ్రామికుల సంఖ్యను పెంచి, కార్మికుల కనీస వేతనాల విలువను అమాంతం పడగొట్టడంలో కార్పొరేట్ వ్యవస్థ విజయం సాధించింది. నేడు ద్రవ్యోల్బణం, ప్రైవేటీకరణ వల్ల భార్యాభర్తలు ఇద్దరూ పది గంటల చొప్పున అహర్నిశలు శ్రమిస్తేగానీ ఇల్లు గడవని దుస్థితి. సాఫ్ట్వేర్, రిటైల్, ప్రైవేట్ రంగాల్లో యజమానుల దోపిడీకి గురై ఇంటికి తిరిగి వచ్చే మహిళలకు ఇంట్లో మళ్లీ వంట, పిల్లల చదువు, వృద్ధుల సేవ అనే ‘రెండో షిఫ్ట్’ మెడపై కత్తిలా ఎదురు చూస్తుంటుంది.
నగరాల్లో ‘గిగ్ ఎకానమీ’ సృష్టిస్తున్న వైరుధ్యం మరింత సంక్లిష్టమైనది. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న ఎగువ మధ్యతరగతి మహిళలు తమ ఉద్యోగాలకు వెళ్లడానికి వీలుగా, ఇంటి పనుల కోసం వేరొక పేద మహిళను పనిలో పెట్టుకుంటున్నారు. అంటే, ఇక్కడ పితృస్వామ్యం విధించిన ఇంటిపని భారం రద్దయిపోలేదు, అది కేవలం ఉన్నత వర్గ మహిళ భుజాల మీది నుంచి అట్టడుగు దళిత, బహుజన మహిళ భుజాల మీదకు బదిలీ అయ్యింది. యాప్ ఆధారిత కంపెనీలు ఈ గృహ కార్మికులను ‘భాగస్వాములు’ అనే ముద్దుపేరుతో పిలుస్తూ పీఎఫ్, ఈఎస్ఐ, ప్రసూతి సెలవుల లాంటి కనీస హక్కులను ఎగ్గొడుతున్నాయి. కార్పొరేట్ బోర్డు రూముల్లో మహిళా సీఈఓలను చూసి మనం మురిసిపోతున్నాం కానీ, ఆ సీఈఓల ఇళ్లలోనే ఎటువంటి కార్మిక హక్కులు లేకుండా అదృశ్య బానిసలుగా మగ్గుతున్న అసంఖ్యాక మహిళల శ్రమ పునాదుల మీదే ఈ నయా ఉదారవాద సౌధం నిలబడి ఉందన్న చేదు వాస్తవాన్ని విస్మరిస్తున్నాం.
గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ప్రాంతాల వైపు చూస్తే ఈ శ్రమ దోపిడీ మరింత భయానకం. అప్పుల బాధతో పురుషులు వలస వెళ్లినా, ఆత్మహత్యలు చేసుకున్నా గ్రామాల్లో మిగిలిపోయి ఆ ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తమ భుజాలపై మోస్తున్నది మహిళలే. అడవికి వెళ్లి వంట చెరకు తేవడం, కిలోమీటర్లు నడిచి నీళ్లు మోయడం లాంటి శ్రమను దేశ ఆర్థిక కార్యకలాపాలుగా ఎవరూ గుర్తించరు.
ఈ దోపిడీ ప్రక్రియలో సంక్షేమ రాజ్యంగా చెప్పుకునే ప్రభుత్వాల పాత్రను కూడా ప్రశ్నించాలి. ప్రజలకు ఆరోగ్యం, పౌష్టికాహారం అందించాల్సిన మౌలిక బాధ్యతను నెరవేర్చడానికి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 50 లక్షల మందికి పైగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు... వారంతా మహిళలే. కానీ, రాజ్యం వీరిని కార్మికులుగా గుర్తించడానికి నిరాకరిస్తోంది. సామాజిక కార్యకర్తల పేరుతో కనీస వేతనం, పెన్షన్ ఇవ్వకుండా కేవలం ‘గౌరవ వేతనం’ విదిలిస్తూ పీడిస్తోంది. మహిళల శ్రమ అనగానే దానికి ‘సేవ’ అనే పవిత్రమైన రంగు పులిమి వారి రక్తాన్ని చౌకగా పిండేయడంలో ప్రైవేటు సంస్థల కంటే ప్రభుత్వాలే క్రూరంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ మొత్తం క్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన అంశం ‘సమయ దారిద్ర్యం’. తన కోసం తాను కేటాయించుకోవడానికి కనీస సమయం లేకపోవడం కూడా మనిషికి అతి భయంకరమైన పేదరికమే. రోజుకు 14 నుంచి 16 గంటలు యంత్రంలా పనిచేస్తున్న మహిళలు కనీస నిద్ర కూడా కరువై రక్తహీనత బారిన పడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగానే వారి సమయాన్ని దొంగిలిస్తోంది. ఎందుకంటే, వారికి కాస్త ఖాళీ సమయం దొరికితే చదువుకుంటారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు, తోటి శ్రామికులతో కలిసి సంఘాలు కడతారు, రాజ్యాన్ని ప్రశ్నిస్తారు. ఆలోచించే సమయాన్ని దొంగిలించడం ద్వారానే వ్యవస్థ వారి రాజకీయ చైతన్యాన్ని అణచివేస్తోంది.
వర్గ పోరాటం అంటే కేవలం ఫ్యాక్టరీ గేట్ల ముందు చేసే సమ్మె మాత్రమే కాదు. ఎక్కడైతే శ్రామిక శక్తి పునరుత్పత్తి అవుతుందో, ఆ ఇళ్లు, మురికివాడలు, పల్లెటూరి వీధులు అన్నీ వర్గ పోరాట క్షేత్రాలే. కేవలం చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తేనో, ఉన్నత పదవుల్లో కూర్చుంటేనో కోట్లాది మంది అట్టడుగు మహిళల కన్నీళ్లు తొలగిపోవు. పురుషులందరినీ శత్రువులుగా చూపిస్తూ సాగే పోరాటాలు కూడా పూర్తి పరిష్కారం కావు. మహిళలు చేసే గృహ శ్రమకు ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించినప్పుడే, ఆ సంరక్షణ భారాన్ని రాజ్యమూ (ఉచిత చైల్డ్ కేర్, ప్రజా ఆరోగ్య, విద్యా వ్యవస్థల ద్వారా), పురుషులూ సమానంగా పంచుకున్నప్పుడే మహిళలకు సమయ దారిద్ర్యం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రైవేటు ఆస్తిని, కుల ఆధిపత్యాన్ని, పితృస్వామ్య భావజాలాన్ని ఏకకాలంలో దెబ్బతీసే విశాల సాంస్కృతిక, ఆర్థికోద్యమం నేటి తక్షణ అవసరం. ఈ విముక్తి పోరాటం ప్రతి ఇంటి వంటగది గడప దగ్గర నుంచే మొదలవ్వాలి. గడప లోపలి చెమట చుక్కల విలువను గుర్తించని ఏ ఆర్థికశాస్త్రమైనా అసంపూర్ణమే, అది నిర్మించే ఏ అభివృద్ధి అయినా పచ్చి అబద్ధమే.
ఎం.కె. కుమార్
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు