Thovva: ఆ తొవ్వల మొదలైంది కవిత్వ నడక
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:25 AM
నా తొలి కవితా సంపుటి ‘తొవ్వ’. అప్పుడు సాహిత్యం అభ్యుదయ విప్లవ దశ నుంచి దళిత బహుజన వాదం దిశగా నడక సాగుతుంది. తెలంగాణ అస్తిత్వం మొగ్గ తొడుగుతున్న దశ కూడా అదే...
నా తొలి కవితా సంపుటి ‘తొవ్వ’. అప్పుడు సాహిత్యం అభ్యుదయ విప్లవ దశ నుంచి దళిత బహుజన వాదం దిశగా నడక సాగుతుంది. తెలంగాణ అస్తిత్వం మొగ్గ తొడుగుతున్న దశ కూడా అదే. ‘తొవ్వ’లో ఈ పాయలు అన్నీ కనిపిస్తాయి. ఎక్కువగా కవిత్వం చదవడమే ఇష్టమైన నేను 1988 నుంచి అప్పుడప్పుడు రాసి దాసుకుంటున్నాను. బి.ఎస్.రాములుతో మాట్లాడుతున్న ఒక సందర్భంలో ‘‘నీవు రాస్తున్న కవిత్వం పుస్తకంగా వేయొచ్చు కదా’’ అన్నారు. అప్పుడే తలకాయలో ఈ ‘తొవ్వ’ పడ్డది. నిజానికి ఇది 40 పుటల చిన్న సంపుటి. ఉన్నవి 21 కవితలే కానీ ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. ఇందులో ‘‘కనుకొనల నుంచి రాలుతున్న సముద్రం’’ అంటూ మొదలయ్యే ‘నా తెలంగాణ పల్లె’ కవిత ఆనాటి సామాజిక సంఘర్షణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అట్లాగే ‘బాలశిక్షలో దాచుకున్న నెమలికన్ను’ కవిత తెలంగాణ పల్లె బాల్యాన్ని నెమరు వేస్తూ అందరిని తనలోకి తీసుకెళ్తుంది. ఆ ‘తొవ్వ’ నాకు ఇప్పటి ‘జీవన తాత్పర్యం దాకా’ ఒక ప్రధాన రహదారిగా మారింది. ‘‘నేను నడుస్తున్న దారి చెమట చుక్కల పరిమళం’’ అంటూ మొదలయ్యే కవిత ‘తొవ్వ’. ఇదే పేరు బాగుంటదని సూచించింది జూకంటి జగన్నాథం.
కరీంనగర్ కస్తూరి గ్రాఫిక్స్‌లో రాత ప్రతి నుంచి డీటీపీ పూర్తి అయింది. తర్వాత ముఖచిత్రం కవర్ డిజైను ముద్రణ కోసం హైదరాబాద్‌కు నవంబర్ 2001లో అల్లం నారాయణ వద్దకు వెళ్లాను. ఆయన నాకు జర్నలిజంలో రాత పూతలు నేర్పిన గురువు. అప్పటికే చిత్రకారుడు అక్బర్‌చే మట్టి రంగులతో ముఖచిత్రం పూర్తి చేపించి ఉంచారు. తర్వాత అల్లమన్న, నేను, అక్బర్ కలిసి అమీర్‌పేటలో డిజైనర్ లేపాక్షి వద్దకు వెళ్లాము. ముగ్గురం చాలాసేపు డిజైన్లు చూస్తూ గడిపాం. లేపాక్షి గారు అక్షరాలు బొమ్మ డిజైన్ పూర్తిచేసి బ్రోమైడ్‌లు (ఎక్స్ రే ఫిలింలాగా సన్నగా ఉంటాయి) తీసి ఇచ్చారు. నేను వాటిని తీసుకొని గుడిపాటి గారి ద్వార నారాయణగూడలో ఓం సాయి గ్రాఫిక్స్ ప్రెస్‌కి వెళ్ళాను. 1000 పుస్తకాల ఆర్డర్. గుడిపాటి దగ్గరుండి అచ్చు వేయించారు. వారం రోజుల తర్వాత ‘తొవ్వ’ చేతికి అందగానే ఎంత ఆనందమో అది ఇప్పుడు చెప్ప తరం కాదు. వెల పదిహేను రూపాయలే పెట్టాం. చాలావరకు అమ్ముడుపోయాయి. 260 పుస్తకాలు గ్రంథాలయ సంస్థనే తీసుకుంది. మా హుస్నాబాద్ ‘నూతన సాహితి’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
2001 డిసెంబర్ 6,7 తేదీలలో ఢిల్లీలో జరిగే భారతీయ దళిత సాహిత్య అకాడమీ సభలకు వెళ్లాలని హుస్నాబాద్ నుంచి నేను, దార్ల రామచంద్ర నిర్ణయించుకున్నాం. బి.ఎస్. రాములు, శమ శ్రీ మల్లయ్య, అనిశెట్టి రజిత, విజయలక్ష్మి, వి.జి.ఆర్ నారగోని... మరికొందరు మిత్రులందరికీ కలిసి ఢిల్లీ వెళ్లాం. డిసెంబర్ 6 న అక్కడి అఖిల భారత దళిత రచయితల సదస్సులో సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ‘తొవ్వ’ ఆవిష్కరణ జరిగింది. తర్వాత 2002 ఫిబ్రవరి 9న కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య ‘సాహితీ గౌతమి’ ఆధ్వర్యంలో గండ్ర లక్ష్మణరావు అధ్యక్షతన ‘తొవ్వ’ పరిచయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభలో డాక్టర్ మలయ శ్రీ, వజ్జల శివకుమార్ , కె.ఎస్. అనంతాచార్యలు ప్రసంగించారు. అటు తర్వాత ఫిబ్రవరి 23 న హుస్నాబాద్‌లో నూతన సాహితీ ఆధ్వర్యంలో మరొక పరిచయ సభ జరిగింది. ఇందులో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసచార్య, జూకంటి జగన్నాథం, వడ్డేపల్లి మల్లేశం, దేశపతి శ్రీనివాస్‌లు ప్రసంగించారు. అప్పటికే ఆవిర్భవించిన తెలంగాణ రచయితల వేదిక పలు సభల్లో ‘తొవ్వ’ అందరి చేతుల్లోకి వెళ్ళింది. హనుమకొండలో తెరవే ప్రథమ సభలో కాళోజీ నారాయణరావు ‘తొవ్వ’ అనే పేరు చూసి ‘‘ఎన్ని రోజులకు కనపడ్డదిర ‘తొవ్వ’ ’’ అని సంబరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ భావజాల విస్తృతి జరుగుతున్న రోజులవి. ఇలాంటి అంశాలనే తడిపిన ఈ కవితా సంపుటి మీద వివిధ పత్రికల్లో యం. నారాయణ శర్మ, శిఖామణి, అనిందు, అల్లం నారాయణ, కె. శ్రీనివాస్, నాగ భైరవ కోటేశ్వరరావు, జగన్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, కల్వకుంట్ల రామకృష్ణ, శ్రీ దాస్యం లక్ష్మయ్య, మాకినీడు సూర్య భాస్కర్, దార్ల రామచంద్ర లాంటి ప్రసిద్ధులు మంచి ప్రోత్సాహక వ్యాసాలు రాసారు. ఇరవై నాలుగు ఏళ్ల క్రింది జ్ఞాపకాల రీళ్ళు ఇప్పటికీ తాజాగానే కదలాడుతున్నాయి. ఆ తొవ్వ లోనే కొనసాగుతున్న....
అన్నవరం దేవేందర్
94407 63479
ఇవీ చదవండి: