Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 5 01 2026

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:51 AM

మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలపై సదస్సు, టి.ఎల్‌. కాంతారావు స్మారక పురస్కారాల ప్రదానం, కలేకూరి ప్రసాద్ పురస్కారం, ఏటూరి వెంకయ్య నాయుడు & శకుంతలమ్మ స్మారక పురస్కారం, కొలకలూరి పురస్కారాలు, కళింగాంధ్ర కథావార్షిక 2025కు కథలు సూచించండి...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 5 01 2026

మహిళల ఆత్మకథలు

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్ కేంద్రంగా ‘మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు – సమాలోచనం’ రెండు రోజుల సదస్సు జనవరి 6, 7 తేదీల్లో జరుగుతుంది. వీసీ సూర్యాధనంజయ్ నేతృత్వంలో జరిగే సదస్సులో ముఖ్య అతిథి యోగితారణా, ఐఏఎస్‌ (ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ, తెలంగాణ); విశిష్ట అతిథి శ్రీమతి ఎ. దేవసేన (కమిషనర్ కళాశాల విద్యాశాఖ, తెలంగాణ). ఈ సదస్సులో కాత్యాయని విద్మహే, సి. మృణాళిని, గోగు శ్యామల, జూపాక సుభద్ర, అపర్ణ తోట, జి.వి. రత్నాకర్, గంపా వెంకట రామయ్య, జె. వెంకట రమణ తదితరులు పాల్గొంటారు.

ఎస్. రఘు

టి.ఎల్‌. కాంతారావు స్మారక పురస్కారాల ప్రదానం

తలగడదీవి లక్ష్మీకాంతారావు (టి.ఎల్. కాంతారావు) స్మృతిలో ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాలకు, 2025 సంవత్సరానికి మృణాళిని విమర్శలోనూ, నందకిశోర్ కవిత్వంలోను ఎంపికయ్యారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికీ రూ.50 వేల నగదు పురస్కారం, సత్కారం ఉంటాయి. ఈ సందర్భంగా టి.ఎల్‌. కాంతా రావు సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ ఉంటుంది. జనవరి 10 సా.6 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరిగే ఈ సభలో చినవీరభద్రుడు, కోడూరి విజయ్ కుమార్, రావులపాటి సీతారాం, చామర్తి మానస పాల్గొంటారు.

తలగడదీవి శైలజ

కలేకూరి ప్రసాద్ పురస్కారం

కలేకూరి ప్రసాద్ స్మారక పురస్కారానికి 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన అనువాద కవిత, అనువాద కథా సంపుటాలు 4 కాపీలు జనవరి 20 లోపు పంపాలి. ఫిబ్రవరి 2026లో జరిగే పురస్కార ప్రదానంలో రూ.15వేల నగదు, మెమొంటోతో సత్కారం ఉంటుంది. చిరునామా: పి.శ్రీనివాస్‌గౌడ్, 5–3–129/1, రోడ్ నెం: 2, బిల్డింగ్ నెం: 30, రామాలయం వీధి, శాంతి నగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500 072, ఫోన్‌: 99494 29449.

పి. శ్రీనివాస్‌ గౌడ్‌


ఏటూరి వెంకయ్య నాయుడు & శకుంతలమ్మ స్మారక పురస్కారం

ఏటూరి వెంకయ్య నాయుడు & శకుంతలమ్మ స్మారక పురస్కారానికి 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు 4 కాపీలు జనవరి 20 లోపు పంపాలి. ఫిబ్రవరిలో జరిగే పురస్కార ప్రదానంలో రూ.10వేల నగదు, మెమొంటోతో సత్కారం ఉంటుంది. చిరునామా: పి.శ్రీనివాస్‌గౌడ్, 5–3–129/1, రోడ్ నెం: 2, బిల్డింగ్ నెం: 30, రామాలయం వీధి, శాంతి నగర్, కూకట్ పల్లి, హైదరాబాద్ – 500 072, ఫోన్‌: 99494 29449.

ఏటూరి నాగేంద్రరావు

కొలకలూరి పురస్కారాలు

2026 సంవత్సరానికి కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం, కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం, కొలకలూరి రామయ్య విమర్శ పురస్కారాలకు ఆయా ప్రక్రియల్లో 2024 జనవరి 1 తర్వాత మొదటిసారి ప్రచురితమై గ్రంథాలు నాలుగేసి ప్రతులను పంపాలి. ఒక్కో పురస్కారానికి నగదు బహుమతి రూ.20వేలు. రచయితలు/ ప్రచురణకర్తలు గ్రంథాలను జనవరి 15లోపు పంపాలి. కథా సంపుటాలను, నవలలను పంపే చిరునామా: కొలకలూరి మధుజ్యోతి (ఫోన్‌:94419 23172), తెలుగు శాఖాధ్యక్షులు & పరీక్ష విభాగం డీన్‌, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి– 517502. విమర్శనా గ్రంథాలను పంపే చిరునామా: కొలకలూరి సుమకిరణ్‌ (ఫోన్‌: 99635 64664), ఆంగ్లాచార్యులు, అధ్యక్షులు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి – 517502.

కొలకలూరి ఇనాక్‌


కళింగాంధ్ర కథావార్షిక 2025కు కథలు సూచించండి

కళింగాంధ్ర జీవన ఆకాంక్షలను, భావోద్వేగాలను, ఆలోచన సరళిని, ప్రాపంచిక దృక్పథాన్ని ఒడిసి పట్టుకునే ప్రయత్నంగా, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు సంపాదకత్వంలో వస్తున్న ‘కళింగాంధ్ర కథ 2025’ సంకలనానికి 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు వివిధ మాధ్యమాలలో, అంటే ప్రింట్‌ లేదా డిజిటల్‌ పత్రికలలో, ప్రచురితమైన వాటిలో మీకు నచ్చిన కథను sikkolubooks@gmail.com మెయిల్‌ లేదా 99892 65444 నెంబరుకు వాట్సప్‌ ద్వారా సూచించగలరు. ఈ కథా సంకలనంతో పాటు ప్రచురితం కానున్న కళింగాంధ్ర కథకుల డైరక్టరీ కోసం వర్తమాన కళింగాంధ్ర కథకులు తమ పేరు, ఫోన్ నెంబర్లను నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి.

సిక్కోలు బుక్స్

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 12:51 AM