Share News

ఈ గొడవ స్త్రీల దుస్తుల గురించి కాదు

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:02 AM

ఇటీవల ఇద్దరు తెలుగు సినిమా హీరోయిన్లు షాపింగ్ మాల్స్‌కు వెళ్ళినప్పుడు చుట్టూ వున్న మగాళ్లు వారిని బహిరంగంగా వేధించారు. ఆ మగాళ్ల ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ పోలీసులు...

ఈ గొడవ స్త్రీల దుస్తుల గురించి కాదు

ఇటీవల ఇద్దరు తెలుగు సినిమా హీరోయిన్లు షాపింగ్ మాల్స్‌కు వెళ్ళినప్పుడు చుట్టూ వున్న మగాళ్లు వారిని బహిరంగంగా వేధించారు. ఆ మగాళ్ల ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ పోలీసులు వారి మీద ఏ కేసులూ పెట్టలేదు. అనుమతి లేకుండా ఆడవాళ్ళ శరీరాన్ని ముట్టుకోవటానికి ప్రయత్నించటం, తాకటం, బట్టలు లాగటం, లైంగిక వేధింపుల కిందకు వస్తాయని వారికి తెలియంది కాదు. ఆయా ఆడవాళ్లు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు అనటానికి ఇవెక్కడో రహస్యంగా జరిగినవి కూడా కాదు. ఈ సంఘటనలను కేవలం సెలెబ్రిటీ సంస్కృతిలో భాగమని కొట్టిపడెయ్యలేం. హోలీ పండుగప్పుడు ఉత్తర భారతదేశంలో, కొత్త సంవత్సర వేడుకలప్పుడు బెంగళూరులో, గోవాలో ఇలా బహిరంగ వేధింపులు జరుగుతాయని వార్తల్లో వింటూనే వున్నాం. దీనికున్న చారిత్రక సాంస్కృతిక కారణాలు లోతయినవే.

బహిరంగ స్థలాల్లో తమ కుటుంబ మగవాళ్ళతో కాకుండా తమంతట తాము స్వేచ్ఛగా తిరిగే ఆడవాళ్ళను భారతీయ మగస్వామ్యం ‘అందరికీ చెందిన ఆడవాళ్ళు’గా పరిగణిస్తుంది. తరతరాలుగా భూస్వామ్య సంస్కృతిలో అధికార కులాల మగవాళ్ళు శ్రామిక వర్గ– కుల స్త్రీలను హక్కుగా వాడుకున్న అలవాటు వల్ల, ఇంటికి బందీ అయ్యి ఉండకుండా బయట తిరిగి, పనిచేసే ఆడవాళ్ళందరినీ తక్కువ చూపు చూసే అలవాటు బలంగా వేళ్ళూనుకుని వుంది. ఆ చూపు ఆడవాళ్ళను ‘మర్యాదస్థులు’ ‘అమర్యాదస్థులు’ అని విభజిస్తుంది. ఈ కనిపించని గీతకు సరయిన వైపు ఉండటానికి, అంటే తమను తాము మర్యాదస్థులని నిరూపించుకోవటానికి, ఈ దేశంలో ప్రతి మహిళా, నాతో సహా, తన శరీరాన్ని, ఆహార్యాన్ని, నడకను, నడవడికను ఎప్పటికప్పుడు పోలీసింగ్ చేసుకుంటూ ఉంటుంది.

నటీమణుల వేధింపుల విషయంలో ఇంకొక పార్శ్వం కూడా వుంది. ఒక శతాబ్దం క్రితం వరకూ, తీరికగా కళను అభ్యసించి, వాటిలో నైపుణ్యం తెచ్చుకున్న ఆడవాళ్ళందర్నీ కొన్ని ప్రత్యేక సమూహాల కింద పరిగణించేవారు. తవాయిఫ్, దేవదాసీ, కళావంతులు, భోగంవాళ్ళు– అని వివిధ పేర్లున్న ఈ సమూహాల స్త్రీలు నృత్యం, సంగీతం, ఇతర కళల్లో ఆరితేరి జమీందార్లు, రాజులు, జాగీర్దార్లు, ఇతర వ్యాపారస్థులను అలరించి, ప్రతిఫలంగా ఆస్తిని పొంది, స్వతంత్రంగా బతికేవాళ్ళు. రాచరిక–భూస్వామ్య పితృస్వామ్యంలో వీరికొక స్థానం ఉండేది. అన్ని రకాల నృత్యాలు, సంగీతాలను శతాబ్దాలపాటు కాపాడింది ఈ సమూహాల స్త్రీలే. హిందీ సినిమాల నుంచి తమిళ, తెలుగు సినిమాలలోకి మొదట ప్రవేశించిన నటీమణులలో అనేకమందికి ఈ కళా సమూహాల నుంచి వచ్చిన నేపథ్యం ఉంది.


అయితే, ఇలా కుటుంబాల బయట స్వతంత్ర స్త్రీలు ఉండటం బ్రిటిష్‌ మగస్వామ్యానికి నచ్చక 19వ శతాబ్దపు రెండవ భాగంలో కొత్త చట్టాలు తీసుకొచ్చి, వీళ్ళపై అమర్యాదస్థులు అని ముద్ర వేసి, వాళ్ళ ఆస్తిని, భూమిని లాగేసుకుని, వారిని అందరికీ శరీరాన్ని అమ్ముకునే స్త్రీలుగా దిగజార్చింది. ఈ మార్పులో అప్పటికి రూపుదిద్దుకుంటున్న భారతీయ మధ్యతరగతి మగస్వామ్యం కూడా అత్యుత్సాహంగా పాల్గొంది. జాతీయోద్యమం సమయంలో బ్రిటిష్‌ విక్టోరియన్ భావజాలాన్ని తమదిగా చేసుకున్న మధ్యతరగతి మగస్వామ్యం బలపడింది. అది ఇటువంటి ‘అమర్యాద కరమైన’ సమూహాల స్త్రీల నుంచి సంగీతాన్ని, నృత్యాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టింది. వీరేశలింగం వంటి మొదటితరం మగ సంఘసంస్కర్తలు ఈ చర్యలకు మద్దతు ఇచ్చారు. ఈ మధ్యతరగతివారు తమ కుటుంబాల స్త్రీలకు కొంత సంగీతాన్ని, నృత్యాన్ని నేర్పించటంతో మొదలుపెట్టి, ఆ కళారూపాల నుంచి శృంగార సంబంధిత పార్శ్వాలన్నింటినీ ‘అశ్లీలం’ పేరుతో తీసిపడేసి, దైవభక్తికి ముడేసి, వాటిని ‘శాస్త్రీయ’ కళలుగా మార్చారు. ఆ క్రమంలోనే సదిర్ నుంచి భరతనాట్యం రూపొందింది. ఇక వీరు అమర్యాదకరమని ముద్ర వేసిన అసలైన కళా సమూహాలు సెక్స్‌ వర్క్ లేదా సాధారణ రికార్డింగ్ నృత్యాల వంటి ప్రమాదకరమైన లైంగిక శ్రమలోకి నెట్టివేయబడ్డాయి. కుల, వర్గ, మగస్వామ్య సంస్కృతి ఈ రెండిటి మధ్య గీతను గీసి, నియంత్రించింది.

1947 తర్వాత పోషక వర్గ మగస్వామ్య చూపుతో రూపుదిద్దుకున్న సినిమావరణం, మధ్యతరగతి మగవాళ్ళకు ఒక పక్క రికార్డింగ్ డాన్సులు, మరో పక్క శాస్త్రీయ నృత్యరూపాలు, ఈ రెండిటినీ ఒకే తెర మీద చూపించింది. పౌరాణిక, జానపద సినిమాల్లో మగ ఋషుల తపస్సును భగ్నం చెయ్యటానికో, దేవేంద్రుడి సభలో రంభా ఊర్వశి నృత్యాలనో, రాజుసభలో నృత్యమనో, మగ కవికి ఉత్సాహం అందించటానికో, మగ హీరోల శృంగార కలల్లోనో వివిధ రకాల శృంగార శాస్త్రీయ నృత్య రూపాలు వాడారు. సాంఘిక సినిమాలు పెరిగాక, మగ పాత్రలు క్లబ్బుకు వచ్చినప్పుడు మర్యాదస్థులు కాని స్త్రీలు కాబట్టి, వాళ్ళతో రికార్డింగ్ నృత్యాలు చేయించారు.


సినిమాల్లో శృంగార నృత్యాలు, సంసార పాత్రలు, క్లబ్బు నృత్యాలు... ఏం చేసే స్త్రీలకయినా, మధ్యతరగతి కుటుంబ స్త్రీలకు లేని స్వతంత్ర జీవితం, డబ్బు, స్వేచ్ఛ వృత్తిరీత్యా లభిస్తుంది. అయితే, మగస్వామ్య ద్వంద్వ విలువలను కాపాడటం కోసం, ప్రేక్షకుల కోసం తెరమీద ఎంత రిస్కీ పాత్ర పోషించినా, బయట మాత్రం సంప్రదాయ మహిళల వలె మగ ఆధారిత జీవన విధానాన్ని అనుకరించాలి. కొంతమంది పెట్టి పుట్టిన వాళ్ళు తప్ప ఎవరూ తమ స్వతంత్రతను చూపించుకోలేరు. 1990లలో ఆర్థిక ఉద్దీపన విధానాల అనంతరం లైంగికత, శరీరం, బట్టల గురించిన విలువలు తీవ్ర గతిన మారిన తర్వాత, గత ఇరవయ్యేళ్ళల్లో తెరపై జీవితానికి, తెర బయట జీవితానికి మధ్య తేడా చెరిగి, హీరోయిన్ల స్వతంత్ర జీవితం కొంత వెలుగులోకి వచ్చింది. తమది కాని సంప్రదాయ జీవితాన్ని నటించాల్సిన ఒత్తిడి కొంత తగ్గింది.

కానీ తెలుగు మగస్వామ్య చూపు ఇంకా బలంగా నిలబడే ఉంది. వెల్లువలా వచ్చిన సాంస్కృతిక మార్పును పక్కకు తోసి నయానో భయానో కొంత స్వతంత్రం, అధికారం, సమానత్వం రుచి చూసిన ఇటువంటి ఆడవాళ్లను బట్టల పేరుతో కట్టడి చెయ్యాలని చూస్తోందది. 19వ శతాబ్దపు మగ సంస్కర్తలు తాము ఆడవాళ్ళ ఉద్ధరణ కోసమే అంతా చేస్తున్నామని భావిస్తే, ఇప్పటి సినిమా–మీడియా సంస్కర్తలు స్త్రీల రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని అంటున్నారు.

19వ శతాబ్దపు చివర్లో బ్రిటిషు వాళ్ళు తీసుకొచ్చిన మార్పులను దేవదాసీ సమూహానికి చెందిన బెంగళూరు నాగరత్నమ్మ వంటి స్త్రీలు– ముద్దు పళని రాసిన శృంగార కావ్యం ‘రాధికా సాంత్వనం’ ప్రచురించి వ్యతిరేకించారు. కొన్ని దశాబ్దాల తర్వాత 20వ శతాబ్దంలో ముత్తు లక్ష్మిరెడ్డి వంటి మరి కొంతమంది కళలు, కళారూపాలు సంతరించుకున్న కులస్వామ్య రూపాన్ని వద్దన్నారు. శతాబ్దం కిందే తెలుగునాట చదువుకున్న ఆడవాళ్లు ‘మాకీ సంస్కరణ– సంరక్షణ– రక్షణా చట్రం వద్దు’ అంటూ మగస్వామ్య ద్వంద్వ విలువలను ప్రశ్నించారు. 1980లు, 1990లలో వచ్చిన స్త్రీవాదం మగస్వామ్య చూపును, దృక్కోణాన్ని ఎండగట్టింది. ‘నిండుగా’ చీర మాత్రమే కట్టుకున్న తరానికి చెందిన స్త్రీవాది అయిన జయప్రభ మగచూపులను తట్టుకోలేక, ‘పైటను తగలేద్దాం’ అని ప్రకటించారు. గత పదేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో యాక్టివిస్టు స్త్రీలందరూ మీడియా మోరల్ పోలీసింగ్‌కు, సైబర్ బుల్లియింగ్‌కు వ్యతిరేకంగా గొంతెత్తుతూనే ఉన్నారు. కానీ తమ చూపు, ఆసక్తులు, ప్రయోజనాలు, సందేశాలు తప్ప వేరే ఏవీ పట్టని అభినవ గిరీశాలకు ఇవన్నీ ఎప్పుడు గుర్తుండాలి?!


ఇక్కడ విషయం– అసలు దుస్తుల గురించి కాదేమో. తాము ఏ పాత్ర పోషించినా, ఏ పని చేసినా, తమ సౌందర్యం గురించి తాము అవమానపడబోమని, మగస్వామ్యం గీసిన మర్యాద గీతను, ద్వంద్వ విలువలను పట్టించుకోబోమని చెప్తున్న ఆడవాళ్ళ గురించి. ‘ముందు మీ చూపు మార్చుకుని, మిమ్మల్ని మీరు ఎందుకు సంస్కరించుకోకూడదు’ అంటే వస్తున్న ఆగ్రహం ఇది. ప్రపంచమంతా స్త్రీల స్వతంత్రతకు అలవాటు పడుతుంటే, తెలుగు మగవాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుతున్నారంటే, సంస్కరణ కావాల్సింది ఎవరికన్నట్లు? తమ ఒప్పుకోలు, చూపు, నియంత్రణ వద్దూ అంటున్న స్త్రీలను చూసి, తప్పిపోతున్న తమ నియంత్రణను కాపాడుకోవటానికి ఆధునిక మగస్వామ్యం చేస్తున్న ఆక్రందనల్లా కన్పిస్తున్నాయి ఇవన్నీ. ఈ మొత్తంలో ఆ ఇద్దరు హీరోయిన్లపై బహిరంగ వేధింపులు జరగగా... ఏ చట్టపరమైన చర్యా తీసుకోకుండా, చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకున్న పోలీసు వ్యవస్థది మాత్రం అతి ప్రత్యేక స్థానం!

ఎ. సునీత

ఇవి కూడా చదవండి

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

Updated Date - Jan 22 , 2026 | 04:02 AM