మనను మైమరిపించే మధుర మామిడి
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:34 AM
కరుణామయుడు అయిన భగవంతుడు కనికరం లేని వేసవి కాలాన్ని ఎందుకు సృష్టించాడు? ఇదొక చిక్కు ప్రశ్న. నాకు తెలిసిన ఒకే ఒక్క సమాధానం : మామిడి పండు. ఈ పండ్లను మధురమూ, రసప్లావితమూ చేసేందుకు...
కరుణామయుడు అయిన భగవంతుడు కనికరం లేని వేసవి కాలాన్ని ఎందుకు సృష్టించాడు? ఇదొక చిక్కు ప్రశ్న. నాకు తెలిసిన ఒకే ఒక్క సమాధానం : మామిడి పండు. ఈ పండ్లను మధురమూ, రసప్లావితమూ చేసేందుకు భగవంతుడు ఈ లోకం పైకి వేడిని వర్షించాడు. ప్రస్తుత రాజకీయ సందిగ్ధావస్థకు సమాధానం కూడా మామిడి పండ్లే సుమా! బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దాకా దేశవ్యాప్తంగా ప్రబలంగా వీస్తున్న రాజకీయ చండమారుతాల ఉధృతిని తట్టుకునేందుకు ఏమి చేయాలి? మధుర మామిడి పండ్లు ఆస్వాదించడమే కాదూ? మీకు వీలైతే ఆ ఫలరాజాల గురించి కూడా చదవండి.
గత వారాంతంలో నేను అదే చేశాను. నా స్నేహితుడు ఫాహీమ్ ఖాన్ తోట నుంచి నేరుగా పంపిన మధురాతి మధురమైన మామిడి పండ్లను ఆబగా ఆస్వాదించాను. నా మరో స్నేహితుడు సోపాన్ జోషి అద్భుత రచన ‘మాంగిఫెరా ఇండికా: ఎ బయోగ్రఫీ ఆఫ్ మ్యాంగో’ విశేష ఆసక్తితో చదివాను. ‘ఇంగ్లీష్ వారికి వాతావరణం ఎలాగో భారతీయులకు మామిడి పండ్లు అలాంటివి’ అని జోషి నొక్కి చెప్పారు. ఆయన ఇంకా ఇలా రాశారు: ‘ఆ మధుర ఫలం గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అది అంత ఎక్కువగా మనకు దర్పణం అవుతుంది. జనులు మామిడి పండు గురించి మాట్లాడినప్పుడు అంతిమంగా తమ వ్యక్తిగత మూలాలను, అభిరుచులను, ప్రాంతీయ వారసత్వాన్ని వెల్లడిస్తారు. మన మామిడి పండ్లు మనలను నిర్వచిస్తాయి’.
సరే మామిడి పండ్ల విషయంలో నా పక్షపాతాల గురించి కూడా మనసు విప్పుతాను. నేను పుట్టిన హర్యానా ప్రాంతమూ, నేను పెరిగిన రాజస్థాన్ ప్రాంతమూ మామిడి పండ్లకు ప్రసిద్ధమైనవి కావు. కనుక మామిళ్లలో ఉత్తమమైనవి ఏవి అనే విషయమై చర్చలో నన్ను నేను తటస్థ తీర్పరిగా భావించుకుంటున్నాను. అల్ఫెన్సో మామిడి పండు రుచిలో పరిపూర్ణమైనది కానప్పటికీ అధికధర పొందుతున్నదని నేను విశ్వసిస్తున్నాను. ఆ ప్రకారం చూస్తే, అఖిల భారత అల్ఫెన్సో వ్యతిరేక సంఘానికి నేను జీవితకాల అధ్యక్షుడిని. రెండో సభ్యుడు చేరిక కోసం ఇంకా నిరీక్షిస్తున్నాను. సఫైదా మామిడి పండు వీధి చివర ఉండే పండ్లరసాల దుకాణాలలో వినియోగం కోసం పుట్టిందని నా అభిప్రాయం. దశేరీ మామిడి పండు లతామంగేష్కర్ మధురగానంలా సుమధురమైనది. ఆ గానమూ, ఈ రసాలమూ మనకు సంపూర్ణ సంతృప్తినిస్తాయి. లంగ్డా రుచి గీతాదత్ గానం వలే శ్రేష్ఠమైనది, ఉల్లాసాన్నిచ్చేది, సందేహం లేదు. చౌసాకు సాటివచ్చే మామిడి పండు మరేదీ లేదు. చౌసా మాధుర్యాన్ని వర్ణించేందుకు ఎటువంటి ఉపమ అవసరం లేదు. ఆ పేరే దివ్యమైనది.
నా స్నేహితుడు పంపిన మధుర ఫలాలను ఆస్వాదిస్తూ ఆయా మామిడి పండ్ల గురించి పునరాలోచించడం ప్రారంభించాను. ఇంతకు ముందు గులాబ్ జామ్‌ను నేను ఎందుకు రుచి చూడలేదని నాలో నేను ఆశ్చర్యపోయాను. మామిళ్ల గురించిన ఈ చర్చని హఠాత్తుగా మిఠాయిల వైపు మార్చుతున్నానని మీరు పొరపడకండి. నేను మామిళ్లలో రకాల గురించే మాట్లాడుతున్నాను. ఏటా మూడు నెలల పాటు మే 18 నుంచి ఆగస్టు 15 దాకా నా ఆలోచనలన్నీ వాటిచుట్టూనే తిరుగుతూంటాయి. నిర్దిష్ట తేదీలను ఎందుకు చెప్పానని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మొదటి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు జెస్టేషనల్ డయాబెటిస్ కారణంగా మామిడి పండ్లను తినడం నిలిపివేశాము. కఠినమైన ఆహార నియమమది. ప్రసవం తరువాత ఆ ఆహార నియమాల నుంచి విముక్తి లభించింది. ఆ ఆనందాన్ని మామిడి పండ్ల విందుతో వేడుక చేసుకున్నాం ఆ వేడుక ఆచారం క్రమంగా ఏటా జరిగే సంప్రదాయంగా పరిణమించింది.
సరే, మళ్లీ గులాబ్ జామున్ విషయానికి వస్తాను. అది ఒక చిన్న, ఆకుపచ్చని వర్ణంలో ఉండే మామిడి పండు. లంగ్డా అని పొరపడేందుకు అవకాశమూ ఉన్నది. రుచి, రూపంలో దానికంటే మిన్న అయినది, సందేహం లేదు. దానిపై మీరు చాకును ఉపయోగించనవసరం లేదు. తోలు తీసేసి నోట్లో పెట్టుకుని జుర్రుకోవచ్చు. ఐదు శతాబ్దాల క్రితం మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ తన ఆత్మకథలో గులాబ్ జామున్ ఆస్వాదించడం గురించి అలానే రాశాడు. ఢిల్లీకి సమీపంలోనే గులాబ్ జామున్ మామిళ్లను ఇచ్చే మామిడి తోటలు ఉన్నాయి.. షాజహాన్ చక్రవర్తికి విశ్వసనీయుడు అయిన అధికారి ఒకరు మీరట్‌కు సమీపంలో స్థిరపడిన షాజహాన్ పూర్ మొదలైన 16 గ్రామాల్లో ఈ మామిడి పండ్లు లభిస్తాయి. ఢిల్లీకి సమీపంలో ఉన్నప్పటికీ అవి ఢిల్లీలోని మామిడి పండ్ల విపణిలో లభించవు. గులాబ్ జామున్ రైతులు కుటుంబ వినియోగం కోసమే వాటిని పెంచుతారని ఫాహీమ్ ఖాన్ చెప్పాడు. రటౌల్ అనే మరో మధుర మామిడి కూడా ఢిల్లీ సమీప గ్రామాల్లో పెరుగుతుంది. అయితే ఢిల్లీ దుకాణాలలో అది లభ్యంకాదు. బిహార్ నుంచి, ఆ మాటకొస్తే మామిడి పండ్లను కాపుకాయించే మరే రాష్ట్రం నుంచి వచ్చిన స్నేహితుడినైనా అడగండి, బైజు అనే మామిడి పండు గురించి తమ బాల్య స్మృతులను ఏకరవుపెడతారు. ఇప్పుడు ఆ ఫలం తమకు ఎక్కడా లభ్యం కావడం లేదని కూడా చెప్పుతారు.
మా కుటుంబానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేస్తాను. మా అమ్మగారు తన బాల్యాన్ని అలహాబాద్‌లో మామిడి పళ్ల మధ్యనే గడిపారు. వివాహానంతరం మా నాన్నతో కలిసి ఆమె మళ్ళీ అలహాబాద్‌కు వెళ్లినప్పుడు బంధువులు తరిగిన మామిడిపళ్ళ ముక్కలను ఒక ప్లేట్‌లో పెట్టి ఇచ్చారట. మా అమ్మకు ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. కానీ, ఆ ముక్కలను ఎలా తినాలో ఆమెకు తెలియలేదు. దీన్నిబట్టి మామిడిపండ్లతో మన సంబంధంలో ఎటువంటి మార్పులు సంభవించాయో విశదమవుతుంది. మామిడి పండ్ల గాథలో చాలా మార్పులు సంభవించాయి. రసాల కంటే ముక్కలుగా కోసుకుని తినే కాయలకు ప్రాధాన్యం పెరిగింది. అలాగే చాలాకాలం నిల్వ ఉండేకాయలకు ప్రాధాన్యం పెరిగింది. రుచి కంటే రూపం ఎక్కువైపోయింది. రైతుల కంటే వ్యాపారుల మాటకే మన్నన లభించడం ఆరంభమయింది. ఆధునిక మార్కెట్లు ఉత్పత్తిని, వినియోగదారులను ఎలా మార్చివేశాయన్న దానికి మామిడిపండ్ల గాథే సరైన తార్కాణం.
జోషి తన పుస్తక రచనకు లోతైన, విస్తృత పరిశోధన చేశారు. దేశవ్యాప్తంగా మామిడి తోటల సాగుదారులు, మామిడి పండ్ల విక్రయదారులు, ఆ మధుర ఫలాలను ఆస్వాదించేవారు వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలతో మామిడి గాథను జోషి అందంగా హృద్యంగా రాశారు. ఆయన కేవలం లక్నో, బెనారస్ కొంకణ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా పర్యటించారు. అన్ని ప్రాంతాల మామిడి పండ్ల రుచిని తెలుసుకున్నారు. అన్ని ప్రాంతాల మామిడి పండ్ల సంస్కృతిని తెలుసుకున్నారు. ఈ అనుభవాలు అన్నీ ఆయన పుస్తకంలో ప్రస్ఫుటమయ్యాయి. మీరూ ఆయనతో పాటు ఆయా ప్రాంతాలతో మమేకమవుతారు.
జోషీ ప్రయాణాలన్నీ ఫలప్రదమైనవి కావు. నాకు ప్రియాతి ప్రియమైన చౌసా మామిడి మూలాలు ఏమిటో స్పష్టం కాలేదు. అయితే జోషి ప్రతి ప్రయాణమూ ఒక ఆసక్తికరమైన విశేషాన్ని వెల్లడించింది. ప్రాచీన, ఆధునిక చరిత్ర నుంచి మామిడి పంటకు సంబంధించిన విశేషాలను వివరించారు. మహాత్మాగాంధీ మామిడి పండు ‘శాపగ్రస్థ ఫలం’ అని ఎందుకు అన్నారో, జైలులో ఉన్న డాక్టర్ రామ్‌మనోహర్ లోహియాకు జవహర్ లాల్ నెహ్రూ మామిడి పండ్లను పంపించడం ఆయనకు, సర్దార్ పటేల్‌కు మధ్య వాగ్వివాదానికి కారణమయిందని జోషీ తెలిపారు. వివిధ వైజ్ఞానిక పరిశోధనాశాలలు, జన్యు, పర్యావరణ, వ్యవసాయశాస్త్ర క్షేత్రాలలో ప్రముఖులైన శాస్త్రవేత్తల గురించి కూడా ఆయన రాశారు. కిరాణా వ్యాపారులు, మధ్య దళారులు, ఎగుమతిదారులతో మాట్లాడి మామిడి పండ్ల ఆర్థిక సత్యాలను వెల్లడించారు. ప్రపంచ మామిడి పండ్ల ఉత్పత్తిలో సగం మన దేశంలోనే జరుగుతోంది. నాణ్యత చూస్తే అద్వితీయమైనది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో మన మామిడి పండ్లకు సముచిత ప్రాధాన్యం ఎందుకు లభించడం లేదో జోషి వివరించారు. మన సువిశాల దేశంలోని అన్ని ప్రాంతాలలో లభ్యమయ్యే మామిడి పండ్ల గురించి విపులంగా తెలియజేసిన జోషి పుస్తకం నా లాంటి మూర్ఖపు మామిడి జాతీయవాదులకు కనువిప్పు కలిగించేది. మతోన్మాదం, దౌర్జన్యవాదం బుసలు కొడుతున్న ఈ రాజకీయ వేసవిలో జోషి పుస్తకాన్ని చదవడం ఆలోచింప చేసే, ఉపశమనం కలిగించే పఠనానుభవమే.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ALso Read:
18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల