సంక్షేమం ఆర్థిక భారం కాదు, అభివృద్ధికి బాట!
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:24 AM
ప్రభుత్వరంగ సంస్థల గురించి ఒక అపోహ దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే ఆ సంస్థలు దివాళా తీస్తాయని, ప్రజలకు రాయితీలు ఇస్తే ఆర్థిక క్రమశిక్షణ..
ప్రభుత్వరంగ సంస్థల గురించి ఒక అపోహ దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే ఆ సంస్థలు దివాళా తీస్తాయని, ప్రజలకు రాయితీలు ఇస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని, అవి ఎప్పటికీ లాభాల్లోకి రావని కొందరు నమ్మించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సాధించిన చారిత్రాత్మక విజయం ఈ అపోహలన్నింటినీ ఒక్కసారిగా చెదరగొట్టింది.
దాదాపు పదేళ్ల పాటు నష్టాలతో పోరాడిన టీజీఎస్ఆర్టీసీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,059 కోట్లకు పైగా మిగులు నమోదు చేయడం కేవలం ఒక ఆర్థిక గణాంకం కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలనాతత్వానికి, దూరదృష్టికి, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధితో ముడిపెట్టిన ఆలోచనకు దక్కిన ఘన విజయం. దీనిని అర్థం చేసుకోవాలంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒకప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థ, రెండేళ్ల వ్యవధిలోనే వరుసగా మిగులు ఎలా సాధించింది? ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీని కేవలం ఒక వ్యాపార సంస్థగా చూడలేదు. ప్రజల జీవితాలను ముందుకు నడిపే సామాజిక బాధ్యత కలిగిన ప్రజాసేవా సంస్థగా చూసింది. అదే ఆలోచన ఈ మార్పునకు పునాది అయింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఆర్టీసీ పూర్తిగా కుప్పకూలుతుంది’, ‘ఉచిత పథకాలతో సంస్థ దివాళా తీస్తుంది’, ‘ప్రభుత్వం ప్రజాదరణ కోసం ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతోంది’ అంటూ అనేక విమర్శలు వచ్చాయి. మహాలక్ష్మి పథకం వల్ల లక్షలాది మహిళలు మరింత ఎక్కువగా బస్సులను వినియోగించడం ప్రారంభించారు. గ్రామీణ మహిళలు, విద్యార్థినులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగినులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతిరోజూ ధైర్యంగా ప్రయాణిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్య బస్సుల ఆక్యుపెన్సీని సుమారు 67శాతం నుంచి 98శాతానికి తీసుకెళ్లింది. ఒకప్పుడు ఖాళీగా తిరిగిన అనేక సర్వీసులు నేడు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి తిరిగి ఆర్థిక కార్యకలాపాలను పెంచింది. ఇది సంక్షేమం కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఇది ఖర్చు కాదు... పెట్టుబడి.
మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో రీయింబర్స్‌మెంట్ అందించింది. ఈ నిర్ణయం వల్ల సంస్థలో నగదు ప్రవాహం మెరుగుపడింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం, మరోవైపు సంస్థకు ఆర్థిక భద్రత. ఇదే తెలంగాణ మోడల్ ప్రత్యేకత. దేశంలో అనేక రాష్ట్రాల్లో సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సంఘర్షణ కనిపిస్తుంటే, తెలంగాణ మాత్రం రెండింటినీ సమన్వయం చేసి చూపించింది. ఈ విజయాన్ని కేవలం మహాలక్ష్మి పథకానికే పరిమితం చేయడం సరైంది కాదు.
టీజీఎస్ఆర్టీసీలో ఒకేసారి అనేక సంస్కరణలు అమలయ్యాయి. వ్యయ నియంత్రణ, డిజిటల్ టికెటింగ్ విస్తరణ, అద్దె బస్సుల సమర్థ వినియోగం, మార్గాల శాస్త్రీయ పునర్వ్యవస్థీకరణ, టోల్, సేఫ్టీ సెస్ రౌండ్- ఆఫ్ వంటి ఆదాయ వనరుల పెంపు, ఇంధన వినియోగంలో క్రమశిక్షణ, ప్రతి డిపోలో పనితీరు సమీక్ష– ఇవి అన్నీ కలిసి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేశాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో సంస్కరణలు అంటే ఉద్యోగులను తగ్గించడం కాదని, నిర్వహణను మెరుగుపరచడమే నిజమైన సంస్కరణ అని తెలంగాణ నిరూపించింది.
ఏ ప్రభుత్వ విధానం అయినా దాన్ని విజయవంతం చేసేది ఉద్యోగులే. క్లిష్టపరిస్థితుల్లోనూ సంస్థను నిలబెట్టిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, అధికారులు, కార్మిక సంఘాలు ఈ విజయానికి అసలైన భాగస్వాములు. ప్రజలకు చిరునవ్వుతో సేవలందించిన వారి కృషి లేకపోతే ఈ ఫలితం సాధ్యమయ్యేది కాదు. వారి శ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుంది. ఒక సంస్థకు ప్రభుత్వం మూలధనం ఇవ్వగలదు. కానీ ప్రజల విశ్వాసాన్ని కొనివ్వలేదు. టీజీఎస్ఆర్టీసీపై తెలంగాణ ప్రజలు చూపించిన నమ్మకం ఈ విజయానికి మరొక కారణం. ప్రైవేట్ వాహనాల కంటే ప్రజా రవాణాను ఎంచుకోవడం ద్వారా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపునకు, రోడ్డు భద్రతకు కూడా తోడ్పడ్డారు.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఒకే లక్ష్యంతో సాగుతోంది. అది ప్రజల జీవితాలను మెరుగుపరచడం. విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాలు... ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. టీజీఎస్ఆర్టీసీ విజయం కూడా అదే దృక్పథానికి ప్రతిబింబం.
ఈ విజయం అంతిమ గమ్యం కాదు. ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ, గ్రీన్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఆధునిక బస్ స్టేషన్లు, మహిళల భద్రత, డిజిటల్ సేవలు, ఉద్యోగుల సంక్షేమం– ఇవన్నీ రాబోయే సంవత్సరాల్లో టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి ప్రాధాన్యతలు. దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రజా రవాణా వ్యవస్థను నిర్మించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు నష్టాల వార్తలతో నిలిచిన టీజీఎస్ఆర్టీసీ, నేడు విజయగాథగా మారింది.
సంక్షేమం సక్రమమైన ఆర్థిక నిర్వహణతో కలిస్తే ప్రభుత్వరంగ సంస్థలు బలహీనపడవు... మరింత బలపడతాయి. ప్రజల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం, ప్రభుత్వ దూరదృష్టి ఒకే దిశగా సాగితే అసాధ్యం అనుకున్న లక్ష్యాలూ సుసాధ్యం అవుతాయి. టీజీఎస్ఆర్టీసీ చరిత్రలో నమోదైన ఈ మిగులు కేవలం ఆర్థిక లాభం కాదు. ఇది తెలంగాణ అభివృద్ధి తత్వానికి, సమర్థ పాలనకు, ప్రజలతో కలిసి నడిచే ప్రభుత్వానికి చిరస్థాయి గుర్తింపు.
పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
Also Read:
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్