Share News

సిఫారసులు అమలైతే చాలు కౌలు రైతు గట్టెక్కినట్టే!

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:26 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర సహాయాచార్యులుగా పనిచేస్తున్న నేను ఇటీవల నా విద్యార్థులతో కలిసి ఒక ప్రాజెక్టు పనిలో భాగంగా, చేవెళ్ళకు మూడు కిలోమీటర్ల దూరంలో...

సిఫారసులు అమలైతే చాలు కౌలు రైతు గట్టెక్కినట్టే!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర సహాయాచార్యులుగా పనిచేస్తున్న నేను ఇటీవల నా విద్యార్థులతో కలిసి ఒక ప్రాజెక్టు పనిలో భాగంగా, చేవెళ్ళకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుని ఎర్రవల్లి గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయగా రాష్ట్రంలోని రైతులు, ప్రత్యేకించి కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గమనించాం. వారిలో భూమి కలిగిన రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన తరువాత చాలా రోజులకు (కొన్నిసార్లు మూడు నెలల తరువాత) డబ్బులు తమ ఖాతాలో పడుతున్నాయని, అంతేగాక ఒకవేళ రైతు పంట రుణం తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని తగ్గించి మిగిలిన డబ్బును ఖాతాలో వేస్తున్నారని తెలిసింది. పంట కోతల తరువాత వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని రైతులు తెలిపారు. ఉదాహరణకు ప్రస్తుతం కంది పంటను కోశారు కానీ ఇంకా కందుల కొనుగోలు కేంద్రం చేవెళ్ళ వ్యవసాయ మార్కెట్‌లో మొదలు కాలేదు. అందువలన రైతులు కమీషన్ ఏజంట్లకు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (క్వింటాలుకు రూ.8000) కంటే తక్కువ ధరకు (క్వింటాలుకు రూ.6000–6500కు) అమ్ముకుంటున్నారు. ‘రైతు భరోసా’ అందని కారణంగా వ్యాపారుల దగ్గర విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అరువు తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ఆ వ్యాపారులకే ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారు.

రైతులు–కౌలు రైతులకు ఎకరానికి రూ.15–16 వేలు ప్రతి సంవత్సరం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. కానీ ఇప్పటివరకు కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. అంతేగాక వారికి పంట రుణాలు కూడా ఇవ్వడం లేదు. దేవుని ఎర్రవల్లిలో లాగానే రాష్ట్రంలో దాదాపు 50శాతం వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరంతా పంట పెట్టుబడికి భూస్వాములు, కమీషన్ ఏజెంట్లు, బంధువులు, స్నేహితులపై ఆధారపడుతున్నారు. సంస్థాపరం కాని ఇలాంటి వ్యవస్థలపై ఆధారపడటం వల్ల వడ్డీ దోపిడీ ఎక్కువగానే ఉంటోంది. మరొక ముఖ్యమైన, అతి బాధాకరమైన విషయం ఏమిటంటే కౌలు రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నేరుగా అమ్ముకునే అవకాశం లేకపోవటం. వీరు అలా అమ్మాలంటే భూమి యజమాని తన పట్టా పాస్‌బుక్‌తో హాజరు కావాలి. ఇది చాలా క్రూరమైన నిబంధన. భూ యజమానులు అన్నిసార్లూ అందుబాటులో ఉండరు (కొందరు విదేశాలలో కూడా ఉన్నారు). ఉన్నా కొన్నిసార్లు రారు. ఫలితంగా కౌలు రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు ఇతరులకు అమ్ముకుంటున్నారు.


భూ సంస్కరణలలో భాగంగా పశ్చిమబెంగాల్, త్రిపుర, జమ్మూ కశ్మీర్ మొదలైన రాష్ట్రాలలోని కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, ఇప్పుడు తెలంగాణలోను ఆ ప్రయత్నం జరగడంలేదు. 2011లో లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్ యాక్ట్ ద్వారా రుణ అర్హత కార్డులు (LECs) ఇచ్చే ప్రయత్నం ప్రారంభమైనా దాని అమలు కూడా చిత్తశుద్ధితో జరగడం లేదు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. కానీ ఇప్పటివరకు కౌలు రైతులకు ఈ ఆర్థిక సహాయం అందలేదు. పంటల బీమా, రైతు బీమాతో పాటు కేంద్రం అమలుపరుస్తున్న పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక ఎకరానికి ప్రతి ఏటా ఇచ్చే రూ.6000లు కౌలు రైతులకు ఇవ్వడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పంటల పెట్టుబడి బీమా), ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (నీటి పారుదల సౌకర్యాల కోసం ఆర్థిక సహాయం), వ్యవసాయ అవస్థాపన నిధి (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) పథకాలకు కౌలు రైతులు అర్హులు కాదు. కిసాన్ క్రెడిట్ కార్డులు వీరికి ఇవ్వరు. వ్యవసాయ పదార్థాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రైతులకు సూక్ష్మ సంస్థల ఏర్పాట్ల కోసం 35శాతం సబ్సిడీతో గరి‌ష్ఠంగా ఇచ్చే రూ.10లక్షల ఆర్థిక సహాయం వీరికి అందడం లేదు. తోట పంటల (హార్టీ కల్చర్) పెంపకం కోసం అందించే ఆర్థిక సహాయానికి వీరు అర్హులు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుల కోసం అమలు జరుగుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి నేటి వరకు కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి అనేక కమిటీలు తమ సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాయి. అందులో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ‍స్థాయి కమిటీల దాకా ఉన్నాయి. దాదాపు అన్ని కమిటీలలో ప్రముఖంగా ఉన్న సాధారణ సిఫారసులు: 1) కౌలు రైతులకు చట్టబద్ధ గుర్తింపు తప్పనిసరి. 2) రాతపూర్వక లీజు ఒప్పందాలు. 3) పంట బీమా, విపత్తు పరిహారం, సబ్సిడీలలో నేరుగా చేర్చడం. 4) బ్యాంకు రుణాలకు ప్రత్యామ్నాయ భద్రత ఏర్పాట్లు. 5) కౌలు రైతులు మద్దతు ధర పొందేలా మార్కెటింగ్ సదుపాయాలు. 6) గ్రామ స్థాయి రికార్డుల్లో కౌలు వివరాలు నమోదు చేయడం.

ఈ కమిటీల నివేదికలు పరిశీలించినప్పుడు అవి కౌలు రైతుల సమస్యలను అందరికీ తెలియజేయడమే కాదు, ఆ సమస్యల పరిష్కారం కోసం బుద్ధిజీవులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు కూడా చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. వాటి అమలుకు ప్రభుత్వాలు పూనుకుంటే కౌలు రైతుల సమస్యల పరిష్కారం అసాధ్యం కాదని కూడా అనిపిస్తుంది.

డా. ఎం.ఏ.మాలిక్

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 12:26 AM