Share News

కల

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:05 AM

కలకూ మెలుకువకూ మధ్య ఏరు సాగుతుంది నిజానికి నిద్రలోనే ఏటి చప్పుడు వినిపిస్తుంది మెలుకువ మీద కోపమో శాపనార్థాలో...

కల

కలకూ మెలుకువకూ మధ్య

ఏరు సాగుతుంది

నిజానికి నిద్రలోనే ఏటి చప్పుడు వినిపిస్తుంది

మెలుకువ మీద

కోపమో శాపనార్థాలో తెలువదు కానీ

తీరా తీరం దాటుతుంటే ముంచేస్తుంది

కొన్నిసార్లు విహరించే ఎదను

మెలుకువ ఎడబాపుతుంది

కలల కోసం ఎక్కడికి పారిపోయినా

ఇంట్లోనే మెలుకువ వస్తుంది

ఒక కల విహరించమంటే

ఒక కలేమో భయపెట్టిస్తుంది

ఒకటి పువ్వుల కల

రెండోది చారల కల

మెలుకువని తిట్టుకోవాలో

మెచ్చుకోవాలో కలలే చెప్పాలి

ఒక్కొక్కసారి

పైనుంచి కింద పడబోతుంటే

ఎవరో తరుముతుంటే

పులి మింగబోతుంటే

పాము కాటెయ్యబోతుంటే

చీకట్లో తప్పిపోతుంటే

తెలువని గుంపు ఏదో మీద పడుతుంటే

ఏదో ఉప్పెన ముంచెయ్యబోతుంటే

కలని పక్కకు నెట్టేసి

మెలుకువనే కాపాడేది

ఒక్కొక్కసారి కల తలా తోకా లేకుండా

నిద్ర అంతా తిరుగుతుంది

ఆకృతి లేని కల ఇచ్చిన ఓ బహుమతి

గుర్తుకు రాక....

తెల్లవార్లూ జ్ఞాపకం మీద దాడి చేసిన

కల క్షణంలో భూమండలమంతా తిప్పుతుంది

కలకు మించిన వాహనమే లేదు

ముక్కూమొహం తెలువని వాళ్లని

నా దగ్గర వదిలేసిపోతుంది

వాళ్ల భాష తెలవదు దేశం తెలవదు

కల నిజంగా మెలుకువనే

చీకటి ఉంటుంది వెన్నెలా ఉంటుంది

అచ్చంగా నాలాగే ఉంటుంది

కల ఓ తీయ నొప్పుల పుండు

పొద్దంతా పనికి...

రాత్రి ఇచ్చిన ఇనాం కల

నేను అడుగుదామనుకున్న అన్నిటినీ

రూపకాలుగా కడుతుంది కల

అధ్యక్షా! మీరు నా ప్రశ్నల్ని దాటేస్తున్నారు

అందరూ నా దిక్కు నిర్ఘాంతపోయి చూస్తున్నారు

చట్టసభ ఏదో తెలియదు

అడగవలసినవన్నీ అడిగాను

అందరూ చప్పట్లు కొడుతుంటే

కల నన్ను ప్రతినిధిగా ఎన్నుకుంది ఈ రాత్రి

ఒకటేమిటి, అన్నిట్లోకీ నన్ను లాగుతుంది

కల కలిమిలోకి లాగుతుంటే

మెలుకువ లేమిలోకి గుంజుతుంది

నిజంగా కలే కదా నాకు కలిమి

కలలో నేను వెలుగుతూ ఉంటే

మెలుకువే ఆర్పింది

కాలం దాటిపోయినోళ్ళకు

కలే కదా ప్రాణం పోసేది

ఉష్క దొంతుల కూర

అమ్మ వడ్డిస్తుంటే

ఊరబిష్క కలను పొడుస్తుంది

మెలుకువ వచ్చినా

అమ్మ కళ్ళల్లోనే ఉండిపోయింది

దరి మీద కలలకు

తేడాల దరువు

కనురెప్పల కింద

కల ఓ మాయలోకం

పాత గుడి చుట్టూ ప్రాణం తిరిగొచ్చింది

వేకువ అంతా ఎక్కడ ఉంటుందో గానీ

మెలుకువలో ఎగిరిపోయి

రాత్రి నిద్రలో వాలే కలల పిట్ట

కలల వెనుక నుంచి

సంగీతం వినిపిస్తుంది


అది ఎక్కడా విన్నది కాదు

కలలే కదా నా తలలోంచి

అలిగేల్లి ఎదురెక్కేది

కలలే కదా నా అంతరంగాన్ని

ఆలింగనం చేసుకునేది

ఎప్పుడు నిద్రలోకి ద్రవిస్తుందో కానీ

మిలమిల మెరిసిపోతూ కల

ఎవరూ ఖరీదు కట్టలేని

నీలం రాయిలా ఘనీభవించింది

మునాసు వెంకట్

99481 58163

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 02:05 AM