Share News

ఊహించని వర్గాల చెంతకు చేర్చింది!

ABN , Publish Date - May 04 , 2026 | 12:33 AM

అది 1991 మే 31 లేదా జూన్‌ ఒకట్రెండు తారీఖుల్లో ఓరోజు.. ఓ పోస్టుకార్డు వచ్చి నా చేతిలో వాలింది. అందులో ఉన్న గుప్పెడు అక్షరాల వెంట పరుగుతీసిన నాచూపులో ఒకింత ఆనందం, మరొకింత ఆశ్చర్యం....

ఊహించని వర్గాల  చెంతకు చేర్చింది!

అది 1991 మే 31 లేదా జూన్‌ ఒకట్రెండు తారీఖుల్లో ఓరోజు.. ఓ పోస్టుకార్డు వచ్చి నా చేతిలో వాలింది. అందులో ఉన్న గుప్పెడు అక్షరాల వెంట పరుగుతీసిన నాచూపులో ఒకింత ఆనందం, మరొకింత ఆశ్చర్యం. ఎత్తైన జైలుగోడలు దాటుకుని ఆ చిన్ని తోకలేని పిట్ట ఎగురుకుంటూ రావడం, దాన్ని సర్కారువారు తీవ్రవాదవర్గంగా ముద్రవేసిన గ్రూపుకు చెందిన ఓ వ్యక్తి పంపించడం, జైలు అధికారులేమో బుద్ధిమంతుల్లా దాన్ని అనుమతించడం అసలు ఊహించే విషయమా! ఆ పోస్టుకార్డు రాసిన వ్యక్తి భూపాల్‌రెడ్డి. ‘సీపీఐ(ఎంఎల్‌) రెడ్‌ఫ్లాగ్‌’ పార్టీకి చెందిన రాజకీయఖైదీలమంటూ కొందరి తరపున తనను తాను పరిచయం చేసుకుని నా పుస్తకం పంపమని కోరాడు. అతడిచ్చిన ముషీరాబాద్‌ జైలు అడ్రస్‌కు నా పుస్తకం పంపించాను. మొదటి ఉత్తరం వచ్చిన మూణ్ణెల్లకు భూపాల్‌రెడ్డి మరో కార్డు రాస్తూ, ‘కవితాసంకలనం పంపించమని మీకు గతంలో లేఖ రాసినా పంపించలేదు. అసలు మేం రాసిన ఉత్తరం అందిందా లేదా?’ అని వాకబు చేస్తూ, మరోసారి తమ ఆర్థికపరిస్థితి తెలియజేస్తూ, పుస్తకాన్ని తప్పక పంపమని కోరాడు. అంటే, రెడ్‌ఫ్లాగ్‌వాళ్ల ఉత్తరాన్ని జైలుగోడలు దాటించి పంపిన అధికారులు, నా పుస్తకాన్ని మాత్రం ఆ గోడల లోపలికి చేరనివ్వలేదన్నమాట. నా మొదటి కవితాసంపుటి ‘బహుముఖం’ ఎన్నడూ చెరిగిపోనంతగా వేసిన మనోముద్ర– ఈ ఘటన

1975 నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టినా, 1980 వరకూ అడపాదడపా చిటికెడు కవితలు అచ్చయినా, ఆ తర్వాత ఎందుకో విరామం వచ్చేసింది. ఆపై మనసెందుకో కథలవైపు మళ్లింది. 1986లో ‘ఉదయం’ దినపత్రికలో చేరాక మళ్లీ కవిత్వం మోజు విరిసింది. కథలతో సమాంతరంగా వాటి జోరు కూడా హెచ్చింది. ఆరోజుల్లో పల్లకి వారపత్రికలో ‘భాస్వరం’ పేరిట రాజకీయ మినీకవితా శీర్షికను నిర్వహించిన అలిశెట్టి ప్రభాకర్‌ ఎందుకో హఠాత్తుగా తప్పుకున్నాడు. ఆ పత్రిక ఎడిటర్‌ విక్రమ్‌ అడగడంతో నేనా శీర్షికను కొన్ని వారాలపాటు కొనసాగించాను. మరోవైపు ఉదయం సహా ఇతర పత్రికల్లో పెద్దకవితలు కొన్ని అచ్చయ్యాయి. వాటి సంఖ్య రెండుమూడు గుప్పిళ్లు దాటాక– ఎప్పుడు మొదలైందో గానీ– పుస్తకం వేయాలనే కోరిక తలెత్తి, మొలక నుంచి మానై దిగబడింది. కంపోజింగ్‌, ప్రూఫ్‌రీడింగ్‌ కానిచ్చేసి, ప్రతిని తీసుకెళ్లి కె. శివారెడ్డి చేతిలో పెట్టి ‘మీరు పీఠికేశ్వరులు కావాల్సిందే’నని వినతులు పోయాను. ఆయనో చిర్నవ్వు విసిరేసి అభయమిచ్చినా, ఘంటాన్ని మాత్రం ఓ పట్టాన పదును తీర్చలేదు. అయినా ఓపిగ్గా వెంటపడి ఓ ఏడెనిమిది నెల్ల తర్వాత ఆయన్నుంచి ముందుమాటను ఒడుసుకున్నాను. నా అక్షరాన్ని నిమురుతున్నట్లు కన్పిస్తూనే తన భావనల్లో నన్నాయన నిర్మొహమాటంగానే కుదేశారు.


ఆయనే నా మొదటి కవితాసంపుటికి నామకరణధారి కూడా. టైటిల్‌ ఏం పెట్టాలో తోచకపోతే ఆయన పెట్టిన పేరే ఈ ‘బహుముఖం.’ ఇక కవర్‌పేజీ యాగంలో యాగకర్త ఎవరా అనే మథనంలో పడి– వాసిరెడ్డి నవీన్‌, శివారెడ్డి సూచనతో– శీలావీర్రాజు గారిని సంప్రదించాను. ఆయన వెంటనే చక్కటి ముఖచిత్రం వేసిచ్చారు. అంతేనా, ఎంతో పెద్దమనసుతో, తన పుస్తకాల్ని ప్రింట్‌ చేసే ప్రెస్సుకు నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లడమే కాదు, నా పుస్తకం వచ్చేవరకూ ప్రతి దశలోనూ తోడుగా నిలిచారు.

నా ‘బహుముఖం’ కవితాసంపుటిని లోకం ముందు నిలిపింది 1991లో. దాని గురించి నాలుగు ముక్కలు పరిచయం చేయడానికి నేనెన్నుకున్నది చేకూరి రామారావు (చేరా), కేతు విశ్వనాథరెడ్డి, కె. శివారెడ్డి. చేరా ఆ మరుసటి వారమే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో తన కాలమ్‌లో బహుముఖం గురించిన పరిచయాన్ని పరిచారు. అందులో ఆయన ప్రత్యేకంగా నా ‘ఎన్‌కౌంటర్‌’ కవితలోని శిల్పాన్ని ప్రశంసించారు. బహుశా ఈ వ్యాసం చదివే రెడ్‌ఫ్లాగ్‌ వాళ్లు నా పుస్తకం కోసం లేఖ రాసి ఉంటారు. ‘వజ్రాయుధం’ వీరుడు సోమసుందర్‌ బహుముఖంపై ఆంధ్రభూమిలో ఓ నిండు పేజీ వ్యాసమే రాశారు. సి. నారాయణరెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఇస్మాయిల్‌, కె. రామ్మోహన్‌రాయ్‌, పాపినేని శివశంకర్‌, అత్తలూరి నరసింహారావు, చందు సుబ్బారావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, శిఖామణి సహా నాటి సీనియర్‌, జూనియర్‌ కవులు పలువురు ఈ సంపుటిపై స్పందించారు. ఈ కవితాసంపుటిలోని తొలికవిత ‘స్వప్నాల్ని ఉరితీయలేవు’ను తెలుగు విశ్వవిద్యాలయం ఓపెన్‌ డిగ్రీ కోర్సులో ఓ ఏడాది పాఠ్యాంశంగా చేర్చింది.

బహుముఖంతో ముడిపడిన మరో మన్మోహనం.. కరీంనగర్‌కు చెందిన ‘గోదావరి సాహితీ సాంస్కృతిక సమాఖ్య’ డా. సి. నారాయణరెడ్డి పేరిట ఇచ్చే ‘సినారెపురస్కారా’న్ని నాకు కైదండ చేయడం. తొలి కవితాసంపుటికే ఈ పురస్కారం అందుకోవడమే కాదు, దాన్ని పొందిన నాలుగోవ్యక్తిని నేను. ఆనాటి కవితావరణంలో నా అడుగుల్ని ఒకింత ముద్రించడమేకాదు, మరొక్కింతగా కవిత్వాన్ని తలకెత్తుకునే ఓ చారెడుమందికి నన్ను చేరవేసింది బహుముఖమే; నేను మరింతగా ప్రవహించడం రూపుకట్టిందీ దాన్నుంచే.

99854 11099

ఇవి కూడా చదవండి..

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ

Updated Date - May 04 , 2026 | 12:33 AM