కొన్నిసార్లూ... చాలాసార్లూ,
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:38 AM
ఎక్కడో పులి పొంచి ఉండి ఊర్కే చూస్తున్నట్టు వీణతంత్రి చిట్లి శబ్దరజనును విస్ఫోటిస్తున్నట్టు అవి చీకట్లో దాగుడుమూతలు కావచ్చు...
ఎక్కడో పులి పొంచి ఉండి ఊర్కే చూస్తున్నట్టు
వీణతంత్రి చిట్లి శబ్దరజనును విస్ఫోటిస్తున్నట్టు
అవి
చీకట్లో దాగుడుమూతలు కావచ్చు
గాఢ రజోకాంతి అతిప్రతిఫలనలు కావచ్చు
లేక
ఆ నలుపు దేవత కృష్ణవర్ణోషస్సు కావచ్చు,
అన్నీ.. పడుగు పేక దారాల్లా
ఉన్నట్టుండి ఆలోచనలు చిక్కులు పడ్తూంటాయి
చైతన్య అస్రవంతి గడ్డకడ్తూ గడ్డకడ్తూ
నడక ఒక సరళహరాత్మక గమనం-
నా గురించి నీకు తెలియాలంటే
నువ్వు నా ప్రపంచపు లోలోతుల్లోకి
ఏ పాతాళగరిగెకూ దొరక్కుండా పయనించీ పయనించీ
చేరుకోవాలె
అప్పుడు అసలు నువ్వూ నేనూ వేర్వేరు కామని తేలిపోతుంది-
ఏ నియమమూలేని అనియమ సిద్ధాంతం ప్రకారం
అరాచకత్వం కాని రాచకత్వపు ఒక అంతఃజ్వాల
వెలుగుతూ వెలుగుతూ
ఒక స్తబ్ధించే అఖండ నృత్యహేల ఐ
పాదాలు విశ్రమించవు
గాజుముక్కలపై తకథిమి తకథిమి
అన్నీ తడి ఆరని రక్తపాదముద్రలే-
నీకు తెలుసా
చివరికి ఎక్కడా ఏమీలేదని తెలుస్తున్నపుడు
కొన్నిసార్లు గెలుస్తూ, చాలాసార్లు ఓడిపోతూ జీవించడానికి
భయమెందుకూ..? సిగ్గెందుకూ..!
రామా చంద్రమౌళి
9390109993
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి