తెలుగు మీడియం కొనసాగించాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:16 AM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కొనసాగించాలి. 1968లో తెలుగు అకాడమీ స్థాపించిన నాటి నుంచి 2010 వరకు తెలుగు మాధ్యమంలో...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కొనసాగించాలి. 1968లో తెలుగు అకాడమీ స్థాపించిన నాటి నుంచి 2010 వరకు తెలుగు మాధ్యమంలో కె.జి నుంచి పి.జి వరకు తెలుగు భాష వెలుగొందింది. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. తరువాత వచ్చిన ఆర్థిక సరళీకృత విధానంతో పాటు విద్యను ప్రైవేటీకరించడంతో విద్య వ్యాపార వస్తువై ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్ళింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజల ఆంగ్ల మాధ్యమ మోజుతో తెలుగు మాధ్యమ ప్రస్తావన మరుగునపడింది. తెలుగు భాష ఈ రోజు కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలో సుమారు 16 కోట్ల జనాభా ఉన్నా, తెలుగు మాధ్యమం లేకపోవడం శోచనీయం.
మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక వికాసం పొందుతారని మనోవికాస శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రష్యా, జర్మనీ, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలు తమ మాతృభాషలోనే అన్ని శాస్త్రాల విజ్ఞానం అందిస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు, వైద్య రంగంలో ఉపాధి పొంది విదేశాలకు వెళ్ళవచ్చుననే తల్లిదండ్రుల దురాశకు ప్రభుత్వాల నిర్లక్ష్యం తోడై తెలుగు భాష స్వంత రాష్ట్రాల్లోనే కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది. పై రంగాలకు వెళ్ళవలసిన వారి శాతం రెండుకు మించి ఉండదు. సాఫ్ట్‌వేర్ రంగమే కాకుండా ఇతర పారిశ్రామిక, సేవా రంగాలలో అనేక అవకాశాలున్నాయి. వారందరికీ ఆంగ్లమాధ్యమంలో చదవాల్సిన పనిలేదు. ఆంగ్లభాషను ఒక సబ్జెక్టుగా ఉంచితే సరిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. రెండు శాతం ఉద్యోగాల కోసం మిగతా అందరినీ ఆంగ్ల మాధ్యమంలో చదవాలని చెప్పడం పౌరుల ప్రాథమిక హక్కులను హరించడమే!
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఎన్నడూ లేనన్ని కవి సమ్మేళనాలు, తెలుగు భాషా ఉత్సవాలు, పుస్తకావిష్కరణలు జరగడం సంతోషించదగ్గ విషయం. అయితే తెలుగు చదవడం, రాయడం రాని పిల్లలు ఈ సాహిత్యాన్ని చదివే స్థాయిలో ఉన్నారా? కాబట్టి పై విషయాలను కూలంకషంగా ఆలోచించి ప్రభుత్వాలు మాతృభాషలో విద్యను బోధించేందుకు మార్గం సుగమం చేయాలి. కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, సాంస్కృతిక కళారంగాలు, సినిమా, రాజకీయ రంగాల వారు తెలుగు భాషను బ్రతికించుకోవడానికి మార్గాలు అన్వేషించాలి. పరిపాలనలోను, న్యాయవ్యవస్థలోను, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడానికి చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రథమ భాష సంస్కృతంతో పాటు, తెలుగును కూడా ఐచ్ఛిక భాషగా గుర్తించాలి. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన తెలుగు మీడియం సెక్షన్లను పునరుద్ధరించాలి. మాతృభాషలో ప్రావీణ్యం సంపాదిస్తేనే మిగతా భాషలలో విద్యార్థి ప్రావీణ్యత సంపాదించగలడని తల్లిదండ్రులు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి.
బద్రి కూర్మారావు
వ్యవస్థాపక అధ్యక్షులు,
గిడుగు రామమూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం
Also Read:
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్