అసలు ఊహించామా ఇంతమంది పాఠకులను!
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:13 AM
2022 వరకూ తెలుగు సాహిత్య స్థితిగతులు బయట ప్రపంచం దృష్టిలో పెద్ద చడీచప్పుడు లేకుండా ఉండేవి. ఉన్న కొద్దిమంది రచయితలో వారిలో వారు సాహిత్యాన్ని గురించి, రచనలను...
2022 వరకూ తెలుగు సాహిత్య స్థితిగతులు బయట ప్రపంచం దృష్టిలో పెద్ద చడీచప్పుడు లేకుండా ఉండేవి. ఉన్న కొద్దిమంది రచయితలో వారిలో వారు సాహిత్యాన్ని గురించి, రచనలను గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఒకరు రాసింది ఇంకొకరు చదవరనీ, సాహిత్యం పట్ల యువతలో ఆసక్తి సన్నగిల్లిపోతోందనీ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ పరిస్థితిని మార్చడానికి తోచిన పద్ధతిలో కొంతమంది సాహిత్యవేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రయత్నాలు చేస్తూండేవి. నవలల పోటీలు నిర్వహించడం, ఉత్తమ కథలను ఎంపిక చేసి సంచికలు తీసుకురావడం వగైరా ప్రయత్నాలు అందులో భాగంగా ఉండేవి. కానీ, ఇవేమీ ఆ కాస్త సాహిత్యలోకాన్నీ దాటుకుని పుస్తకాలు ముట్టుకోని జనాలపై ప్రభావం చూపించేవి కాదు. ఎవరైనా పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపించినా ఇళ్ళలో పెద్దవాళ్ళ నుంచి కాలేజీ లెక్చరర్ల వరకూ ప్రతీవారూ ఇంగ్లీష్ పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే కనీసం ఇంగ్లీష్ అయినా నేర్చుకోవచ్చు అని ఉచిత సలహాలు వచ్చేవి. ఇక క్రమేపీ డిజిటల్ కంటెంట్, అందులోనూ రీల్స్, షార్ట్స్ వంటివి ప్రాచుర్యం చెందుతూ ఉండడంతో అసలంటూ పుస్తకాలకే చోటు తగ్గిపోతున్న ప్రపంచంలో తెలుగు పుస్తకాలకు కాలం చెల్లిపోయినట్టే అందరూ భావించారు. మొత్తంగా, ఒక పుస్తకం 2000 నుంచి 4000 వేల కాపీలు విడుదలైన కొద్ది సంవత్సరాల్లో అమ్మగలిగితే అప్పట్లో గొప్ప విజయం సాధించినట్టే. బహుశా, కొద్ది మినహాయింపులు తప్ప పలు భారతీయ భాషల సాహిత్యవేత్తలు, పాఠకులు ఈ పరిస్థితిని రిలేట్ చేసుకోగలరు అనుకుంటాను.
అయితే, 2024–25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2023 వరకూ తెలుగులో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల కేటగిరీలో కొన్ని వేల కాపీలు అమ్ముడైన పుస్తకాలూ, ఆంగ్ల బెస్ట్ సెల్లర్ల తాలూకు అనువాదాలూ, కొన్ని దశాబ్దాల క్రితం నాటి క్లాసిక్స్ వంటివి ఉండడం పరిపాటి కాగా ఈ స్థితి 2024 నాటికి మారిపోయింది. ఐర్లాండ్‌లో స్థిరపడ్డ ఎన్నారై రవి మంత్రి రాసిన ఒక కొత్త ప్రేమకథాత్మక నవల – ‘అమ్మడైరీలో కొన్ని పేజీలు’ 2024 సంవత్సరంలోనే కొన్ని నెలల వ్యవధిలో వేగం పుంజుకుని లక్ష కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించింది. ఈ నవల ఇదే వేగాన్ని 2025లోనూ కొనసాగిస్తూ లక్షా డెబ్భై అయిదువేల కాపీలు అమ్ముడైంది. పైగా పుస్తకాలు పట్టుకోరన్న అభిప్రాయం ఉన్న యువతలోకి ఈ నవల చొచ్చుకుపోవడం చాలామంది సాహిత్యపరులకు ఆశ్చర్యకరంగా తోచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నవల చదువుతున్నట్టు వీడియోలు చేయటం, చదివి రివ్యూలు పోస్ట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇన్ని పుస్తకాలు నిజంగా అమ్ముడు కావట్లేదని, ఇదంతా కేవలం మార్కెటింగ్ గిమ్మిక్ కావచ్చని ఈ పరిణామాన్ని చూసి సందేహపరులు అనుమానించారు. అయితే, జాతీయ స్థాయిలో అమెజాన్ ట్రెండ్స్‌లో యువల్ నోవా హరారీ, సుధామూర్తి, అరుంధతీ రాయ్ వంటివారి రచనలను, ‘సైకాలజీ ఆఫ్ మనీ’, ‘అటామిక్ హాబిట్స్’ లాంటి పుస్తకాలను దాటుకుని నెంబర్ 1 సెల్లర్‌గా నెలల పాటు నిలబడుతూ ఉండడమూ, చివరకు 2014లో అమెజాన్ ఇండియా ప్రకటించిన టాప్ 10 పుస్తకాల్లో రెండోస్థానంలో నిలవడమూ ఈ సందేహాలను పటాపంచలు చేశాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్, విజయవాడ బుక్ ఫెయిర్ వంటిచోట్ల కూడా ఈ పుస్తకాన్ని జనం కొనడమూ, రచయిత భారతదేశానికి తిరిగివచ్చినప్పుడు హైదరాబాద్‌లో జరిగిన వివిధ ‘మీట్ ద ఆథర్’ కార్యక్రమాలకు భారీ స్పందన రావడమూ వంటివి కూడా ఈ కొత్త పరిణామాన్ని కళ్ళకు కట్టాయి.
రవి మంత్రి 2024లోనే ఆన్‌లైన్‌లో కాంటెంట్ క్రియేటర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా విజయవంతం అవుతూ ఉండడంతో ఇదంతా కేవలం ప్రచారార్భాటం వల్ల జరిగిన ఒక వన్ ఆఫ్ పరిణామం అని తెలుగు సాహిత్యాన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న చాలామంది కొట్టిపారేశారు. అయితే, యువ సాహిత్యకారులు కడలి సత్యనారాయణ రాసిన ‘చిక్ లిట్’, మహమ్మద్ గౌస్ రాసిన ‘826 కిమీ’, ప్రసాద్ రామతోట రాసిన ‘90స్ లవ్‌స్టోరీ’, శ్రీనివాస్ కాశెట్టి రాసిన ‘అయోధ్య చేరిన కృష్ణ’... ఇవన్నీ కొన్ని నెలల వ్యవధిలోనే పదుల వేల కాపీలు దాటాయి. ‘అమ్మడైరీలో కొన్ని పేజీలు’ పుస్తకం లక్షన్నర కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించడానికి ముందే వి. మల్లికార్జున్ ‘ఇరానీ కేఫ్’, సీతారామరాజు ‘రామగ్రామ నుంచి రావణలంకకు’ వంటి పుస్తకాలు కొద్ది నెలల్లోనే పలు రీప్రింట్లతో కొత్త పాఠకులను సంపాదించాయి. దీన్ని బట్టి కూడా ఇదేమీ హఠాత్తుగా రాత్రికి రాత్రి వచ్చిన పరిణామం కాదని అర్థమవుతుంది. మరోవైపు, వివిధ పబ్లికేషన్లు, ఆడియో బుక్స్ యాప్‌లు వంటివి కూడా అభివృద్ధి చెందుతున్నాయి (అజు పబ్లికేషన్స్, అన్వీక్షికి పబ్లిషర్స్, ఛాయ బుక్స్, ఎలమి పబ్లికేషన్స్ వంటి పబ్లిషింగ్ సంస్థలు, దాసుభాషితం వంటి ఆడియో బుక్స్ యాప్‌లు ఇందుకు ఉదాహరణ.). ఇన్‌స్టాగ్రామ్‌లో పుస్తకాల గురించి చర్చించి, వాటిని ప్రమోట్ చేసే బుక్‌ఫ్లుయెన్సర్లు ఈ పరిణామంలో ఒక కీలకమైన తోడ్పాటును అందిస్తున్నారు (తెలుగు కలెక్టివ్, ఆరుద్ర ఈశ్వర్, విముక్త సుధ వంటివారు ఇందుకు ఉదాహరణ). మొత్తంగా, ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్ద సంస్థల మద్దతు, సినిమా ప్రముఖుల ప్రోత్సాహం... ఇవేమీ లేకుండా ఒక ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తోంది.
ఎందుకని ఈ పుస్తకాలు అమ్ముడవుతున్నాయి? ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు? ఎలాంటి పుస్తకాలు అమ్ముడవుతున్నాయి? వంటి విషయాలపై అనక్‌డోటల్ రిఫరెన్సులు మినహాయిస్తే పరిశోధనలు కానీ, స్టడీలు కానీ పెద్దగా జరిగినట్టు కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో చేసిన ప్రచారం వల్ల పుస్తకాలు అమ్ముకోగలుగుతున్నారని విమర్శనాత్మకంగా రాస్తున్నవారు కూడా పాఠకులు ఎందుకు కొంటున్నారో, ఈ పుస్తకాల్లో ఏం ఆకర్షిస్తోందో లోతుగా పరిశీలించిన దాఖలాలు లేవు. తెలుగు కలెక్టివ్ అన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీని స్థాపించి దాన్ని ఒక సాహిత్య, సాంస్కృతిక సముదాయంగా అభివృద్ధి చేస్తున్నవారిలో ఒకడైన ఆదిత్య అన్నావఝల ఈ విషయంపై మాట్లాడుతూ, ‘‘యంగ్‌స్టర్స్ వాళ్ళని వాళ్ళు చూసుకునేలాంటి రిలేటబుల్ కంటెంట్ ఉండడం, సులువుగా అర్థమయ్యే భాషలో రాయడం బాగా లాభిస్తోంది. సాహిత్యంలో సామాన్యంగా ఉండే వివిధ వాదాలకు ఈ రచనలు సామాన్యంగా దూరంగా ఉంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ కావడం, అమెజాన్ ప్లాట్‌ఫాంలో సజెషన్లు వంటివీ, పుస్తక ప్రచురణ విషయంలో ఇంతకుముందున్న బేరియర్స్ తగ్గిపోవడం ఈ మార్పు విషయంలో దోహదం చేసింది’’ అన్నాడు. 1990ల్లో ప్రారంభమైన ఇండస్ట్రియలైజ్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ మోడల్ వల్ల భాషకు, సాహిత్యానికి దూరమైపోయిన తరాలు తిరిగి వాటివైపు ఆకర్షితులవుతున్నాయా? షార్ట్ ఫామ్ కంటెంట్‌కి అడిక్ట్ అయ్యారనీ, భారతీయ భాషల పట్ల ఆసక్తి చూపట్లేదనీ అంతా భావించే యువత తిరిగి లాంగ్‌ఫామ్ కంటెంట్ వైపు వస్తున్నార నేందుకు, అందులోనూ భారతీయ భాషల పుస్తకాలపై ఆసక్తి చూపుతున్నారనేందుకు ఈ ట్రెండ్ తొలి సంకేతమా? ఈ కోణాల్లో మరింత లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంది. అయితే, అంతవరకూ ఈ పరిణామాన్ని ఆసక్తితో చూసి సంతోషించవచ్చు.
పవన్ సంతోష్ సూరంపూడి
96406 56411
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్