తొలి తెలంగాణా కవి పంపన
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:43 AM
రెండవ అరికేసరి ఆస్థానకవిగా, వేములవాడ ప్రాంతంలో జన్మించి కన్నడ ప్రాంతానికి వలస వెళ్ళి, పాండిత్యాన్ని సాధించి కన్నడ భాషకి సాహిత్య ప్రతిపత్తి ఇవ్వడానికి ఆదికవిగా రచనలు చేసిన తెలంగాణ కవి పంపన! అలాంటి...
రెండవ అరికేసరి ఆస్థానకవిగా, వేములవాడ ప్రాంతంలో జన్మించి కన్నడ ప్రాంతానికి వలస వెళ్ళి, పాండిత్యాన్ని సాధించి కన్నడ భాషకి సాహిత్య ప్రతిపత్తి ఇవ్వడానికి ఆదికవిగా రచనలు చేసిన తెలంగాణ కవి పంపన! అలాంటి పంపన రాసిన పద్యాలు తెలుగులో కూడా లభిస్తున్నప్పటికీ ఆయన రాసిన కావ్యాలు అలభ్యంగా ఉండటం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. శాలివాహన శకం 9వ శతాబ్దం లోనే తెలుగు భాషలో అత్యంత అద్భుతమైన పాండిత్యాన్ని గడించి దానికి కావ్యగౌరవం ఇచ్చే లాగా కావ్యాలెన్నో రాసి, గ్రంథస్థం చేసి, శాసనాలలో తన పాండితీ ప్రకర్షని ప్రదర్శించి బొమ్మలమ్మ గుట్ట, కురక్యాల శాసనంలోని తొలి తెలుగు కందపద్యాలలో తన రచన ‘‘విక్రమార్జున విజయం’’ గురించి ప్రస్తావన సాధించిన పంప మహాకవి తెలుగు సాహిత్యపు తొలి కవి అని చెప్పవచ్చు. ఆయన రాసిన ‘పంప భారతం’ 1100 ఏళ్ళ తర్వాత పూర్తి అర్థ తాత్పర్య సహితంగా దాదాపు 1700 పేజీలతో పూర్తి తెలుగు అనువాదంగా ఇటీవల శాంత వసంత ట్రస్ట్ వరప్రసాద్ రెడ్డి ప్రచురించారు. అక్షరయాన్ రచయిత్రుల వేదిక స్థాపకురాలు, కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి పూనికతో, భాషావేత్త డాక్టర్ జోస్యుల సదానంద శాస్త్రి ఇతర నిపుణులతో కలిసి దాదాపు నాలుగేళ్ళ పాటు శ్రమించి అనువదించగా, నాళేశ్వరం శంకరం, మామిడి హరికృష్ణ, పొన్నం రవిచంద్ర సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు పంపన, విక్రమార్జున విజయం గ్రంథ విశేషాలు మళ్ళీ చర్చకు వచ్చాయి.
మహాకవి పంపన వంశానికి సంబంధించిన చారిత్రక, శాసనపరమైన, గ్రంథ పరమైన ఆధారాలను అనుసరించి చూస్తే చాలా విషయాలు వెల్లడవుతాయి. మల్లియ రేచన రాసిన ‘కవిజనాశ్రయం’, పంపన రాసిన ‘ఆదిపురాణం’, ‘విక్రమార్జున విజయం’ కావ్యాలలో ప్రస్తావించిన పద్యాలను అనుసరించి పంపన వంశక్రమం గురించి ఈ విధంగా చెప్పవచ్చు:
యజ్ఞయాగాది క్రతువులలో నిపుణుడైన మాధవ సోమయాజి పంపన వంశానికి సంబంధించి మనకు లభిస్తున్న తొలి ప్రధాన వ్యక్తిగా గమనించవచ్చు. ఆయన కుమారుడు అభిమాన చంద్రుడు, ఆయన కుమారుడు కొమురయ్య వేదవేదాంగ పారంగతుడిగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి. ఆయన కుమారుడు ‘భీమపయ్య’. ఆయన సతీమణి ‘అబ్బణబ్బె’. వారి కుమారుడు పంపన.
ఈ విషయాలన్నీ జినవల్లభుడి ‘కురిక్యాల శాసనం’లో ప్రస్తావిస్తూ, మరొకవైపున ‘భీమ తనుజం సమ్యక్త్వ రత్నాకరం పంపర్యానుజుడు’ అని జినవల్లభుడి గురించి, జినవల్లభుడికి పంపనకి ఉన్న సోదరత్వాన్ని గురించి ఈ శాసనంలో ప్రస్తుతించడం జరిగింది. అలాగే ‘కవిజనాశ్రయం’లో భీమన/ భీమపయ్య ప్రసక్తి ఉంది. ‘‘ఆ భీమనాగ్రసుతుడే పంపన’’ అని పివీ పరబ్రహ్మశాస్త్రి లాంటి చరిత్రకారుడు కూడా తమ పరిశోధనలో నిర్ధారించారు.
ఈ విషయాలకి సంబంధించి ‘కవిజనాశ్రయం’లో ఒక చోట:
‘‘పరిగిన విమలయశోభా
సుర చరితుడు భీమనాగ్ర సుతుడఖిల కళా
పరిణతుడయ్యును భూసుర
వర ప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుడై’’ అని ప్రస్తావించారు. దీంట్లో ‘భీమనాగ్ర సుతుడు’ అంటే పంపన అని అర్థమవుతుంది.
కాగా పంపన పూర్వీకుల గురించిన విషయానికొస్తే వారు మొదట ‘వెంగిపళు’ అనే ప్రాంతం నుండి నేటి తెలంగాణ ప్రాంతం (అప్పట్లో సబ్బినాడు)కు వలస వచ్చారని తెలుస్తోంది.
అలాగే ‘ఆదిపురాణం’ ప్రథమాశ్వాసంలో 28, 29, 32 వ పద్యాలలో పంపన తనే స్వయంగా తన రూపు రేఖలు, గుణాల గురించి చెప్పుకోవడం విశేషం. ఈ పద్యాలలోని విషయాలను అనుసరించి పంపన శ్రీవత్స గోత్రీకుడని, దుందుభి నామ సంవత్సరంలో జన్మించాడని, వంకర తిరిగిన శిరోజాలతో, పద్మం లాంటి ముఖంతో సుందరంగా ఉండేవాడని చెప్పుకున్నాడు. ఈ దుందుభి నామ సంవత్సరం శాలివాహన శకం 902 తో సరిపోతుంది. కనుక ఈ ఆధారాలను అనుసరించి పంపన 902 వ సంవత్సరంలో జన్మించాడని నిర్ధారణ అవుతుంది.
అలాగే పంపన సోదరుడు గురించిన విషయాలు కూడా కురిక్యాల శాసనం ద్వారా వెల్లడవుతున్నాయి. జినవల్లభుడు ఆయన సోదరుడుగా కురిక్యాల శాసనంలోని కందపద్యం స్పష్టం చేస్తుండగా, ఆనాటి చాళుక్యరాజు అరికేసరి ప్రభువుకి అనుంగు సహచరుడిగా పంపన గురించి తెలుస్తోంది.
ఇక ఆనాటి కాలంలో సాధారణంగా కవులు, సాహితీవేత్తలు జైన మతావలంబకులుగా ఉంటే, ప్రభువులు వైదిక మతాన్ని ప్రోత్సహించిన వారిగా ఉండటం విశేషం. అలాగే కవి కాలాదులను నిర్ధారించడానికి ఆయా రాజులు, చక్రవర్తులు, వారి పరిపాలన కాలాన్ని తీసుకోవడం సాధారణంగా చరిత్రకారుల కొలమానంలో కనిపిస్తుంది. ఆ లెక్కన చక్రవర్తి అరికేసరి వంశ వివరాలను పరిశీలిస్తే, దానికి మూడు ఆధారాలు మనకు లభిస్తున్నాయి. అవి:
(1) ‘విక్రమార్జున విజయం’ లోని విషయాలు.
(2) వేములవాడ శాసనంలో నిక్షిప్తమైన అంశాలు.
(3) ఫరబణి తామ్ర శాసనంలో లిఖించిన అంశాలు.
వీటి ఆధారంగా చాళుక్య వంశంలో మొదటి రాజు, యుద్ధమల్ల అనీ, ఎనిమిదవ రాజు రెండవ అరికేసరి అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ లెక్కన రెండవ అరికేసరికి సమకాలికులుగా జినవల్లభుడు, ఆయన సోదరుడు పంపన ఉన్నారని కూడా వెల్లడి అవుతోంది.
మరొకవైపున పంపన జైన మతాన్ని స్వీకరించిన వ్యక్తిగా ఆధినాథుని కథతో ‘ఆదిపురాణం’ రాసాడని, చక్రవర్తి రెండవ అరికేసరితో తనకు ఉండే ఆత్మీయబంధానికి సాహిత్య రూపంగా ‘విక్రమార్జున విజయం’ కూడా రాసాడని తెలుస్తోంది.
పంపనకు, బోధన్‌కు ఉన్న అనుబంధం గొప్పది. ‘విక్రమార్జున విజయం’ లోని (3.22) తృతీయాశ్వాసం లోని అంశాలను గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆశ్వాసంలో పంపన ఏకచక్రపురం నగరాన్ని వర్ణిస్తాడు. ఆ వర్ణన లోని విశేషాలను బట్టి ఈ నగరానికి పూర్వం బహుధాన్య పురి, పోదన పురి, బోధన పురి, భక్తి పురం, చక్ర పురం అనే పేర్లు ఉండేవనీ మహాభారతంలోని ‘బకాసుర వధ’ ఘట్టం ఇక్కడే జరిగిందని ఈ రచన వల్ల తేటతెల్లమవుతోంది. కాగా ఈ నగరంలో పంపన చాలా కాలం నివాసం ఉన్నట్లు తృతీయాశ్వాసం లోని పద్యాలలో తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా తెలియజేస్తాడు.
పంపనకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. అందులో ఒక బిరుదు ‘కవిత గుణార్ణవ’. అయితే అప్పట్లో వ్యక్తులు బతికున్న, చనిపోయినవారి పేరిట దేవాలయాలను, చెరువులను నిర్మించే సంప్రదాయం ఉండేది. పోదన పురి లోని తామ్ర శాసనంలో పంపన గురించి, అక్కడ నిర్మించిన తటాకం గురించి ‘కవితా గుణార్ణవ తటాకం’ అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. అంటే పంపన మరణానంతరం పోదన పురిలో ఆయన పేరిట చెరువు నిర్మాణం జరిగిందని భావించవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం. దీన్నిబట్టి పంపనకు బోధన్‌తో చెరపలేని అనుబందం ఉన్నదని నిరూపణ అవుతున్నది.
పై పరిశీలనల ఆధారంగా తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ కన్నా శతాబ్ద కాలం ముందే తెలంగాణా సాహిత్య చరిత్ర మొగ్గ తొడిగిందని, తెలంగాణ తొలి కవిగా పంపన నిలుస్తున్నాడని చెప్పవచ్చు.
మామిడి హరికృష్ణ
80080 05231
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం