‘వాల్టా’ అమలైవుంటే ‘ఎల్నినో’ను ఎదుర్కొనేవాళ్లం!
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:58 AM
తెలంగాణ రాష్ట్రంలో ‘వాల్టా’ చట్టాన్ని నీరుగార్చిన కారణంగానే భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, ఎల్నినో లాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. నీరు, భూమి, చెట్ల సంరక్షణ కోసం...
తెలంగాణ రాష్ట్రంలో ‘వాల్టా’ చట్టాన్ని నీరుగార్చిన కారణంగానే భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, ఎల్నినో లాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. నీరు, భూమి, చెట్ల సంరక్షణ కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్–2002’ (వాల్టా)ను తెచ్చింది. ఈ చట్టం ప్రస్తుతం తెలంగాణలోనూ అమలులో ఉంది. కానీ, రెవెన్యూ శాఖ దాన్ని పట్టించుకోకపోవడం మూలంగా అది నిర్వీర్యం అయ్యింది. ఈ చట్టం ప్రకారం అమలు కమిటీ చైర్మన్గా జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు.
వాల్టా చట్టంలో మొదటిదైన నీటి వనరుల రక్షణకు సంబంధించి మూడు నియమాలు ఉన్నాయి: 1) బోర్ వేయాలంటే మండల రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి. 2) రెండు వందల మీటర్ల లోపు రెండు బోర్లు వేయకూడదు. 3) వాణిజ్య అవసరాలకు నీరు తోడకూడదు. ఈ మూడింటినీ రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో 16 లక్షల బోరు బావులు ఉంటే 2024నాటికి ఆ సంఖ్య 31లక్షలకు చేరింది. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఈ విషయంలో సుస్పష్టం.
వాల్టా చట్టంలో రెండో అంశం భూ సంరక్షణ: 1) వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే జిల్లా కలెక్టరు అనుమతి తప్పనిసరి 2) అనుమతి లేకుండా వాగులు, వంకలు, చెరువులు, కుంటలను పూడ్చకూడదు. 3)చెరువు ‘ఫుల్ ట్యాంక్ లెవెల్’ (ఎఫ్టీఎల్) పరిధిలో నిర్మాణాలు నిషేధం. ఈ చట్టం ఉన్నప్పటికీ గడిచిన రెండు పుష్కరాల కాలంలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ విధ్వంసం జరిగింది. అనుమతులు లేకుండానే వెంచర్లు వేయడం వలన పంట భూములు కాంక్రీటు భూములుగా మారిపోయాయి. చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరగటంతో పట్టణాలు ఎన్నడూ లేని వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
మూడో అంశమైన చెట్ల సంరక్షణ విషయంలో కూడా ‘వాల్టా’ చట్టం అమలు జరగడం లేదు. చట్ట ప్రకారం: 1)ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరకకూడదు 2) చెట్టు నరికితే అదే స్థానంలో రెండు చెట్లు నాటాలి. పోడు వ్యవసాయం చెట్ల నరికివేతకు ప్రధాన కారణంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అటవీభూములపై హక్కుపత్రాలను మంజూరు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం గిరిజన సాగుదారులకు భూమిపట్టాలు ఇచ్చింది. కానీ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వలేదు. ఈ విషయంలో పోడు సేద్యం చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య అటవీ ప్రాంతంలో ఘర్షణలు నిత్యకృత్యం అయ్యాయి. ఆ పోడు భూముల్లో ఉద్యానవనాలకు అవకాశం ఇవ్వడం ద్వారా వాల్టా చట్టం కొంతైనా అమలు జరిపినట్లు అవుతుంది. ఇకపోతే రోడ్లు, విద్యుత్ లైన్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం సమయాల్లో సైతం యథేచ్ఛగా చెట్లు నరుకుతున్నారు. తెలంగాణలో ఎల్నినో కారణంగా గత నాలుగు నెలలుగా వర్షాలు తగినంతగాలేక, ఎండ తీవ్రత వల్ల సగటు భూగర్భ జల వనరులు తీవ్రంగా అడుగంటి ఉన్నాయి. 2027 మార్చి దాకా ఇదే పరిస్థితి కొనసాగితే– సాగునీటి సమస్య పక్కన పెడితే తెలంగాణ అంతటా తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ‘వాల్టా’ చట్టం పకడ్బందీ అమలు మాత్రమే ప్రజలకు కొంతయినా ఉపశమనాన్ని ఇస్తుంది.
ఎన్. తిర్మల్
ఈ వార్తలూ చదవండి
పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ