Share News

టీచర్‌ నియామకాల్లో ఆలస్యం విద్యాహక్కుకే భంగం!

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:37 AM

ఒక ప్రజాప్రతినిధి పదవి ఖాళీ అయితే ఆ స్థానాన్ని ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని చట్టం చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా ఎక్కువ కాలం ఉండకూడదన్న భావన దీనికి ఆధారం. అయితే...

టీచర్‌ నియామకాల్లో ఆలస్యం విద్యాహక్కుకే భంగం!

ఒక ప్రజాప్రతినిధి పదవి ఖాళీ అయితే ఆ స్థానాన్ని ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని చట్టం చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా ఎక్కువ కాలం ఉండకూడదన్న భావన దీనికి ఆధారం. అయితే ఉపాధ్యాయుల ఖాళీల విషయంలో మాత్రం ఇలాంటి తొందర ఎవరికీ లేదు!

ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినా, బదిలీ అయినా, లేదా ఇతర కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలిగినా ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయరు. మళ్ళీ నియామకాల ప్రక్రియ మొదలయ్యేదాకా విద్యార్థులు ఏళ్ళ తరబడి ఎదురుచూడాల్సిందే. ఈ ఆలస్యానికి మూల్యం చెల్లిస్తున్నది పిల్లలే. ప్రభుత్వ పాఠశాలలపైనే పూర్తిగా ఆధారపడే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఒక టీచర్‌ పోస్టు ఖాళీగా ఉండటం అంటే కేవలం ఒక ఉద్యోగం ఖాళీగా ఉండటం కాదు; అది పిల్లల విద్య హక్కుకు ఏర్పడిన ఖాళీ.

ఉపాధ్యాయుల కొరత వల్ల తరగతులను విలీనం చేయడం, ఒకే ఉపాధ్యాయుడు అనేక తరగతులకు బోధించడం, మిగిలిన ఉపాధ్యాయులపై అదనపు భారం పడటం, బోధన సమయం తగ్గిపోవడం, చదువు ఫలితాలు దెబ్బతినడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి తరం చదువుకునే విద్యార్థులు, వెనుకబడిన ప్రాంతాల పిల్లలు దీనివల్ల మరింత వెనుకబడుతున్నారు.

చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికి ఇది కూడా పెద్ద కారణం. ప్రైవేట్ పాఠశాలలు తమ ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపుతాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన కారణంగా మూడేళ్ల పాటు పదవీ విరమణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ విరామం ముగియడంతో ఇప్పుడు ప్రతి సంవత్సరం వివిధ కేడర్లలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతున్నారు. ఒక లెక్క ప్రకారం నెలకు 400–500 మంది టీచర్లు రిటైర్ అవుతున్నారు. దీనివల్ల నిరంతరం కొత్త ఖాళీలు ఏర్పడుతున్నాయి. ముప్పైమంది విద్యార్థులకు ఒక టీచర్ అనుకున్నా సంవత్సరానికి దాదాపు లక్షా ముప్పైవేల మంది విద్యార్థులు బోధనకు దూరం అవుతున్నారని అర్థం. దీని ప్రభావం వల్లనే విద్యపరంగా తెలంగాణ జాతీయ సూచికలలో వెనుకబడి ఉంది. జిల్లాల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల జాబితా సరసన తెలంగాణ జిల్లాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం, పాఠశాలలు కఠినమైన విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తులను, వృత్తిపరమైన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అన్ని పాఠశాలల్లోని మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు సాధారణంగా మంజూరైన సంఖ్యలో 10శాతాన్ని మించకూడదు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఖచ్చితంగా నిషేధం. ఐనా చట్టానికి విరుద్ధంగా తెలంగాణలో సింగిల్ టీచర్ స్కూళ్ళు సుమారు 5వేలు ఉన్నాయి. క్రమంగా అవి జీరో ఎనరోల్‌మెంట్‌గా రూపాంతరం చెంది బడిని మూసివేయాలన్న ఆలోచనకు దారితీస్తాయి. బడికి సరిపడా టీచర్లను ఇవ్వరు. టీచర్లు లేరని పిల్లలు తగ్గుతారు. పిల్లలు తగ్గారని ఇంకో టీచర్‌ను తీస్తారు. పిల్లలు మరింత తగ్గి అది సింగల్ టీచర్ బడి అవుతుంది. అప్పుడు జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పేరు చెప్పి ఆ స్కూల్‌ను మూసేస్తారు! గత కొన్నేళ్ళుగా సాగుతున్న ఈ విష వలయానికి ముగింపు పలికి, విద్యా విధాన లోపాలను సరిచేయాలి.

తెలంగాణను పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం కాదని అమెరికా, బ్రిటన్‌లతో పోల్చుకోవాలని పోటీ పడుతున్నామని గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా చెప్తుంటారు. మరి ఆ దేశాల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ విధానం నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి కదా! అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఉపాధ్యాయ ఖాళీలను కేవలం పరిపాలనా అంశంగా కాకుండా పిల్లల అభ్యాస హక్కుకు సంబంధించిన అత్యవసర అంశంగా పరిగణిస్తారు. ఖాళీ ఏర్పడిన వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఈ రెండు దేశాల్లో జిల్లా లేదా స్థానిక స్థాయిలో అర్హులైన ఉపాధ్యాయుల జాబితాలు (పూల్‌లు) అందుబాటులో ఉంటాయి. పాఠశాలలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ జాబితా నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హులైన శాశ్వత ఉపాధ్యాయులు వెంటనే అందుబాటులో లేకపోతే తాత్కాలిక లేదా ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమిస్తారు. దీంతో ఒక్క తరగతి గది కూడా ఎక్కువ కాలం ఉపాధ్యాయుడు లేకుండా ఉండదు.

ప్రజాప్రతినిధుల ఖాళీలను భర్తీ చేయడానికి ఉన్న కాలపరిమితి మాదిరిగానే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కూడా ఒక స్పష్టమైన విధానం అవసరం. ఖాళీ ఏర్పడిన ఆరు నెలల్లోపు పోస్టులను భర్తీ చేయడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. శాశ్వత నియామకాలు పూర్తయ్యే వరకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

ఆర్. వెంకటరెడ్డి

జాతీయ కన్వీనర్, ఎం.వి. ఫౌండేషన్

ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

Updated Date - Jul 25 , 2026 | 12:38 AM