Share News

నెరవేరని సామాజిక న్యాయం

ABN , Publish Date - Jun 02 , 2026 | 02:34 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మూలస్తంభాలైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో పాటు, అంతర్లీనంగా ఉన్న బలమైన ఆకాంక్ష ‘సామాజిక న్యాయం’. వివిధ ఉద్యమకారులతో పాటు సబ్బండ వర్గాలు...

నెరవేరని సామాజిక న్యాయం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మూలస్తంభాలైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో పాటు, అంతర్లీనంగా ఉన్న బలమైన ఆకాంక్ష ‘సామాజిక న్యాయం’. వివిధ ఉద్యమకారులతో పాటు సబ్బండ వర్గాలు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు) తమ రక్తాన్ని, చెమటను ధారపోసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాయి. అయితే, రాష్ట్రం సిద్ధించి దశాబ్ద కాలం దాటినా, ఆశించిన సామాజిక మార్పు, రాజకీయ భాగస్వామ్యం మెజార్టీ ప్రజలకు ఇంకా చేరలేదు.

ఆంధ్ర పాలకుల వలస పాలనలో, దోపిడీలో నలిగిపోయిన తెలంగాణను విముక్తం చేసుకోవడానికి సమస్త పీడిత కులాలు ఏకతాటి పైకి వచ్చి పోరాడాయి. ‘‘తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు రాజ్యాధికారంలో, వనరుల్లో భాగస్వామ్యం దక్కుతుంది’’ అని 90శాతం పైగా ఉన్న బహుజన లోకం ఆశించింది. కానీ పదేళ్ల స్వతంత్ర తెలంగాణ పాలనను పరిశీలిస్తే, భౌగోళిక తెలంగాణ సిద్ధించింది కానీ, సామాజిక తెలంగాణ ఇంకా దూరంగానే ఉంది.

ఉద్యమ కాలంలో వనరుల దోపిడీ గురించి మాట్లాడాం. మరి నేడు స్వరాష్ట్రంలో ఆ వనరుల పంపిణీ ఎలా జరుగుతోంది? తెలంగాణలో భూములు, పెద్ద పెద్ద వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు, కీలకమైన ఆర్థిక వనరులు నేటికీ కొన్ని పరిమిత సామాజిక వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. శ్రమ దోపిడీకి గురవుతున్న సబ్బండ కులాలు (కుమ్మరి, కమ్మరి, చేనేత, గీత, మత్స్య కార్మికులు, దళితులు, గిరిజనులు) నేటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే మిగిలిపోతున్నారు తప్ప, వారు ఆర్థిక శక్తులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే వాతావరణం కనిపించడం లేదు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వింతైన సంఘటన ఏమిటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు... నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ అగ్రకుల భూస్వామ్య నాయకుల మాయలో చిక్కుకొని అమరవీరుల పేరుతో బలి పశువులయ్యారు. కానీ అగ్రకులాల నుంచి వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో అత్యంత అల్పంగా అమరులయ్యారు. అదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అగ్రకులాలు నేడు రాజ్యాధికారంలో ఉంటూ తమ సామాజిక రాజకీయ సాంస్కృతిక ప్రాబల్యాన్ని చూపించగలుగుతున్నారు.

నేటి తెలంగాణ అసెంబ్లీలో పార్టీలకతీతంగా 17శాతం ఉన్న ఎస్సీల నుంచి వారి రిజర్వేషన్ల ప్రకారం 19 మంది ఎమ్మెల్యేలు, 10శాతం ఉన్న ఎస్టీల నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, 56శాతం ఉన్న బీసీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఉండడం చూస్తే... సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతటి రాజకీయ అసమానతలు ఉన్నాయో తెలుస్తోంది.


చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. బడ్జెట్ కేటాయింపులు కేవలం ‘అవసరాల’ ప్రాతిపదికన కాకుండా, ఆయా కులాల జనాభా దామాషా ప్రకారం జరగాలి. ప్రైవేటు రంగంలోనూ, ఉన్నత విద్యా సంస్థల్లోనూ స్థానిక బహుజనులకు సరైన అవకాశాలు దక్కాలి. తెలంగాణ కేవలం కొద్దిమంది అగ్రకుల భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తుల ప్రయోజనాల కోసం రాలేదు. వేలాది మంది అమరవీరుల త్యాగాలు, సబ్బండ కులాల పోరాటాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. పాలకులు మారవచ్చు, పార్టీలు మారవచ్చు; కానీ బహుజనుల బతుకులు మారనంత కాలం, వారికి రాజ్యాధికారంలో సమాన వాటా దక్కనంత కాలం ‘ప్రత్యేక తెలంగాణ’ ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. సామాజిక న్యాయం జరిగినప్పుడే, సాధించుకున్న తెలంగాణకు నిజమైన గౌరవం దక్కుతుంది. అదే అమరవీరులకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.

పుల్లెంల గణేష్

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

Updated Date - Jun 02 , 2026 | 02:34 AM