విలీన దినోత్సవమే యోధులకు సరైన నివాళి!
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:18 AM
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న రాగా, ఏడాది తర్వాత 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆ నడుమ కాలంలో ప్రజోద్యమం...
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న రాగా, ఏడాది తర్వాత 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆ నడుమ కాలంలో ప్రజోద్యమం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో ఆంధ్రమహాసభ ప్రతినిధిగా రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా బద్దం ఎల్లారెడ్డి, ఏఐటీయూసీ ప్రతినిధిగా మగ్దుం మొహియొద్దీన్‌లు 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. నిజాం నవాబుకూ, భూస్వాములకూ ప్రైవేటు సైన్యంగా ఉన్న ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లపై ప్రజలు ఎర్రజెండా పట్టుకొని తిరగబడ్డారు. వారి తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి వడిసెలు, గుత్పలు, కారాలతో ఎదురుతిరిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ దళాలు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ దొరల, భూస్వాముల కబంధ హస్తాల నుంచి ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేస్తూ, 3వేల గ్రామాల్లో 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన ఘన చరిత్ర ఆ మహత్తర పోరాటానిది. దాదాపు 4,500 మంది యోధులు తమ ప్రాణాలను తెలంగాణ నేల తల్లికి అర్పణ చేసి పోరాట సమిధలైనారు. ఆ పోరాటాల వారసత్వం, దాని గాథలు ఈనాటికీ ఏ గ్రామానికి వెళ్లినా వినబడతాయి, కనబడతాయి.
సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం’ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం సబబు కాదు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి, నేడు కర్ణాటకలో భాగమైన కల్యాణ కర్ణాటక, మరఠ్వాడా ప్రాంతాల్లో హైదరాబాద్ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలే ఎప్పటి నుంచో అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణా విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తి పోసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 సంవత్సరం నుంచి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నది. పాత ప్రభుత్వం పెట్టిన పేరును మార్చి, కనీసం తెలంగాణ వీరోచిత పోరును స్ఫురించే విధంగా కాకుండా, తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’ అనే పేరుతోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆనాటి ఖాసీం రజ్వీ నాయకుడుగా ఉన్న ఈనాటి ఎంఐఎం నేతలకు ఆగ్రహం కలుగుతుందనా? లేక మరేదైనా కారణం ఉన్నదా? అనే సమాధానం చెప్పాలి. దీన్ని ఆసరాగా తీసుకొని ఈనాటి బీజేపీ, ఆరెస్సెస్‌లు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ తాము రాజకీయంగా తెలంగాణలో బలపడటానికి ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయి. అసలు నాటి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మూలమే తెలంగాణలో జరిగిన మహోజ్వల సాయుధ పోరాటం. నాటి హైదరాబాద్ సంస్థానంలోని కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్న నేటి కర్ణాటక, మహారాష్ట్రలలో సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తుండగా.. తెలంగాణలో అలా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నది? నిస్సంకోచంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడమే నాటి యోధులకు అసలైన నివాళి.
అది హిందూ ముస్లిం పోరాటం కానే కాదు. హైదరాబాద్ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దాదాపు 90శాతం హిందువులే. విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఇంకా అనేకమంది సంస్థానాధిపతులు హిందువులే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా చిత్రహింసలకు గురయ్యారు. షేక్ బందగీని విసునూరు రాంచంద్రారెడ్డికి చెందిన గూండాలు చంపివేశారు. ప్రఖ్యాత జర్నలిస్టు షోయబుల్లా ఖాన్‌ను నడిబజారులో రజాకార్లు క్రూరంగా చంపారు. ఆనాటి వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈనాటి ఖమ్మం జిల్లాలో రజబ్ అలీ లాంటి యోధులు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్‌తో కలిసి మఖ్దూం మొహియొద్దీన్, ఆలంకుంద్ మిరి, జవ్వాద్ రజ్వీ, ఖయ్యుం ఖాన్ లాంటి అనేకమంది ముస్లిం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. మహ్మద్ రఫీ ఉస్మానియా యూనివర్సిటీలో నిజాంకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా ఉన్న అల్లా ఉద్దీన్‌ను నిజాం మూకలు చంపివేశాయి. ఇలా ఎంతోమంది ముస్లింలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. చిత్రహింసలకు, హత్యలకు గురైనారు. నిజాంను గద్దెదించడంలో మతాలకు అతీతంగా హిందువులతో సహా వీరోచిత పాత్ర పోషించిన ముస్లింలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు.
ఆనాటి తెలంగాణ పోరాటంలో, అలాగే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేని బీజేపీ, ఆరెస్సెస్‌లు తెలంగాణ పోరాటంలో తమ పాత్ర లేదని ఒప్పుకుంటూనే... గత పోరాటాన్ని స్మరించుకోవడం తప్పు కాదని విచిత్ర వాదనలను తెస్తున్నాయి. ఆనాటి కమ్యూనిస్టుల త్యాగాలు, పోరాటాలు లేకుండా విలీనం జరిగేదా? ఆనాటి విలీనం లేకుండా నేటి తెలంగాణ ఉండేదా? నిజంగా వారిలో చిత్తశుద్ధి ఉండి ఉంటే గతంలో బీజేపీ హయాంలో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌లు ఎందుకు మంజూరు చేయలేదు?
గత పోరాటాలను, త్యాగాలను న్యాయబద్ధంగా స్వీకరిస్తే తప్పులేదు. కానీ రాజకీయ కుట్రతో పోరాట స్వరూపాన్ని వక్రీకరించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తప్పు, ఘోరమైన నేరం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులమడమంటే రానున్న తరాలకు తెలంగాణ వీర చరిత్రను అందకుండా చేసే కుట్రే! వీటిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ నమ్మబోరు. ఎందుకంటే ఇక్కడ ఇంటింటికీ పోరాట స్మృతులు ఉన్నాయి.
కూనంనేని సాంబశివరావు
శాసనసభ్యులు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
Also Read:
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్