వర్గీకరణ చట్టాన్ని మరింత మానవీయంగా మార్చలేమా?
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:33 AM
ప్రస్తుత వర్గీకరణ చట్టంలోని అతిపెద్ద లొసుగు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డితో ముడిపడి ఉంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జిల్లా, జోనల్, మల్టీ–జోనల్ కేడర్ల వారీగా స్థానిక రిజర్వేషన్ల పరిధిలో జరుగుతాయి....
ప్రస్తుత వర్గీకరణ చట్టంలోని అతిపెద్ద లొసుగు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డితో ముడిపడి ఉంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జిల్లా, జోనల్, మల్టీ–జోనల్ కేడర్ల వారీగా స్థానిక రిజర్వేషన్ల పరిధిలో జరుగుతాయి. మొత్తం రాష్ట్రవ్యాప్త పోస్టులను చూసినప్పుడు గ్రూప్–3 కింద మాలలకు కేటాయించిన 5 శాతం వాటా పెద్దదిగానే కనిపించినా, దానిని 33 జిల్లాలు లేదా బహుళ జోన్లుగా విభజించినప్పుడు ఒక్కో విభాగానికి వచ్చే పోస్టుల సంఖ్య నామమాత్రంగా మారుతోంది. ఉదాహరణకు, ఉప–వర్గీకరణ చట్టం అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయం విడుదల చేసిన 35 బోధన పోస్టుల నోటిఫికేషన్‌లో గ్రూప్–3కి దక్కాల్సిన రెండు పోస్టులు శూన్యమయ్యాయి. అదేవిధంగా వైద్యవిద్యా శాఖ (డీఎంఈ) 607 పోస్టులలో గ్రూప్–3 వాటా ప్రకారం 31 పోస్టులు రావాల్సి ఉండగా కేవలం 26 మాత్రమే దక్కాయి. ఆర్టీసీ నియామకాల్లో 1,589 పోస్టులకు గాను 80 రావాల్సి ఉండగా కేవలం 45 మాత్రమే దక్కడం, పోలీస్ శాఖలోని 60 పోస్టులలో, శ్రీనిధి సొసైటీలోని 123 పోస్టులలో గ్రూప్–3కి ఒక్క పోస్టు కూడా దక్కకపోవడం ఆందోళనకరం. టీజీపీఎస్‌సీ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) 24 పోస్టులలోనూ ఇదే శూన్యత ఎదురైంది. గరిష్ఠంగా 10 లేదా 20 లోపే పోస్టులు ఉన్నప్పుడు పోస్టులను ఫ్యాకల్టీల వారీగా, సబ్జెక్టుల వారీగా, మైక్రో–కేడర్లుగా విభజించినప్పుడు 100 పాయింట్ల రోస్టర్ వ్యవస్థలో 5 శాతం కోటాకు కేటాయించిన పాయింట్ 22 చాలా దూరంలో ఉండటం వల్ల మాల, దాని అనుబంధ వర్గాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోతోంది.
ఈ చట్టం ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద సంక్లిష్ట సమస్య– ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులలో అంతర్గత వర్గీకరణను అమలు చేయడం. ఈ చట్టం రాక ముందు, ఉమ్మడి 15 శాతం కోటా కింద నియమితులైన ఎస్సీ ఉద్యోగులు అనేక శాఖలలో విధుల్లో ఉన్నారు. ఇప్పుడు పదోన్నతుల సమయం వచ్చేసరికి, ఇప్పటికే ఉన్న సీనియారిటీ జాబితాను ఏ విధంగా పునర్వ్యవస్థీకరించాలనే దానిపై స్పష్టత కరువైంది. ఒక నిర్దిష్ట శాఖలో లేదా సెక్షన్‌లో ఉద్యోగుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు, కొత్త వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్లను వర్తింపజేస్తే, దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అలాగని పాత పద్ధతినే కొనసాగిస్తే వర్గీకరణ ఆశయం దెబ్బతింటుంది. మూడు గ్రూపులకు (గ్రూప్ 1, 2, 3) ఎవరికీ అన్యాయం జరగకుండా, సర్వీస్ ఆన్–రోల్‌లో ఉన్న సిబ్బంది హక్కులను కాపాడుతూ కొత్త రోస్టర్ పాయింట్లను ఖరారు చేయడం పరిపాలనాపరంగా ఒక పెద్ద సవాలు.
ఈ సంక్లిష్ట సాంకేతిక లోపాల నుంచి గట్టెక్కి, చట్టం అసలైన అంతస్సూత్రాన్ని కాపాడుకుంటూనే అన్ని సబ్–కేటగిరీలకు సంపూర్ణ ప్రాతినిధ్యం కల్పించడానికి కొన్ని నిశ్చితమైన, ఆచరణాత్మక మార్గాలను అన్వేషించాలి. పాలకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం అమలులో ఉన్న 100 రోస్టర్ పాయింట్ విధానాన్ని మొత్తంగా సామాజిక, విద్యా రంగాలలో వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకొని అన్ని కులాల మధ్య ఈక్విటీ కేంద్రంగా పునర్నిర్మించాలి. అంత శక్తి లేకపోతే, మొదటిది– మైక్రో కేడర్ లేదా సబ్జెక్ట్/ఫ్యాకల్టీ వారీగా పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు, వాటిని విడివిడిగా కాకుండా ‘క్యుములేటివ్ కేడర్ స్ట్రెంత్’ లేదా గ్రూప్– రోస్టర్ విధానం ద్వారా క్లస్టర్లుగా ఏకీకృతం చేయాలి. దీనివల్ల 100 పాయింట్ల రోస్టర్‌లో 5 శాతం వాటా గల గ్రూప్–3తో పాటు 1 శాతం వాటా గల గ్రూప్–1 కూడా కోల్పోయిన పాయింట్లను తిరిగి పొందవచ్చు. రెండవది– పదోన్నతులలో ‘ప్రొస్పెక్టివ్ ఇంప్లిమెంటేషన్’ అవలంబించాలి. అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జరిగే ప్రత్యక్ష నియామకాలకు మాత్రమే వర్గీకరణ రోస్టర్‌ను వర్తింపజేస్తూ, పాత ఉద్యోగుల పదోన్నతులలో సీనియారిటీ రక్షణ కల్పిస్తూ ప్రత్యేక ‘క్యారీ ఫార్వర్డ్’ లేదా ‘ఫ్లోటింగ్ రోస్టర్’ పద్ధతిని ప్రవేశపెట్టాలి. సాంకేతిక లోపాల వల్ల ఏ ఒక్క నోటిఫికేషన్‌లోనైనా ఏ వర్గానికైనా పోస్టులు నష్టపోతే, వాటిని వెంటనే గుర్తించి తదుపరి నోటిఫికేషన్‌కు క్యారీ ఫార్వర్డ్ చేసేలా చట్ట సవరణ లేదా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి.
మూడవది– 100 పాయింట్ల రోస్టర్ స్థానంలో ‘ఫ్లోటింగ్ డెసిమల్ రోస్టర్’ లేదా ‘ఫ్రాక్షనల్ సీట్ బ్యాంకింగ్’ విధానాన్ని తీసుకురావాలి. దీని ద్వారా చిన్న నోటిఫికేషన్లలో మిగిలిపోయే దశాంశ భాగాలను... ఉదాహరణకు 1.75లోని 0.75 వాటా వృథా కానివ్వకుండా, ఒక కేంద్ర రిజర్వేషన్ పూల్‌లో భద్రపరిచి, తదుపరి నోటిఫికేషన్‌లో అది పూర్తి సీటుగా మారినప్పుడు ఆయా వర్గానికి కేటాయించవచ్చు. నాలుగవది– యూనివర్సిటీలు, పోలీస్, వైద్య, విద్యా శాఖల వంటి ప్రత్యేక విభాగాలలో నియామకాల పరిపాలనా పర్యవేక్షణ కోసం ఒక స్వతంత్ర ‘రిజర్వేషన్ అండ్ రోస్టర్ ఆడిట్ అథారిటీ’ని ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ ప్రతి నోటిఫికేషన్ విడుదలకు ముందే అంతర్గత గ్రూపుల శాతాలను ఆర్టికల్ 371–డి స్థానిక పరిధులతో సమన్వయం చేస్తూ ధ్రువీకరిస్తుంది. అయిదవది– అసాధారణ పరిస్థితుల్లో మైక్రో కేడర్ల వల్ల ఏర్పడే సీట్ల లోటును భర్తీ చేయడానికి ‘నోటిఫికేషన్ వారీగా అంతర్గత పునః సమతుల్యత’ (Intra-Notification Re–balancing) నిబంధనను చేర్చాలి. దీని ద్వారా ఒకే నోటిఫికేషన్‌లోని వివిధ సబ్జెక్టుల పోస్టులను కలిపి చూసి ఎస్సీ అంతర్గత వాటాల సమతుల్యత దెబ్బతినకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించవచ్చు.
పాలకులు సాంకేతికత పేరిట సామాజిక న్యాయం వెనుకబడిపోకుండా ఈ సరికొత్త పరిపాలనా సంస్కరణలను అమలు చేసినప్పుడే, అందరికీ సమాన అవకాశాలు కల్పించే అసలైన సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. లేదంటే అసమానతలు అసంతృప్తిగా మారి అంతర్యుద్ధానికి దారితీయవచ్చు.
డా. నాగం కుమారస్వామి
అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలమూరు యూనివర్సిటీ
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు