Share News

ఎస్సీ కమిషన్‌కు న్యాయం చేయాలి, బలం పెరగాలి!

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:47 AM

ఎస్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించటం అంటే కేవలం ఒక పదవిని భర్తీ చేయటం కాదు. రాష్ట్రంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణకు...

ఎస్సీ కమిషన్‌కు న్యాయం చేయాలి, బలం పెరగాలి!

ఎస్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించటం అంటే కేవలం ఒక పదవిని భర్తీ చేయటం కాదు. రాష్ట్రంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న వర్గాల సమస్యలను పరిష్కరించే కీలక రాజ్యాంగ సంస్థకు నాయకత్వాన్ని ఎంచుకోవటం. అందుకే ఈ నియామకంలో రాజకీయ సమీకరణాల కంటే అర్హతకు, సామాజిక నిబద్ధతకు, ఉపకులాల ప్రాతినిధ్యానికి, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తికి రాజ్యాంగ విలువలపై నిబద్ధత, కుల వివక్షపై అవగాహన, అణచివేతకు గురైన వర్గాలతో పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థుల అర్హతలను ముందుగానే ప్రకటించి, వారి సామాజిక సేవా రికార్డును పారదర్శకంగా పరిశీలించాలి. రాజకీయ విధేయత కంటే, ప్రజా సమస్యలపై అభ్యర్థికి ఉన్న అనుభవానికి పట్టం కట్టాలి.

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పదవి మొదటిసారి 2018 జనవరిలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు, రెండోసారి 2023 సెప్టెంబర్‌లో మాల సామాజిక వర్గానికి చెందిన బక్కి వెంకటయ్యకు లభించింది. ఇద్దరూ సిద్దిపేట జిల్లావారే. అంటే రెండు ఉపకులాలకు అవకాశం వచ్చినప్పటికీ ప్రాంతం మాత్రం ఒక్కటే. కాబట్టి తదుపరి నియామకంలో ఇప్పటివరకు అవకాశం దొరకని ఇతర ఎస్సీ ఉపకులాలకూ ఇతర జిల్లాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకే ఉపకులానికి లేదా ఒకే ప్రాంతానికి వరుసగా అవకాశాలు కేంద్రీకృతం కాకుండా పారదర్శకమైన రొటేషన్‌ విధానాన్ని రూపొందించాలి. అర్హత ప్రమాణాలకు రాజీ పడకుండానే ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ మధ్య సమతుల్యత పాటించాలి.

కమిషన్‌ ఏ ప్రభుత్వానికీ అనుకూల సంస్థగా కనిపించకూడదు. ప్రభుత్వం తప్పు చేసినా, పరిపాలనా యంత్రాంగంలో వివక్ష జరిగినా, ప్రభావశీల సామాజిక వర్గం నుంచి అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడాలి. అధికారానికి దగ్గరగా ఉండే కమిషన్‌ కాదు, అధికారాన్ని కూడా రాజ్యాంగం ముందు నిలబెట్టగల కమిషన్‌ కావాలి. అందుకు అవసరమైన కార్యాచరణ స్వేచ్ఛతోపాటు నిధులు, సిబ్బందిని కమిషన్‌కు కల్పించాలి.

ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు కాకపోవడం, నమోదైనా సకాలంలో దర్యాప్తు జరగకపోవడం, బాధితులకు న్యాయం ఆలస్యం కావడం ఇప్పటికీ కొనసాగుతున్న వాస్తవం. ఇలాంటి చోట్ల ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా కమిషన్‌ తన చట్టబద్ధ పరిధిలో స్పందించాలి. పోలీసు, పరిపాలనా శాఖల నుంచి నివేదికలు కోరాలి, నిర్లక్ష్యాన్ని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం అందేలా న్యాయసేవా సంస్థలతో కలిసి పనిచేయాలి. అలాంటి చొరవ, విచక్షణ ఉన్నవారినే చైర్మన్‌గా ఎంపిక చేయాలి. అవసరమైతే కమిషన్‌కు మరిన్ని చట్టబద్ధ అధికారాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.


ఎస్సీ కమిషన్‌ హైదరాబాద్‌లో కూర్చుని ఫిర్యాదులు స్వీకరించే సంస్థగా మిగిలిపోకూడదు. గ్రామస్థాయిలో కుల బహిష్కరణలు, అంటరానితనం, భూ వివాదాలు, విద్యా ఉపాధి అవకాశాల్లో వివక్ష వంటి సమస్యలను గుర్తించేందుకు జిల్లాలు, మండలాల్లో పర్యటించి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలి. కులాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించినప్పుడు, ఆయా కులాల పెద్దలతో ముందుగానే సమావేశాలు నిర్వహించి, ఒక కులంపై మరొక కులం దాడులకు, ఘర్షణలకు దిగకుండా చూడాలి.

కమిషన్‌ సిఫార్సులు కాగితాలకే పరిమితం కాకూడదు. కాబట్టి ప్రభుత్వం మూడు పనులు చేయాలి: ఒకటి, చైర్మన్‌ ఎంపికకు అర్హత ప్రమాణాలను ముందుగా ప్రకటించి, రొటేషన్‌ విధానాన్ని అధికారికంగా రూపొందించాలి. రెండు, కమిషన్‌ సిఫార్సులపై తీసుకున్న చర్యలను ప్రజలకు వెల్లడించాలి. మూడు, వార్షిక నివేదికలను ప్రతి ఏటా శాసనసభ ముందు ఉంచాలి. రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని ఆచరణలోకి తెచ్చే సంస్థగా ఎస్సీ కమిషన్‌ ఎదగాలి.

పాపని నాగరాజు

సత్యశోధక మహాసభ

ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 27 , 2026 | 03:47 AM