గ్రామానికి పెద్ద... గౌరవానికి అనాథ!
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:09 AM
తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజాప్రతినిధి ఎవరు అంటే ఆ పెద్దమనిషి సర్పంచ్ మాత్రమే. ఒక గ్రామంలో జనన ధ్రువీకరణ నుంచి మరణ నమోదు వరకు; తాగునీటి సమస్య నుంచి పారిశుధ్యం వరకు...
తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజాప్రతినిధి ఎవరు అంటే ఆ పెద్దమనిషి సర్పంచ్ మాత్రమే. ఒక గ్రామంలో జనన ధ్రువీకరణ నుంచి మరణ నమోదు వరకు; తాగునీటి సమస్య నుంచి పారిశుధ్యం వరకు; వీధి దీపాల నుంచి రోడ్ల నిర్మాణం వరకు; సంక్షేమ పథకాల అమలు నుంచి ప్రజల నిత్య సమస్యల పరిష్కారం వరకు ప్రతి విషయంలో ప్రజలు ఆశ్రయించేది సర్పంచ్‌నే. అంతేగానీ ఢిల్లీని కాదు, హైదరాబాద్‌ను కాదు. గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య తొలి వారధి సర్పంచ్. కానీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండే ఈ ప్రజాప్రతినిధికి దక్కేది అత్యల్ప గౌరవం, గుర్తింపు.
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ... వీరందరూ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే. అదే విధంగా సర్పంచ్ కూడా ప్రజల ప్రత్యక్ష ఓట్లతో ఎన్నికవుతాడు. ప్రజాస్వామ్యపరంగా అందరి చట్టబద్ధత ఒక్కటే. కానీ వేతనాలు, భత్యాలు, కార్యాలయ సదుపాయాలు, సిబ్బంది, వైద్య భద్రత, పదవీ విరమణ తర్వాత పెన్షన్ విషయంలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఐదేళ్లు గ్రామ ప్రజలకు సేవ చేసిన సర్పంచ్... పదవీకాలం ముగిసిన వెంటనే సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు. ఇది ప్రజాస్వామ్య సమానత్వ సూత్రానికే విరుద్ధం.
తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్‌కు నెలకు కేవలం రూ.6,500 గౌరవ వేతనం మాత్రమే ఉంది. రోజుకు లెక్కిస్తే రూ.220 కూడా కాదు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పర్యవేక్షించే, ప్రభుత్వ పథకాల అమలుకు బాధ్యత వహించే ప్రజాప్రతినిధి శ్రమను ఇంత తక్కువ మొత్తంతో కొలవడం గ్రామ పాలన పట్ల ప్రభుత్వ దృక్పథాన్నే ప్రశ్నిస్తున్నది. గోవాలో నెలకు దాదాపు రూ.20 వేల వరకు గౌరవ వేతనం అందుతోంది. కేరళలో రూ.15 వేలు, పంజాబ్‌లో రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు, హర్యానాలో రూ.10 వేలకు పైగా వేతనంతో పాటు ఇతర భత్యాలు కూడా ఇస్తున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అందుకే గ్రామీణాభివృద్ధి సూచికల్లోనూ అవి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయితే తెలంగాణ మాత్రం గ్రామ స్వరాజ్యాన్ని మాటల్లో మాత్రమే గొప్పగా చెబుతోంది.
ప్రజలకు సమాధానం చెప్పాల్సింది సర్పంచ్. కానీ నిధులు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక ఆమోదాలు, ఆర్థిక స్వేచ్ఛ మాత్రం అధికారుల చేతుల్లోనే ఉంటున్నాయి. ఫలితంగా బాధ్యతలు సర్పంచ్‌పై, అధికారాలు మరెవరి చేతుల్లోనో అనే పరిస్థితి ఏర్పడింది. ఇది స్థానిక స్వపరిపాలన భావనను నిర్వీర్యం చేస్తోంది. తెలంగాణలో వేలాది మంది మహిళా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారు. అయినా వారికి తగిన గౌరవం, భద్రత, ఆర్థిక స్వావలంబన లేదు. గ్రామ నాయకత్వాన్ని బలహీనపరిస్తే గ్రామ ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది.
ఇప్పుడు సంస్కరణలు అత్యవసరం. సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలి. పదవీకాలం పూర్తి చేసిన వారికి గౌరవప్రదమైన పెన్షన్ అమలు చేయాలి. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కల్పించాలి. పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన ఆర్థిక, పరిపాలనా అధికారాలను పూర్తిస్థాయిలో బదిలీ చేయాలి. డిజిటల్ పాలన, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అంశాలపై నిరంతర శిక్షణ అందించాలి. గ్రామ పంచాయతీలను కేవలం పథకాల అమలు కేంద్రాలుగా కాకుండా స్థానిక స్వపరిపాలన సంస్థలుగా బలోపేతం చేయాలి. గ్రామ స్వరాజ్యం బలపడాలంటే సర్పంచ్ బలపడాలి. సర్పంచ్ బలపడాలంటే గౌరవం, అధికారాలు, ఆర్థిక భద్రత కల్పించాలి. గ్రామాన్ని గౌరవించే ప్రభుత్వమే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం.
రేణుక వెంకట్
అధ్యక్షురాలు, తెలంగాణ మహిళా సర్పంచ్‌ల ఫోరం
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్