రైతు నేస్తం.. వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:58 AM
వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) పర్యవేక్షణలో ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్‌కు ఒక వేదికగా, రైతులు ఒకచోట చేరి తమ అనుభవాలను పంచుకునేందుకు, నూతన సాంకేతికతలను నేర్చుకునేందుకు వీలుగా గత...
వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) పర్యవేక్షణలో ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్‌కు ఒక వేదికగా, రైతులు ఒకచోట చేరి తమ అనుభవాలను పంచుకునేందుకు, నూతన సాంకేతికతలను నేర్చుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలు నిర్మితమయ్యాయి. ఇవి చాలావరకు అరకొర వినియోగంతో లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రైతు వేదికలకు ప్రాణం పోశాం. వాటిని కేవలం భవనాలుగా కాకుండా, శాస్త్రవేత్తలు–అధికారులు–రైతుల మధ్య ప్రత్యక్ష సంభాషణ వేదికలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, 1,600 చోట్ల వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది గ్రామీణ స్థాయిలో సాంకేతికతను చేరువ చేయడంలో, పాలనా చిత్తశుద్ధిని చాటడంలో మా ప్రభుత్వం వేసిన అత్యంత కీలకమైన అడుగు.
2024 మార్చి 6న ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమం, ప్రతి మంగళవారం ఉదయం 10.00 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ ఆతిథ్యంలో, వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయం సహ ఆతిథ్యంలో, సిస్కో వెబెక్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఎపిసోడ్‌లో విజయవంతమైన రైతు పొలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ రైతు అనుభవాలను, ఉత్తమ యాజమాన్య పద్ధతులను తోటి రైతులతో పంచుకునే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. అంతేకాక శాస్త్రవేత్తలు, శాఖాధిపతులు నేరుగా రైతులతో మమేకమై, వారి సందేహాలను ఎలాంటి జాప్యం లేకుండా, రెండు వైపులా సంభాషణ ద్వారా పరిష్కరించే నిజమైన ‘ప్రశ్న–సమాధాన’ వేదిక.
నేడు రైతు నేస్తం 100వ ఎపిసోడ్. ఇప్పటివరకు జరిగిన 99 ఎపిసోడ్‌ల ప్రస్థానం ఈ కార్యక్రమ ప్రభావానికి అద్దం పడుతోంది. మొత్తం రైతుల భాగస్వామ్యం–24,86,581. ఇందులో పురుష రైతులు 19,60,474 కాగా మహిళా రైతులు 5,26,107, పాల్గొన్న అధికారులు 2,43,830. కేవలం రెండేళ్ల వ్యవధిలో, ప్రతివారం క్రమం తప్పకుండా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పాతిక లక్షల రైతులను నేరుగా చేరుకోగలగడం అసాధారణ విషయం.
రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చేరవేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వినూత్న మార్గాలను అనుసరించాయి. వాటిని పరిశీలిస్తే తెలంగాణ రైతు వేదికల నమూనా ఎంత ప్రత్యేకమైనదో అర్థమవుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృత వ్యవసాయ విస్తరణ నమూనాగా పేరొందినది అమెరికా కోఆపరేటివ్ ఎక్స్‌టెన్షన్ సిస్టమ్(1914). దీని ద్వారా ల్యాండ్–గ్రాంట్ విశ్వవిద్యాలయాల పరిశోధనలను కౌంటీ స్థాయి ఎక్స్‌టెన్షన్ ఏజెంట్ల ద్వారా రైతులకు చేరవేస్తారు. ఇది ప్రధానంగా ఏజెంట్ల ద్వారా వ్యక్తిగత సందర్శనలపై ఆధారపడిన నెమ్మదైన, వ్యయప్రయాసలతో కూడిన పద్ధతి. శాస్త్రవేత్తతో ప్రత్యక్షంగా, వేలాదిమంది రైతులు ఒకేసారి సంభాషించే వెసులుబాటు లేదు.
ప్రైవేట్ రంగం చేపట్టిన అతిపెద్ద డిజిటల్ రైతు కార్యక్రమాల్లో భారత్‌లో ఐటీసీ ఇ–చౌపాల్ (2000) ఒకటి. గ్రామాల్లో ఇంటర్నెట్ కియోస్క్‌లను ఏర్పాటు చేసి, ‘సంచాలక్’ అనే శిక్షణ పొందిన రైతు ద్వారా మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించే ఈ నమూనా పది రాష్ట్రాల్లో లక్షలాది రైతులకు చేరింది. అయితే ఇది ప్రధానంగా వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన వాణిజ్య నమూనా. సమాచార ప్రసారం ఎక్కువగా ధరలు, కొనుగోళ్లకే పరిమితం, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చకు అవకాశం తక్కువ.
డిజిటల్ గ్రీన్ మోడల్ (వీడియో ఆధారిత విస్తరణ)... అనేక దేశాల్లో అమలవుతున్న ఈ నమూనాలో, విజయవంతమైన రైతుల అనుభవాలను చిత్రీకరించి, ఆ వీడియోలను ఇతర గ్రామాలలో ప్రదర్శిస్తారు. ఇది సంప్రదాయ పద్ధతుల కంటే చాలా చౌకైనది, సమర్థవంతమైనది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది రైతులను చేరింది. కానీ ఇవి ముందుగా రికార్డు చేసిన వీడియోలు, ప్రత్యక్ష ప్రసారం కాదు కనుక రైతు ప్రశ్నకు తక్షణ సమాధానం ఇచ్చే అవకాశం లేదు.
తెలంగాణ రైతు నేస్తం వీటన్నింటి బలాలను మేళవించి, వాటి పరిమితులను అధిగమించింది. ఎందుకంటే ఇది ప్రత్యక్ష, ద్వి–పార్శ్విక సంభాషణ. రికార్డెడ్ వీడియో కాదు, ఏజెంట్ ద్వారా అందే సమాచారమూ కాదు. శాస్త్రవేత్త, రైతు మధ్య ప్రత్యక్షంగా, తక్షణం జరిగే సంభాషణ; పూర్తిగా ఉచిత, ప్రభుత్వ సేవ. అంటే వాణిజ్య ప్రయోజనం ఏ మాత్రం లేకుండా, పూర్తిగా రైతు సంక్షేమమే లక్ష్యంగా నడుస్తున్న వ్యవస్థ. ప్రతి మంగళవారం, ఎలాంటి అంతరాయం లేకుండా 99 వారాలు కొనసాగడం, సంస్థాగత స్థిరత్వానికి నిదర్శనం. ఒకే రాష్ట్రంలో, ఒకే వేదికపై, 1,600 కేంద్రాల ద్వారా ఏకకాలంలో లక్షలాది మంది రైతులను అనుసంధానం చేయడం ప్రపంచంలో మరెక్కడా కనిపించని విషయం. 5.26 లక్షల మంది మహిళా రైతుల భాగస్వామ్యంతో, క్షేత్రస్థాయి సమానత్వానికి ఇది తోడ్పడింది. గ్రామస్థాయిలో సమాచార లోటును పూడ్చి, రైతు ఆలోచనా విధానంలోనే ఒక నిర్మాణాత్మక మార్పుకు నాంది పలికింది.
ఇప్పటికే ఉన్న రైతు వేదికల మౌలిక సదుపాయాలను, ప్రభుత్వ శాఖల సమన్వయాన్ని వినియోగించుకుని, అదనపు భారీ వ్యయం లేకుండా లక్షలాది మందిని చేరుకోగలగడం ఈ నమూనా ప్రత్యేకత. రైతు అడిగిన ప్రశ్నకు అదే క్షణంలో శాస్త్రవేత్త నుంచి పరిష్కారం లభించడం వల్ల, పంట నష్టం జరగకముందే సరైన నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది. ప్రతి వారం సీజన్‌ను బట్టి, పంట దశను బట్టి మారుతూ ఉండే సలహాలు, హెచ్చరికలు నేరుగా రైతులకు అందడం ఈ వేదిక ప్రత్యేకత. ప్రభుత్వ కొత్త పథకాలు, విధానాలు ఎలాంటి జాప్యం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు చేరతాయి. అవసరమైన సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ఈ వేదిక ద్వారా రైతులతో మమేకమై, వారి గొంతును నేరుగా వినే సౌలభ్యం ఉంది.
ఈ వేదిక సామర్థ్యానికి ఒక చక్కటి ఉదాహరణ ఎరువుల యాప్ ప్రస్థానం. రైతు నేస్తం వేదికగా, ఎరువుల యాప్‌పై రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సలహాలు, ఇబ్బందులు సేకరించాం. క్షేత్రస్థాయిలో రైతుల ఆచరణాత్మక సూచనల మేరకు యాప్‌లో అవసరమైన మార్పులు చేపట్టాం. రైతు అనుభవం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ యాప్, దేశంలోనే ఒక ఆదర్శ నమూనాగా నిలిచి, కేంద్ర ప్రభుత్వం సైతం దీన్ని అమలు చేసింది. రైతు వేదికల విజయానికి ఇది నిదర్శనం. 1,600 రైతు వేదికల్లో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని త్వరలో మిగతా వాటిలో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యంతో విస్తరిస్తాం. ప్రతి రైతు వేదికను రైతు నేస్తం పరిధిలోకి తీసుకురావాలన్నదే మా తదుపరి లక్ష్యం.
రైతు వేదికలను నిరంతరాయంగా, పూర్తి ఉచితంగా వినియోగించుకుంటున్న ఉదాహరణ దేశంలో మరెక్కడా లేదు. ఇది కేవలం ఒక సాంకేతిక ప్రయోగం కాదు, శాస్త్రవేత్త నుంచి రైతు వరకు, ప్రయోగశాల నుంచి పొలం వరకు జ్ఞానం నేరుగా, వేగంగా, విశ్వసనీయంగా చేరవేసే ఒక సజీవ వ్యవస్థ. రైతు వేదికలు నేడు కేవలం సమావేశ మందిరాలు కావు. అవి తెలంగాణ రైతాంగపు కొత్త గొంతుకలు. 100వ ఎపిసోడ్ చేరువలో ఉన్న ఈ సందర్భంగా, ఈ ప్రస్థానంలో భాగమైన ప్రతి రైతుకు, శాస్త్రవేత్తకు, అధికారికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ నమూనాలను మించి, తెలంగాణ సృష్టించిన ఈ ప్రత్యేక వేదిక, రాబోయే రోజుల్లో యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి
Also Read:
చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చింది?
‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ