వెయ్యి రోజుల ప్రజాపాలన!
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:37 AM
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, ఆత్మగౌరవాన్ని పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా...
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, ఆత్మగౌరవాన్ని పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వెయ్యి రోజులు కేవలం క్యాలెండర్లో గడిచిన రోజులు కావు. తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన నిర్ణయాల కాలం.
యువతకు ఉద్యోగాలు, రైతుకు భరోసా, మహిళలకు ఆర్థిక స్వావలంబన, పేదలకు గౌరవప్రదమైన జీవనం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు– ఇవన్నీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే అమలు చేసిన మహాలక్ష్మి పథకం ఇందుకు నిదర్శనం.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా కోట్లాది మంది మహిళలకు ఆర్థిక ఉపశమనం లభించింది. ఇప్పటివరకు 345 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగి, మహిళలు సుమారు రూ.12,075 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో పెరిగిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేయడంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త బస్సుల కొనుగోలు, ఆధునిక బస్ స్టేషన్ల నిర్మాణం, కొత్త డిపోల ఏర్పాటు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం వంటి అనేక చర్యలతో ఆర్టీసీని ప్రజలకు నమ్మకమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దింది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2013 నుంచి పెండింగులో ఉన్న రూ.280కోట్ల బాండ్లను క్లియర్ చేయడం; 2017, 2021 పే స్కేల్ సమస్యలను పరిష్కరించడం; 11వ పీఆర్‌సీ అమలు; పెండింగులో ఉన్న డీఏల విడుదల; పీఎఫ్, సీసీఎస్ బకాయిల తగ్గింపు వంటి చర్యలు ఉద్యోగుల్లో నూతన విశ్వాసాన్ని నింపాయి.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నెముక. ప్రజా ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణభారం నుంచి విముక్తి చేసింది. రైతు భరోసా కింద రూ.36వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందించింది. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, ఉచిత విద్యుత్, రైతు బీమా, పంట నష్టపరిహారం వంటి కార్యక్రమాలతో రైతుకు ప్రభుత్వం అండగా నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలోనూ తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది.
సంక్షేమం అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు; ఒక కుటుంబానికి విద్యుత్ భారం తగ్గించడం, వంటగ్యాస్ ఖర్చును తగ్గించడం, నాణ్యమైన బియ్యం అందించడం, ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించడం– ఇవన్నీ కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలే. ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందుతోంది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసి, మరింత మందిని ఆహార భద్రత పరిధిలోకి తీసుకువచ్చింది. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా చేసేందుకు స్వయం సహాయక సంఘాలకు భారీగా బ్యాంకు లింకేజీ కల్పించడం; వడ్డీ రాయితీలు ఇవ్వడం; పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి కొత్త ఆదాయ మార్గాలను ప్రభుత్వం కల్పించింది.
సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పూర్తి చేసింది ప్రజాప్రభుత్వం. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో గణనీయమైన వాటాను కేటాయిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం, కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం ద్వారా విద్యా రంగంలో సమగ్ర మార్పులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది.
యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది ప్రభుత్వం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా కొత్త అవకాశాలను కల్పిస్తున్నది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్, టీ–హబ్, టీ–వర్క్స్, వీ–హబ్ వంటి సంస్థల ద్వారా వేలాది మంది యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందుతోంది.
తెలంగాణను పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు చేపట్టింది. టీజీ–ఐపాస్ ద్వారా వేలాది పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు ఇచ్చి భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నది.
ప్రజా ప్రభుత్వం కేవలం ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు చూపడం మాత్రమే కాదు; వచ్చే తరాల తెలంగాణను నిర్మించేందుకు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించింది. తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
వెయ్యి రోజుల ప్రజాపాలన ఒక మైలురాయి మాత్రమే. తెలంగాణను మరింత బలమైన, సమానత్వంతో కూడిన, పెట్టుబడులకు అనుకూలమైన, ఉపాధి అవకాశాలు కలిగిన, పర్యావరణహితమైన, ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇది ఒక కీలక దశ. రైతు ముఖంలో చిరునవ్వు, మహిళ చేతిలో ఆర్థిక స్వావలంబన, యువతకు ఉద్యోగం, విద్యార్థికి నాణ్యమైన విద్య, పేదవాడికి సొంత ఇల్లు, ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి – ఇదే ప్రజా పాలన లక్ష్యం.
పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి