Share News

రైతన్నకు అండ... పేదింటికి అన్నభరోసా

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:39 AM

పొలంలో రైతు చిందించిన చెమటకు కొనుగోలు కేంద్రంలో తగిన విలువ దక్కాలి. పేదింటి పొయ్యిపై నాణ్యమైన అన్నం ఉడకాలి. ఈ రెండింటినీ కలిపి చూడగలిగినప్పుడే ఆహార భద్రతకు...

రైతన్నకు అండ... పేదింటికి అన్నభరోసా

పొలంలో రైతు చిందించిన చెమటకు కొనుగోలు కేంద్రంలో తగిన విలువ దక్కాలి. పేదింటి పొయ్యిపై నాణ్యమైన అన్నం ఉడకాలి. ఈ రెండింటినీ కలిపి చూడగలిగినప్పుడే ఆహార భద్రతకు సమగ్రత చేకూరుతుంది. తెలంగాణలో మా ప్రజా ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను ఈ విశాలమైన దృక్పథంతో తీర్చిదిద్దుతోంది.

ఆహార భద్రతకు మా ప్రభుత్వం ఇచ్చే అర్థం స్పష్టమైనది. ఏ రైతూ తన పంటను అమ్ముకోవడానికి నిస్సహాయంగా ఎదురుచూడకూడదు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం నాణ్యమైన ఆహారానికి దూరం కాకూడదు. ఈ సంకల్పమే ధాన్యం కొనుగోళ్ల విస్తరణకు, కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి, ఉచిత సన్నబియ్యం పంపిణీకి ప్రాతిపదిక. రైతు సంక్షేమాన్ని కుటుంబ సంక్షేమంతో అనుసంధానిస్తూ పౌర సరఫరాల శాఖను సామాజిక న్యాయం అమలయ్యే కీలక వేదికగా మలుస్తున్నాం.

ఆకలి ఆందోళన తగ్గిన ఇంటిలో అభివృద్ధిపై ఆశ చిగురిస్తుంది. నెలవారీ ఆహార ఖర్చు భారంగా మారిన కుటుంబానికి రేషన్ సరుకులు అందడం, పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం ఆ దిశలో కీలకమైన అడుగులు. సంక్షేమం ఎంతమందికి చేరిందనే లెక్కతో పాటు, అది వారి జీవితాల్లో ఎంత భద్రతను కల్పించిందన్నదీ ప్రభుత్వ పనితీరుకు ప్రమాణం కావాలి. అందుకే పరిధిని విస్తరించడంతో పాటు పంపిణీ చేసే బియ్యం నాణ్యతపైనా దృష్టి పెట్టాం.

రాష్ట్రంలో 89.95 లక్షలుగా ఉన్న ఆహార భద్రత కార్డుల సంఖ్య ఇప్పుడు 1.06 కోట్లకు పైగా చేరింది. దాదాపు 3.43 కోట్ల మందికి ప్రయోజనం అందించే స్థాయికి ఈ వ్యవస్థ విస్తరించింది. 16.69 లక్షల కొత్త కార్డులను జారీ చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 20 లక్షల మందికి పైగా సభ్యులను చేర్చాం. ఆహార భద్రత కార్డు చేతికి అందిన కుటుంబానికి ప్రతినెలా బియ్యం లభిస్తాయనే నమ్మకం ఏర్పడుతుంది. ఇంటి అవసరాలను ముందుగా అంచనా వేసుకునే వెసులుబాటు కలుగుతుంది. రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబానికి ఈ భరోసా ఎంతో విలువైనది. అర్హులైన మరింతమందిని ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆ నమ్మకాన్ని విస్తరించగలిగాం.


పేదింటి కంచంలోనూ నాణ్యమైన అన్నమే ఉండాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. అదనపు పోషకాలతో ఫోర్టిఫై చేసిన సన్నబియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటికే 36 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నబియ్యం పంపిణీ చేయడం ఈ కార్యక్రమ విస్తృతికి నిదర్శనం. ఇంత పెద్ద పరిమాణంలో బియ్యాన్ని సేకరించి, నిల్వ చేసి, కుటుంబాలకు చేర్చడానికి కొనుగోలు నుంచి పంపిణీ వరకు ప్రతి దశలోనూ సమన్వయం అవసరం. ఈ వ్యవస్థకు రైతు పండించే ధాన్యమే పునాది.

2025–26 మార్కెటింగ్ సంవత్సరంలో తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 153.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దాని విలువ రూ.36,486 కోట్లు. 17,000కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సాగిన ఈ ప్రక్రియతో 28 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగింది. పంటను ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ స్వీకరిస్తుందన్న విశ్వాసం రైతుకు ఎంత అవసరమో ఈ కార్యాచరణ తెలియజేస్తుంది.

గత మూడు సంవత్సరాల గణాంకాలు, కొనుగోలు వ్యవస్థ విస్తరణను పరిశీలిస్తే 2023–24లో 95.31 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం కొనుగోళ్లు, 2024–25లో 128.17 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి. అవి 2025–26లో 153.03 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. పెరుగుతున్న ధాన్యానికి అనుగుణంగా కొనుగోలు సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా రైతుకు అండగా నిలవగలిగాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం రైతుకు ఒక నమ్మకమైన మార్కెట్. అక్కడ తన కష్టానికి కనీస మద్దతు ధర లభించే అవకాశం ఉండాలి. పంట చేతికొచ్చిన సమయంలో అమ్మకంపై అనిశ్చితి తగ్గితే తదుపరి సాగుపై రైతు ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతాడు. అందువల్ల ధాన్యం కొనుగోళ్లపై చేసే వ్యయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

సన్నధాన్యం సాగుకు ప్రోత్సాహంగా ప్రకటించిన క్వింటాల్‌కు రూ.500 బోనస్ రైతు ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రభుత్వం నోటిఫై చేసిన సన్నధాన్యం రకాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నాం. రెండు సంవత్సరాల్లో మొత్తం రూ.3,153 కోట్ల బోనస్‌ను రైతులకు చెల్లించాం. ఇందులో 2024–25లో రూ.1,199 కోట్లు, 2025–26లో రూ.1,954 కోట్లు ఉన్నాయి. రైతు శ్రమకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఈ ప్రోత్సాహకాన్ని అమలు చేస్తున్నాం.


తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలను విస్తరించడంపైనా దృష్టి సారించాం. ఫిలిప్పీన్స్‌కు 30,000 టన్నుల బియ్యం ఎగుమతి కావడం ఈ దిశలో ఒక ముందడుగు. కొత్త విదేశీ మార్కెట్లను అందిపుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పండే ధాన్యానికి విస్తృతమైన మార్కెట్ అవకాశాలు ఏర్పడితే వ్యవసాయ రంగానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. ప్రజల ఆహార అవసరాలను తీర్చే బాధ్యతతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య అవకాశాలనూ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాం.

కోట్ల మందికి సేవలందించే వ్యవస్థలో సాంకేతికతకు స్పష్టమైన ప్రజాప్రయోజనం ఉండాలి. అర్హుల గుర్తింపులో కచ్చితత్వం పెరగాలి. రికార్డులు సక్రమంగా ఉండాలి. పంపిణీపై సమర్థమైన పర్యవేక్షణ ఉండాలి. ఈ లక్ష్యాలతో స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారుల డిజిటల్ వివరాల నిర్వహణ, సాంకేతిక ఆధారిత ధ్రువీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. సమాచారంలో పొరపాట్లను తగ్గిస్తూ, అర్హులకు సకాలంలో ప్రయోజనాలు చేరేలా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం.

ధాన్యం కొనుగోళ్లు, పంపిణీ పరిమాణం పెరిగేకొద్దీ ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా పెరుగుతుంది. రైతు నుంచి సేకరించిన ప్రతి ధాన్యపు గింజకు ప్రజాధనంతో సంబంధం ఉంది. దాని సంరక్షణలో జవాబుదారీతనం తప్పనిసరి. అందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేశాం. ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బందితో పాటు భౌతిక తనిఖీల కోసం మొబైల్ యాప్ వంటి డిజిటల్ సాధనాలను వినియోగిస్తున్నాం. తనిఖీల వివరాలు, ఆధారాల నమోదు ద్వారా పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేస్తున్నాం. బాధ్యతలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం, చట్టబద్ధమైన ప్రక్రియల ద్వారా బకాయిలను వసూలు చేయడం... సరఫరా వ్యవస్థపై విశ్వాసాన్ని నిలబెడుతుంది. సంక్షేమానికి కేటాయించిన వనరులు వాటి లక్ష్యానికే వినియోగమయ్యేలా చూడటంలో ఎక్కడా రాజీ పడబోము.

ఆహార భద్రతకు వంట ఇంధనం అందుబాటులో ఉండటం కూడా అవసరమే. అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు రూ.500కు ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ అందిస్తున్నాం. దాదాపు 42.9 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రూ.1,148 కోట్లకు పైగా సబ్సిడీని కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కలిపి చూసినప్పుడు తెలంగాణ అనుసరిస్తున్న ఆహార భద్రత విధానం స్పష్టమవుతుంది.


పాలనపై ప్రజల విశ్వాసం వారి అనుభవాల నుంచే బలపడుతుంది. రైతుకు పంట అమ్మకంలో భరోసా కనిపించాలి. రేషన్ దుకాణానికి వెళ్లిన కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందాలి. ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యానికి లెక్క ఉండాలి. ఈ బాధ్యతలన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించే దిశగా పౌర సరఫరాల శాఖను తీర్చిదిద్దుతున్నాం. అన్నదాత శ్రమకు విలువ లభించి, పేదింటి భోజనానికి గౌరవం చేకూరినప్పుడే అభివృద్ధి ప్రజల జీవితాలను తాకుతుంది. రైతుకు ఆదాయ భరోసా, అర్హమైన కుటుంబానికి నాణ్యమైన ఆహారం అందే ఈ ప్రయాణాన్ని మరింత సమర్థంగా కొనసాగించడమే మా ప్రభుత్వ సంకల్పం.

కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి

నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:39 AM