పంట అమ్మకం దాకా రైతు వెంటే!
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:34 AM
భారతదేశంలో రైతు కోసం కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్–ఎమ్‌ఎస్‌పీ) ప్రకటించడం కొత్త విషయం కాదు. కానీ రైతు పంటను గిట్టుబాటు ధరకు నిజంగా కొనుగోలు చేయడం మాత్రం ఇప్పటికీ చాలా చోట్ల జరగడం...
భారతదేశంలో రైతు కోసం కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్–ఎమ్‌ఎస్‌పీ) ప్రకటించడం కొత్త విషయం కాదు. కానీ రైతు పంటను గిట్టుబాటు ధరకు నిజంగా కొనుగోలు చేయడం మాత్రం ఇప్పటికీ చాలా చోట్ల జరగడం లేదు. అందుకే ఈ రోజు రైతు అడుగుతున్న అసలు ప్రశ్న– ‘‘ప్రభుత్వం ధరను మాత్రమే ప్రకటిస్తుందా? లేక రైతు పంటను నిజంగా కొనుగోలు చేస్తుందా?’’. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం తన చర్యలతో సమాధానం చెబుతున్నది. రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టం సహాయం, పంట బీమా, సన్న రకపు ధాన్యానికి బోనస్, మొక్కజొన్న– జొన్నలకు ఎమ్‌ఎస్‌పీ కొనుగోళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెటింగ్ భరోసా... ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది కేవలం వ్యవసాయంపై మాట్లాడే ప్రభుత్వం కాదు– రైతు పక్షాన నిలబడి, రైతు జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం అన్నది స్పష్టమవుతున్నది.
భారతదేశంలో వ్యవసాయంపై చర్చ జరిగేటప్పుడు చాలా సందర్భాల్లో మనం ఉత్పత్తి గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. దిగుబడులు ఎలా పెంచాలి, మెరుగైన విత్తనాలు ఎలా అందించాలి, సాగునీరు ఎలా కల్పించాలి, యాంత్రీకరణ ఎలా తీసుకురావాలి... ఇవన్నీ అవసరమైన అంశాలే. కానీ రైతు జీవితాన్ని దగ్గరగా గమనించిన నాకు ఒక విషయం స్పష్టంగా తెలుసు– రైతు అసలు సమస్య పంట పండించడం కాదు, పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడమే.
ఒక రైతు విత్తనం వేస్తాడు. ఎరువు వేస్తాడు. కూలి ఖర్చు పెడతాడు. ప్రకృతి విపత్తులను, తెగుళ్లను, మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొంటాడు. కానీ చివరికి తన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినప్పుడు సరైన ధర రాకపోతే, అతని కష్టం అంతా విలువ కోల్పోయినట్టే! అందుకే రైతు సంక్షేమం అంటే కేవలం పంట పండించే దశలో సాయం కాదు, పంట అమ్ముకునే దశలో కూడా ప్రభుత్వం రైతు పక్కన నిలవాలి. ఇదే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ దృక్పథం.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేక పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. కనీస మద్దతు ధర ప్రకటించడం తప్పు కాదు. కానీ రైతు అడిగే అసలు ప్రశ్న ఏమిటంటే– ‘‘ప్రకటించిన మద్దతు ధర రైతు చేతికి నిజంగా చేరుతోందా?’’ అన్నది. మద్దతు ధర కాగితాలపై ఉండొచ్చు. ప్రకటనల్లో ఉండొచ్చు. కానీ రైతు మార్కెట్ యార్డుకు వెళ్లినప్పుడు, అక్కడ వ్యాపారి తక్కువ ధర చెబితే, ప్రభుత్వ కొనుగోలు లేకపోతే ఆ కనీస మద్దతు ధర ఉపయోగం రైతుకు ఉండదు. అందుకే– కనీస మద్దతు ధర అంటే కేవలం ప్రకటన కాదు, రైతు చేతికి అందే హామీ కావాలి.
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతోంది. ఈ రోజు దేశంలో చాలా రాష్ట్రాలు కనీస మద్దతు ధర గురించి మాట్లాడుతున్నాయి. కానీ తెలంగాణ మాత్రం కనీస మద్దతు ధరను రైతు జీవితంలో అమలయ్యే విధానంగా మార్చుతోంది. కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ప్రధానంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి కొన్ని పంటలకు మాత్రమే పరిమిత మద్దతు ఇస్తోంది. అంతేగాక, రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కూడా కేవలం 25శాతం వరకు మాత్రమే కొనుగోలు చేసే పరిమితి ఉంది. అంటే కనీస మద్దతు ధర ప్రకటించినా, రైతులందరికీ పూర్తి రక్షణ ఉండదు. ఇక్కడే తెలంగాణ భిన్నంగా ఆలోచిస్తోంది. రైతు కోసం ధర ప్రకటించడం కాదు, రైతు పంటను కొనుగోలు చేయడం ముఖ్యం అని తెలంగాణ నిరూపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కేవలం కనీస మద్దతు ధర మాత్రమే కాకుండా, సన్న రకపు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తోంది. ఇది రైతుకు నేరుగా అదనపు ఆదాయం. దిగుబడిని బట్టి ఎకరాకు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు అదనపు లాభం రైతులకు లభిస్తోంది. ఇది ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే వ్యవసాయ విధానం కేవలం ‘‘ఎంత పండింది?’’ అన్నదానికే పరిమితం కాకూడదు. ‘‘రైతు చేతిలో ఎంత మిగిలింది?’’ అన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో సమాధానం చెబుతోంది.
గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న వంటి పంటలకూ కనీస మద్దతు ధర ఆధారంగా కొనుగోళ్లు చేపట్టడం ద్వారా రైతుల్లో విశ్వాసాన్ని పెంచింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర గురించి మాట్లాడినా, రైతు చేతికి నిజంగా మద్దతు ధర అందేలా, ప్రభుత్వ కొనుగోలు ద్వారా భరోసా కల్పిస్తున్న రాష్ట్రాలు చాలా అరుదు. తెలంగాణ మాత్రం స్పష్టంగా చెబుతోంది– ‘‘రైతు పంట ఏదైనా కావచ్చు, రైతు నష్టపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత’’.
తెలంగాణలో ఈ కొనుగోలు వ్యవస్థను సమర్థంగా అమలు చేస్తున్న నోడల్ ఏజెన్సీ మార్క్‌ఫెడ్ (MARKFED). రైతు పంటకు మార్కెట్‌లో ధర పడిపోతే, ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర ఆధారంగా కొనుగోలు చేస్తోంది. 2023–24 నుంచి 21 మార్చి 2026 వరకు మార్క్‌ఫెడ్ ద్వారా 2,96,424 మంది రైతులు లబ్ధి పొందగా, 7,94,716 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. మొత్తం కొనుగోళ్ల విలువ రూ.2,655 కోట్లు. ఇందులో 2023–24లో జొన్న కొనుగోలు 93,900 మెట్రిక్ టన్నులు,
2024–25లో జొన్న కొనుగోలు 1,54,281 మెట్రిక్ టన్నులు, 2025–26లో మొక్కజొన్న కొనుగోలు 3,76,167 మెట్రిక్ టన్నులు కాగా, మొక్కజొన్న కొనుగోలు విలువ రూ.902.80 కోట్లు. ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి– తెలంగాణలో కనీస మద్దతు ధర కేవలం పత్రికా ప్రకటన కాదు, రైతు జీవితంలో అమలు అవుతున్న వాస్తవం.
తెలంగాణ ప్రభుత్వం రైతు కోసం తీసుకుంటున్న చర్యలు కేవలం మార్కెటింగ్‌కే పరిమితం కావు. రైతు జీవితంలోని ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలవాలి అనే ఉద్దేశంతో సమగ్ర చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కింద ఎకరాకు సీజన్‌కు రూ.6,000, గతంలో ఉన్న రైతుబంధుతో పోలిస్తే ఎకరాకు రూ.1,000 పెంపు, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల లోపు రుణమాఫీ, పంట నష్టం సమయంలో ఎకరాకు రూ.10,000 ఆర్థిక సహాయం, ఈ సంవత్సరం నుంచి పంట బీమా– ఇవన్నీ కలిపి చూస్తే రైతు సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చక్రంగా చూస్తోందని స్పష్టమవుతుంది.
ప్రభుత్వాన్ని రైతు పెద్దగా ఏమీ అడగడు. తన శ్రమ వృథా కాకూడదని మాత్రమే కోరుకుంటాడు. పంటకు గిట్టుబాటు ధర రావాలని మాత్రమే ఆశిస్తాడు. నష్టానికి అండగా ప్రభుత్వం ఉండాలని మాత్రమే ఎదురుచూస్తాడు. తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు స్థాయిల్లోనూ– సాగు ముందు, సాగు సమయంలో, అమ్మకం తర్వాత– రైతు వెంటే నిలుస్తోంది. అందుకే ఇది కేవలం పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాదు; రైతు గుండె చప్పుడు వినగల ప్రభుత్వం. కనీస మద్దతు ధరను కాగితాలపై కాకుండా రైతు చేతిలో కనిపించేలా చేయడం, ఆదాయాన్ని పెంచేలా బోనస్ ఇవ్వడం, మార్కెటింగ్‌కు భరోసా కల్పించడం– ఇవన్నీ కలిపి తెలంగాణను నిజమైన రైతు కేంద్రక పాలనా నమూనాగా నిలబెడుతున్నాయి.
తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ, మార్కెటింగ్,
చేనేత–జౌళి, సహకార శాఖ మంత్రి
ఇవి కూడా చదవండి..
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత