Share News

తెలంగాణ విమోచనోద్యమం.. పాలకులకు ఒక గుణపాఠం

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:22 AM

తెలంగాణను అనేకమంది రాజులు పరిపాలించారు. చివరగా పాలించినవారు అసఫ్‌జాహీ వంశీయులు. ఇందులో చివరి నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911 నుంచి 1948 సెప్టెంబర్‌ 17 వరకు...

తెలంగాణ విమోచనోద్యమం.. పాలకులకు ఒక గుణపాఠం

తెలంగాణను అనేకమంది రాజులు పరిపాలించారు. చివరగా పాలించినవారు అసఫ్‌జాహీ వంశీయులు. ఇందులో చివరి నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911 నుంచి 1948 సెప్టెంబర్‌ 17 వరకు పరిపాలించాడు. ఈయన కాలంలోనే హైదరాబాద్‌తో (తెలంగాణ–8 జిల్లాలు, మహారాష్ట్ర–5 జిల్లాలు, కర్ణాటక–3 జిల్లాలు) పాటు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశ స్వాతంత్ర్యోద్యమం ఊపందుకోవడంతో 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశంలోని 560 సంస్థానాలలో జమ్మూ కశ్మీర్‌, జునాగఢ్‌, హైదరాబాద్‌ సంస్థానాల వారు భారత ప్రభుత్వంలో విలీనం కావడానికి ఇష్టపడలేదు.

ఆనాడు దేశమంతా వందేమాతరం నినాదాలతో మువ్వన్నెల జెండాను ఎగరేస్తూ, ఆనందంగా భరతమాతను అర్చిస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం రాక్షసి మూకలు రాజ్యం చేస్తున్నాయి. నిజాం నవాబు ఇక్కడి మట్టిలోని స్వాతంత్ర్య కాంక్షను చంపేసి, ఉన్మాద పాలన కొనసాగించాడు. పత్రికలు, సంస్కృతి, సమావేశాలు, గ్రంథాలయాలపై ఆంక్షలు విధించాడు. అది మెల్లమెల్లగా ప్రజల హృదయాలను తాకి పోరాటంగా మారింది. ఈ పోరాటంలో మతోన్మాదపు కత్తులకు ఎందరో వీరులు బలైపోయారు. సామాజిక ఉద్యమ సంస్థలు, మేధావులు, రాజకీయవేత్తలు, పత్రికా సంపాదకులు, సామాజిక కార్యకర్తలు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేశారు. వారికి మద్దతుగా హైదరాబాద్‌ పైకి నాటి హోంమంత్రి, ఉపప్రధాని అయిన సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ సైన్యాన్ని పంపించారు.

నిజాం పాలనలో 500 జాగీర్లు, 14 సంస్థానాలుండేవి. వీరందరూ నిజాంకు కప్పం కట్టేవారు. సర్ఫేఖాస్‌ పేరిట పెద్ద మొత్తంలో భూమిని నిజాం తన సొంత భూమిగా ప్రకటించుకొన్నాడు. దీని మీద వచ్చే ఆదాయం రాజు భోగభాగ్యాలకే తప్ప సంస్థానం అభివృద్ధికి కాదు. భారత ప్రభుత్వంలో కలవక స్వతంత్ర ఉస్మానిస్థాన్‌గా తన రాజ్యాన్ని (1947 జూలై 14) ప్రకటించుకొన్నాడు. అప్పటి నుంచి సంస్థానంలో అకృత్యాలు పెరిగిపోయాయి. 1929లో ఏర్పడ్డ మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అనే రజాకార్ల సంస్థ సంస్థానంలో అకృత్యాలకు తెరతీసింది. అది నిజాం స్వచ్ఛంద సైన్యంగా పనిచేసింది.


మరోపక్క నిజాం నవాబు తెలంగాణను పాకిస్థాన్‌లో కలపడానికి సంధి రాయబారం నెరపాడు. ఇదే అదనుగా దేశవిభజన చేసిన మహమ్మద్‌ అలీ జిన్నా... నిజాంతో సమావేశమయ్యాడు. భారతదేశ భూభాగం మధ్యలో ఉండి, భారత ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాలి అనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు, మేధావులు, కవులు, పాత్రికేయులు, రచయితలు, రైతులు, కూలీలు మొదలుకొని యక్షగాన కళాకారుల వరకు అందరూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇది జీర్ణించుకోలేని నిజాం నవాబు రజాకార్లను తెలంగాణపై వదిలేసి పరిపాలనను వారి చేతిలో పెట్టినంత పనిచేశాడు. ఖాసీం రజ్వీ మరో మహమ్మద్‌ అలీ జిన్నాలా తన అకృత్యాలను నిరాటంకంగా కొనసాగించడానికి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరోక్షంగా తోడ్పడ్డాడు. తెలంగాణలో ఎన్నో గ్రామాలు రజాకార్ల హింసతో అట్టుడికిపోయాయి. గుండ్రాంపల్లి, అప్పంపల్లి, బైరాన్‌పల్లి, పరకాల మొదలైన ఎన్నో గ్రామాలు తీవ్రమైన రజాకార్ల హింసతో భీతిల్లిపోయాయి.

నిజాం పోలీసుల పగటి పాలన, రజాకార్ల రాత్రి పాలన ప్రజల్ని నానావిధాలుగా హింసించింది. ఈ అత్యాచారాల రక్తసిక్త చరిత్ర వేల పుటల్లో లభిస్తుంది. ‘‘ఓ నిజాము పిశాచమా!’’ అంటూ మహాకవి దాశరథి... నిజాం నిరంకుశత్వాన్ని ఎండగట్టాడు. ‘‘నైజాము సర్కరోడా! నాజీల మించినోడా!’’ అంటూ నల్లగొండ యాదగిరి పాట నిజాం నుంచి విముక్తికి ఊపిరిపోసింది. ఆర్యసమాజ్‌, హిందూ మహాసభ, జాతీయ కాంగ్రెస్‌, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, సాయుధ రైతాంగ సమితి, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ... అన్నీ ప్రజల్లో చైతన్యాన్ని నిర్మాణం చేశాయి.

భారత సైన్యం హైదరాబాద్‌ రాష్ట్రంలోకి ప్రవేశించక ముందే ఎరుపాలెంలో 70 మందిని, పరకాలలో 35 మందిని నిజాం సైన్యం చంపేసింది. బీబీనగర్‌లో మహిళలపై అత్యాచారాలు, బతుకమ్మలాడే స్ర్తీలను వివస్త్రలుగా చేసి రజాకార్లు, నిజాం పోలీసులు పైశాచికానందం పొందారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలోని అనేక నగరాల్లో, గ్రామాల్లో దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, మానభంగాలు, హత్యలు, సామూహిక దహనాలు జరిగాయి.


నేనే సర్వాధికారిని అని ప్రకటించిన నిజాం నవాబు దురాగతాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ దూతగా హైదరాబాద్‌లో ఉన్న కె.ఎం. మున్షీ కేంద్రానికి తెలియజేశాడు. ఆ సమాచారం ఆధారంగా సర్దార్‌ పటేల్‌ తీసుకున్న నిర్ణయంతో 1948 సెప్టెంబర్‌ 13న భారతసైన్యం పోలీసు చర్య పేరుతో హైదరాబాద్‌ సంస్థానంలోకి ప్రవేశించింది. ఇక లాభం లేదనుకుని, మున్షీ సలహాతో నిజాం తననూ, తనవాళ్లను కాపాడుకోవడానికి నిశ్చయించుకొని 1948 సెప్టెంబర్‌ 17న బేగంపేట విమానాశ్రయంలో పటేల్‌ ముందు తలవంచి సరెండరయ్యాడు. దీనినే నిజాం తలవంచిన రోజు అని చరిత్రలో చెప్పుకొంటాం!

కొమురం భీం మొదలుకుని నారాయణరావు పవార్‌ వరకు తెలంగాణ కోసం, తెలంగాణ విమోచన కోసం చేసిన పోరాటం 1948 సెప్టెంబర్‌ 17న ఫలించి ఈ ప్రాంతం విమోచన చెంది స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ముఖ్యంగా ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ నిప్పుకణంలా చూపిన ఆనాటి ధైర్యం తెలంగాణ ప్రజల గుండెల్లో ఎన్నడూ చెరిగిపోదు. కానీ, నేడు.. నిజాం నవాబును కీర్తిస్తూ అదే మార్గంలో నడుస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ పరిపాలన సాగిస్తున్న పాలకులకు తెలంగాణ విమోచనోద్యమ చరిత్ర ఒక గుణపాఠం కావాలి.

ఒకప్పుడు వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం ఆనాటి నియంతలతో పోరాటం చేస్తే ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘22ఏ’ అనే నిషేధ విధానంతో సరిగ్గా నిజాం, రజాకార్ల కాలాన్ని గుర్తుచేసుకునేటట్టు చేస్తున్నది. రజాకార్ల వారసుల అడుగులకు మడుగులొత్తే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరగబడాలంటే మరోసారి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర పునాదులపై భావి జీవితాన్ని నిర్మించి మరోసారి బానిసలం కాకుండా ముందుకు సాగుదాం.

డా. కె.లక్ష్మణ్‌

బీజేపీ రాజ్యసభ సభ్యులు

Also Read:

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్

Updated Date - Sep 17 , 2026 | 02:22 AM