Share News

విలీనమొక్కటే చాలదు, విజన్ కూడా కావాలి‌!

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:19 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. పన్నెండేళ్ల క్రితం అంటే...

విలీనమొక్కటే చాలదు, విజన్ కూడా కావాలి‌!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. పన్నెండేళ్ల క్రితం అంటే పదో తరగతి పరీక్షలు విద్యాహక్కు చట్టం–2009 సూచించిన సీసీఈ విధానంలో జరిగే నాటికే ముందుకు రావాల్సిన అంశం. తర్వాత కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం–2020 నాటికైనా విలీనం చేయాల్సింది. కనీసం ఇప్పటికైనా విలీన నిర్ణయం జరగటం హర్షించదగ్గ అంశమే. అయితే మాటలతో సరిపెట్టుకుంటే సరిపోదు. సంస్థాగత మార్పులు, వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టాలి. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా ఆ దిశగా పనికొస్తుంది.

వ్యవస్థాగతంగా చూసినప్పుడు పాఠశాల విద్యను మూడు భాగాలుగా విభజించాలి. మూడు పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అంటే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ (అంగన్‌వాడీ కేంద్రాలు) నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు మాధ్యమిక పాఠశాల వ్యవస్థ, 9 నుంచి 12 వరకు ఉన్నత పాఠశాల వ్యవస్థగా రూపుదిద్దుకోవాలి. వ్యవస్థాగత సర్దుబాటులో ప్రాథమిక పాఠశాల నుంచి 5వ తరగతిని మాధ్యమిక పాఠశాలకు తెచ్చి, ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతులతో కలిపి మాధ్యమిక పాఠశాల వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. ఇప్పటికే ఉన్న 18వేల ప్రాథమిక పాఠశాలల్లో, 4,100 ప్రాథమికోన్నత పాఠశాలలను తరగతుల మార్పులతో సరిదిద్దే అవకాశం ఉంది. ఇక ఉన్నత పాఠశాలల్లోని 9, 10 తరగతులకు 11, 12 తరగతులు జోడించాలి. మొత్తం 5,100 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులను, 426 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 9, 10 తరగతులను వ్యవస్థీకరించాలి. సరైన విద్యార్థుల నమోదు లేని జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విషయంలో కూడా విద్యాశాఖ ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోవాలి. మూడంచెల విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయకుండా విలీనం ప్రక్రియ జరిపిస్తే అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. ఈ మార్పులోకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదన చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను అంతర్భాగం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు ఇంటర్ తరగతులకు అవసరం అయిన బోధనా సిబ్బంది సర్దుబాటు లేదా ఏర్పాటు అత్యవసరం. 2027 జూన్ నుంచి ఈ మార్పు అమలు జరిగినా, ముందస్తుగానే ఆ కసరత్తు జరగాలి.

సంస్థాగత మార్పుల విషయానికి వస్తే– బోర్డ్‌ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఇవి రెండూ కొనసాగవలసిన అవసరం లేదు. ఇకపోతే ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల విద్యా పరిపాలనా ప్రక్రియ సులభతరం అవుతుంది.


తాజా 2025–26 యుడైస్ గణాంకాలు కూడా ప్రైవేటు పాఠశాల వ్యవస్థ పెరుగుదలనే సూచిస్తున్నాయి. గత పాలకులు చట్టాలను చాప చుట్టి ప్రైవేటు విద్యా వ్యవస్థ చంకలో పెట్టారు. చట్టసభల నిండా ప్రైవేటు విద్యా వ్యాపారులు తిష్ట వేయడమే అందుకు ప్రబల తార్కాణం. ఇకపోతే, రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 426 ఉండగా, 1292 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అంతేకాదు, ఎక్కువమంది విద్యార్థులు ప్రైవేటు జూనియర్ కళాశాల వ్యవస్థలోనే అధిక ఫీజులు కట్టి చదువుతున్నారు. సౌకర్యాలు అంతగా లేకపోయినా, అర్హులైన బోధనా సిబ్బంది పెద్దగా లేకపోయినా ప్రైవేట్‌ జూనియర్ కళాశాలలనే ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే– ప్రాథమికంగా ప్రభుత్వ కళాశాలల్లో జవాబుదారీతనం లోపించడం, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్‌తోపాటు జీ, టోఫెల్ లాంటి శిక్షణ లభించడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చును. ప్రైవేటు విద్యా వ్యవస్థలో బలవంతంగా కోచింగ్ రుద్దడంపై నిషేధం విధించాలని తెలంగాణ విద్యా కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది.

ఇక ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఇంటర్మీడియట్ స్థాయిలో లేబొరేటరీ టెక్నీషియన్, నర్సరీ శిక్షణ, పారిశ్రామిక శిక్షణ, కంప్యూటర్ విద్య, కృత్రిమ మేధా విద్య, ఫ్యాషన్ డిజైనింగ్‌, అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్, సెరీకల్చర్, హార్టికల్చర్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించగలిగితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కొంత భరోసా కల్పించినట్లు అవుతుంది. అందుకే ఇప్పుడు విలీనం మాత్రమే కాదు! విద్యా విజన్‌లో కూడా మార్పు తేవాల్సిన అవసరం ఉంది.

ఎన్. తిర్మల్

సామాజిక కార్యకర్త

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:19 AM