Share News

ప్రజాపాలనలో ‘శ్రామిక విజయగీతిక’

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:10 AM

రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌.అంబేడ్కర్ ఆకాంక్షించిన శ్రమ గౌరవం, కార్మిక సంక్షేమం లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో కార్మిక–కర్షక వర్గానికి...

ప్రజాపాలనలో ‘శ్రామిక విజయగీతిక’

రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌.అంబేడ్కర్ ఆకాంక్షించిన శ్రమ గౌరవం, కార్మిక సంక్షేమం లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో కార్మిక–కర్షక వర్గానికి తగిన న్యాయాన్ని చేకూర్చడానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనీస వేతనాల పెంపును మేనిఫెస్టోలో చేర్చి, వారికి మేమున్నామంటూ భరోసానిచ్చింది. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని పరితపించింది. కార్మికుడు సంతృప్తిగా ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందనీ, ఉత్పాదకత పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనీ, అందుకే వేతనాల పెంపు అనేది ఖర్చు కాదు, అది మానవ వనరులపై పెట్టుబడి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనాల పెంపుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ మధ్యే మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రజా ప్రభుత్వం.. పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఆరోగ్య భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని శ్రామికుల సంక్షేమమే లక్ష్యంగా కార్మికుల వేతనాలను భారీగా పెంచుతూ మే 21న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 13వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా 1 జూన్, 2026 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని 1.11 కోట్లకు పైగా కార్మికులకు ఈ పెంపుతో లబ్ధి చేకూరుతున్నది.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తూ కనీస వేతనాల వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కనీస వేతనాల పరిధిలో కొత్తగా మరో 10 ఉపాధి రంగాలను చేర్చడంతో రాష్ట్రంలో ఈ చట్టం వర్తించే రంగాల సంఖ్య 77కు చేరుకుంది. దీంతో మరింత మంది కార్మికులు చట్టబద్ధమైన వేతన రక్షణ పరిధిలోకి వచ్చి, లబ్ధి పొందనున్నారు. ఇప్పటివరకు వివిధ రంగాలకు వేర్వేరు కనీస వేతనాలు అమలులో ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అందరికీ సమాన న్యాయం జరిగేలా ఏకీకృత కనీస వేతనాల నమూనాను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ద్వారా వేతన వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు కార్మికులకు న్యాయమైన పారితోషికం అందే అవకాశం మరింత బలపడింది. ప్రాంతాల అభివృద్ధి స్థాయి, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. నగరపాలికలను జోన్–1గా, మున్సిపాలిటీలను జోన్–2గా, గ్రామాలు–ఇతర ప్రాంతాలను జోన్–3గా గుర్తించి నైపుణ్య స్థాయిల ఆధారంగా కనీస వేతనాలను ప్రజాప్రభుత్వం ఖరారు చేసింది. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీల వారీగా వేతనాలను పెంచడం ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు వారిలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తున్నది.


అంతేకాకుండా, వేతన సవరణ ప్రకారం.. రోజుకు 8 గంటలకు మించి పనిచేస్తే అదనపు పని గంటలకు ఓవర్‌టైమ్ వేతనం, వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసే కార్మికులకు ఆ రోజు సాధారణ వేతనానికి రెండింతల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కార్మికుల శ్రమకు తగిన గౌరవం, ప్రతిఫలం లభిస్తుంది. గుత్తేదారులు లేదా సర్వీస్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. కనీస వేతనాల అమలు బాధ్యతను ప్రధాన యజమానిపైనే ఉంచడం ద్వారా మధ్యవర్తుల కారణంగా కార్మికులు నష్టపోకుండా రక్షణ కల్పించింది. ఈ మధ్యే గవర్నర్ ఆమోదించిన గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం... కార్మిక సంక్షేమంపై ప్రజాప్రభుత్వానికున్న నిబద్ధతను చాటుతున్నది. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల తర్వాత దేశంలోనే ఈ చట్టాన్ని అమలుచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం.

బిల్లా అజయ్‌కుమార్

ఇవి కూడా చదవండి..

దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్

యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 01:10 AM