Share News

ప్రభుత్వాసుపత్రులను చూస్తుంటే దుఃఖం ముంచుకొస్తోంది

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:29 AM

మన రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక సౌకర్యాల పరిస్థితి మాటేమిటి అని మళ్లీ ఒకసారి గుర్తు చేయాల్సి వచ్చినందుకు మాలాంటి వారికి దుఃఖంతో పాటు, ఒకింత ఆగ్రహమూ కలుగుతోంది...

ప్రభుత్వాసుపత్రులను చూస్తుంటే దుఃఖం ముంచుకొస్తోంది

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,

వైద్య, ఆరోగ్యమంత్రి దామోదర రాజనరసింహ వంటి పెద్దలకు...

మన రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక సౌకర్యాల పరిస్థితి మాటేమిటి అని మళ్లీ ఒకసారి గుర్తు చేయాల్సి వచ్చినందుకు మాలాంటి వారికి దుఃఖంతో పాటు, ఒకింత ఆగ్రహమూ కలుగుతోంది. రాష్ట్ర రాజధాని పరిస్థితే ఇలా ఉంటే, ఇక జిల్లా కేంద్రాలలో, మండల స్థాయి ఆసుపత్రుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందన్న ఆలోచన కూడా రాదు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత గురించి మేము మాట్లాడటం లేదు. ఉన్నంతవరకూ వాళ్లు తమ శక్తికి మించే పనిచేస్తున్నారు. నిజానికి వాళ్లపై వందింతల భారం ఉంటోందని వారి రోజువారీ పని ఒత్తిడిని గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, పేట్లబురుజు ప్రసూతి హాస్పిటల్స్ వంటి రెఫరల్ ఆసుపత్రులను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అర్థం కానిది, అర్థం చేసుకోవటానికి నిరాకరించేది మీలాంటి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే.

ఆరోగ్యం బాగోలేకపోతేనో, లేదంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతేనో మాత్రమే కదా సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పరిగెత్తేది! అక్కడ కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోబట్టే కదా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లిపోతున్నది?! ఇక్కడ లేని నైపుణ్యం ఏదో కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ దొరుకుతుందని మాత్రం కాదు. నిజానికి పరిశోధన, అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఇతర సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటున్నారు. కానీ, నిలబడటానికి కూడా వీల్లేని దుర్భర పరిస్థితులు ఉండబట్టే కదా అక్కడి నుంచి బయటపడటానికి ఎవరైనా తన్నుకులాడేది!

ఈ మధ్య కొన్ని సందర్భాల్లో పేషెంట్స్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న పెద్దాసుపత్రులకు వెళితే, అక్కడి డాక్టర్స్ గానీ, వైద్య సిబ్బంది, ఇతరులు గానీ మర్యాదగా చెప్పినదేమంటే... ‘ఎక్కడైనా జరిగే ట్రీట్మెంట్ ఒక్కటే. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కనీస ప్రాథమిక సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని భరించి ఉంటామంటే ఉండండి, లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్లొచ్చు’ అని! తమకు నచ్చినచోట వైద్యం చేయించుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. సరే, ఆర్థికంగా ఖర్చు భరించగలిగినవాళ్లు వెళతారు. మరి ఆ భారం మోయలేనివాళ్ల పరిస్థితి ఏమిటి? అంటే వారికి ఆత్మగౌరవం ముఖ్యం కాదా?


ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను విడనాడే పరిస్థితులను మార్చి ప్రజారోగ్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా రాజకీయ వ్యవస్థ ఉండాలని, ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని మేము కోరుతున్నాం, ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజలతోనూ, ప్రజాసంఘాలతోనూ సంప్రదింపులు జరిపి, ‘ఆరోగ్య హక్కు’కు సంబంధించి ఒక బలమైన చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తుందని ఆశిస్తున్నాం.

–ప్రొ. శాంతాసిన్హా, కె. సజయ, వి.సంధ్య, కొండవీటి సత్యవతి, సుజాత సూరేపల్లి, ఎస్‌.ఆశాలత, గిరిజా పైడిమర్రి, అఖిలేశ్వరి రామగౌడ్‌, కొండేపూడి నిర్మల, సుధ గోపరాజు, అరుణ నెల్లుట్ల, ఆశ... సహా వివిధ రంగాలకు చెందిన మరో నూటరెండు మంది సంతకాలతో.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:29 AM