తెలంగాణ ఉద్యమ ఆశయాలు నెరవేరాయా?
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:42 AM
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఆంధ్ర, తెలంగాణను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా తెలంగాణ భూములను, ఆర్థిక వనరులను, నీళ్లను, నిధులను...
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఆంధ్ర, తెలంగాణను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా తెలంగాణ భూములను, ఆర్థిక వనరులను, నీళ్లను, నిధులను, ఉద్యోగాలను దోచుకోవడం మొదలుపెట్టారు. అది ఎంతలా అంటే యావత్ తెలంగాణనే శాసించేలా. దీంతో తెలంగాణలో పనిలేక ప్రజలు, భూములు లేక రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇలా యావత్ తెలంగాణ నిత్యం ఆకలితో, ఆత్మహత్యలతో అల్లాడుతూ ఉన్న భూమిని అమ్ముకొని, వలసలు పోయి కూలి పని చేసుకునే స్థితికి తీసుకొచ్చారు. పైగా తెలంగాణలో అన్ని ఉద్యోగాలలో ఆంధ్రావాళ్లే తిష్ఠ వేసి పెత్తనం చెలాయిస్తుంటే, తెలంగాణలో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతున్న తీరును చూసి తట్టుకోలేక ‘‘మా ఉద్యోగాలు మాకే కావాలంటూ’’ నిరుద్యోగులతో మొదలైన ‘ముల్కీ ఉద్యమం’ నుంచి 1969 తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి, 369 మంది అమరులయ్యారు. ఆ ఉద్యమరూపం ఎటు దారితీస్తుందోననే భయం ఒక్కసారిగా ఆంధ్ర పెత్తందారి పాలకులలో మొదలయ్యింది. దాంతో తెలంగాణ నాయకులకు పదవులను, డబ్బులను ఆశ చూపి, ఆ ఉద్యమాన్ని కుట్రలతో కూడుకున్న ఒప్పందాలతో ఆంధ్ర పాలకులు బలితీసుకున్నారు.
తొలి దశ ఉద్యమ లోపాలను సవరించుకుంటూ ‘నీళ్లు, నిధులు, నియమాకాల’ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అన్ని రంగాల ప్రజలకు చేరువవుతూ అందరి సంపూర్ణ మద్దతుతో బలమైన సైద్ధాంతిక పునాదులతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ దశ–దిశను నిర్దేశించారు. ఆ ఉద్యమం ప్రజల నుంచి స్వచ్ఛందంగా రావడంతో ఆంధ్ర పాలకుల రాజకీయ ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, పదవులు, బలం, బలగం ఏవీ పనిచేయలేదు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు ఉద్యమాలకు అడ్డాగా మారి మొత్తం తెలంగాణ ప్రజలకు అన్ని యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులు అండగా నిలబడ్డారు. ఈ పోరాటంలో దాదాపు 1,200 మందికి పైగా విద్యార్థులు అమరులైనా చెక్కుచెదరని ధైర్యంతో తెలంగాణ సాధించే వరకు విద్యార్థి లోకం పోరాడుతూనే ఉంది.
అనేక మంది కళాకారులను ఐక్యం చేస్తూ గద్దర్ సాగించిన సాంస్కృతిక ఉద్యమం యావత్ తెలంగాణ బిడ్డలను కదిలించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన ఆటపాటలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పాడిన పాటలు ప్రజల గుండెలను రగిలించాయి. రాస్తారోకో, వంటావార్పు, రైల్ రోకో, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల సింహగర్జన సభలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచిపోయే ప్రధాన ఘట్టాలు.
ఈ ఉద్యమంలో తమవంతు పాత్ర నిర్వహించాలని రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు సైతం తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అనేక కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఎవరికి వారే స్వతంత్ర జేఏసీలుగా ఏర్పాటు చేసుకొని సొంత డబ్బులతో ఉద్యమాన్ని నడిపించారు. నడక నేర్చిన పిల్లగాండ్ల నుంచి పండు ముసలి వరకు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజస్కందాలపై మోస్తూ ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారు.
తెలంగాణ కోసం అనేకమంది విద్యార్థులు అమరులుగా మారడాన్ని చూసి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అప్పటి యూపీఏ ప్రభుత్వం చలించి పార్లమెంటును దిగ్బంధం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించారు. దీంతో 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఉద్యమాన్ని ప్రతిసారి సజీవంగా నిలబెడుతూ విజయతీరాలకు చేర్చడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల పాత్ర ప్రముఖమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటి అమరవీరుల చరిత్రను ముందు తరాలకు చెప్పడం బుద్ధిజీవులుగా మన బాధ్యత. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఎప్పటికీ అన్యాయాన్ని, దోపిడీని, అణిచివేతలను, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. తెలంగాణ చరిత్రను, అస్తిత్వాన్ని ఎవరెంత కించపరచినా, హేళన చేసినా అది చెరిగిపోయేది కాదు.
తెలంగాణ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా ‘నీళ్లు, నిధులు, నియమాకాల’ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నాం. వాటిని సాధించుకోవడంలో ఆనాటి పోరాట స్ఫూర్తి పాలకులలో, నాయకులలో లేదు. దాన్ని ప్రశ్నించే ఉద్యమ గొంతులు కూడా ఎందుకో తడబడుతున్నాయి. నిరుద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, విద్యార్థులు ఇంకా నిరాశతోనే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని పాలకులు గమనించి భవిష్యత్తులో రాబోయే పెను ఉద్యమాల ప్రమాదాన్ని నివారించి ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆశయాలను’ నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
మండ్ల రవి
(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)
ఈ వార్తలనూ చదవండి:
పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..