రేవంత్... విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:41 AM
పాలకులు వేదికలెక్కి ప్రజాసంక్షేమం గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, శపథాలు చేసినా.. మంచి సమాజ నిర్మాణానికి పునాదులైన ప్రజారోగ్యం, విద్యా రంగాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుంటే అది ప్రభుత్వ వైఫల్యమే...
పాలకులు వేదికలెక్కి ప్రజాసంక్షేమం గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, శపథాలు చేసినా.. మంచి సమాజ నిర్మాణానికి పునాదులైన ప్రజారోగ్యం, విద్యా రంగాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుంటే అది ప్రభుత్వ వైఫల్యమే. నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యాలు, వారి నిర్ణయాలు చూస్తుంటే.. అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నది విజన్ ఉన్న నాయకులేనా? లేక దశా దిశ లేని పాలన సాగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రమంగా బలిపీఠం ఎక్కిస్తోంది. నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఉన్నత చదువులకు రక్షణ కవచం లాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలతో కలిపి, రేవంత్‌రెడ్డి సర్కార్ ఏకంగా రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను పెండింగ్‌లో పెట్టింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 నుంచి 15 లక్షల మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యా భవిష్యత్తు అంధకారంలో పడింది. బడ్జెట్‌లో కేటాయింపులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో కాలేజీలకు నిధులు చేరడం లేదు. ప్రభుత్వ నిధులు సకాలంలో అందక... అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక, అద్దెలు కట్టలేక వందలాది ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయి. ఆర్థికంగా సత్తువ లేని నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ రాక.. మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితి ఎదురవుతోంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన రాజకీయ, చారిత్రక కోణాన్ని రేవంత్ సర్కారు విస్మరిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద విద్యార్థి కూడా కార్పొరేట్ చదువులు చదవాలనే ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పటి సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ విధంగా ఈ పథకానికి అసలైన ‘కాపీరైట్’ కాంగ్రెస్ పార్టీదే. అయితే, వైఎస్సార్ ఆశయాల వారసులమని చెప్పుకునే ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు.. అదే వైఎస్సార్ తెచ్చిన ప్రతిష్ఠాత్మక పథకం గొంతు నులుముతుండటం రాజకీయ వైపరీత్యం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుపేదల పొట్టగొడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సొంత పార్టీ మార్కు పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితికి కాంగ్రెస్ దిగజారిపోయింది.
వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతే, ప్రభుత్వం నెలకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే విదిలిస్తామని చెప్పడం విద్యార్థి లోకాన్ని, విద్యా సంస్థలను అవమానించడమే. ఈ నామమాత్రపు నిధుల విడుదల వెనుక పెద్ద ఎత్తున దళారీల కుట్ర దాగి ఉంది. కాలేజీ యాజమాన్యాలతో ముఖ్యమంత్రి బహిరంగంగా మేము సెటిల్ చేస్తాం... అని మాట్లాడటం రాజకీయ వర్గాల్లో, విద్యార్థి సంఘాల్లో తీవ్ర దుమారం రేపింది. ఒక పారదర్శకమైన ప్రభుత్వ వ్యవస్థలో నిధుల విడుదల నిబంధనల ప్రకారం జరగాలి కానీ, సెటిల్‌మెంట్ల ద్వారా కాదు. దీనికి తోడు, విద్యార్థులు, కాలేజీలపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ తెచ్చిన వివాదాస్పద జీవో నెంబర్ 7 ప్రభుత్వ నిరంకుశ ధోరణికి పరాకాష్ఠ. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడే విద్యార్థులపై ఇటువంటి కఠిన జీవోలు తీసుకురావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల విద్యార్థుల జీవితాలు వీధిన పడ్డాయి. కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్నా, కాలేజీలకు ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపేస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు సాధించినా, బయట నోటిఫికేషన్లకు అప్లై చేయాలన్నా సర్టిఫికెట్లు లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే విద్యార్థులు, పీజీ, పీహెచ్‌డీలు చేయాలనుకునేవారు సర్టిఫికెట్లు అందక అడ్మిషన్లు కోల్పోతున్నారు. చదువు పూర్తయినా చేతిలో సర్టిఫికెట్ లేక, అటు ఉద్యోగం రాక, ఇటు ఇంట్లో అండగా నిలబడలేక వేలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యల వైపు కూడా అడుగులు వేస్తుండటం ఆందోళనకరం. విద్యార్థులకు అండగా నిలవాల్సిన రేవంత్‌రెడ్డి సర్కార్, వారి జీవితాలను పొలిటికల్ గేమ్‌లో పణంగా పెడుతోంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు విడుదల చేస్తోంది. అయితే కేంద్రం నిధులు విడుదల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా చెల్లించి, సదరు విద్యార్థుల జాబితాను కేంద్రానికి పంపించాలి. రాష్ట్రం ఆ పని చేయకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. ముఖ్యమంత్రి దగ్గర ఎంతో ముఖ్యమైన విద్యాశాఖ ఉండడం వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుపడింది. సమస్యలు వినే దిక్కులేదు.
తెలంగాణ తెచ్చుకున్నదే... నీళ్లు, నిధులు, నియామకాలు, నాణ్యమైన చదువుల కోసం. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో నిధులు లేవు, ఉన్నత చదువులకు గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ విద్యా విధ్వంసంపై విద్యార్థి లోకం, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు మొదలుకొని జిల్లా కేంద్రాల వరకు విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వస్తున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజుల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిరావడం ఈ రాష్ట్ర పాలకులకు సిగ్గుచేటు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి సర్కార్ కార్పొరేట్ అనుకూల సెటిల్‌మెంట్ ధోరణిని పక్కనపెట్టి.. తక్షణమే రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి. వివాదాస్పద జీవోలను రద్దు చేసి, విద్యార్థుల సర్టిఫికెట్లు వారికి దక్కేలా చూడాలి. విద్యార్థులకు ఉన్నతవిద్యను దూరం చేయరాదు. ఈ పథకం లక్ష్యాన్ని నిర్వీర్యం చేయవద్దు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షేమం కాదు బాధ్యత.
ఈటల రాజేందర్
బీజేపీ ఎంపీ
ఇవి కూడా చదవండి
మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..
గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..