ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కార్ కుట్ర!
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:46 AM
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఏళ్లుగా ఉచితంగా ఉన్నత విద్యను అందుకుంటున్న లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల కలలు, భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి...
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఏళ్లుగా ఉచితంగా ఉన్నత విద్యను అందుకుంటున్న లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల కలలు, భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ పథకాన్ని ఖూనీ చేసే కుట్రలో భాగంగా పాలకులు పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజుల బకాయిలను ఎగ్గొట్టి విద్యకు దూరం చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ప్రభుత్వంపై నమ్మకం లేక విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని, ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’, ‘స్కాలర్‌షిప్’ పథకం ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసేందుకు ఒక భారీ కుట్రకు తెరలేపింది. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపింది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా వంటి ఖరీదైన చదువులు పేదలకు అందని ద్రాక్షలా ఉన్న సమయంలో, ఈ పథకం అండగా నిలిచి వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దింది. కానీ, నేడు అదే పథకానికి గ్రహణం పట్టింది.
ఉన్నత విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం పేరుకుపోయిన బకాయిలు. గత నాలుగేళ్లుగా పాలక వర్గాల ఉదాసీనత వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అక్షరాలా రూ.పదివేల కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిల వల్ల అటు విద్యార్థులు, ఇటు విద్యా సంస్థలు పతనావస్థకు చేరుకున్నాయి. నిధుల కొరతతో కాలేజీలు మూతపడే దుస్థితి. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థుల విద్యా అవసరాల కోసం ప్రతి ఏడాది సుమారు 2,500 కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులకు, అవసరానికి పొంతనే లేదు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం, పేదల చదువు కోసం నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదం.
సుమారు 18 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొందరు ఇప్పుడు కోర్టులో సవాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకోవడానికి తెరవెనుక నుంచి ఈ న్యాయపరమైన చిక్కులను ప్రోత్సహిస్తోందని విద్యార్థి లోకం భావిస్తోంది. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన విద్యాకమిషన్ నివేదిక సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎత్తేయాలనే భావన కలిగించేలా సిఫార్సులు చేయటమే.
ఫీజు బకాయిలు ఉన్నాయనే సాకుతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. దీంతో చదువు పూర్తయినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు, పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. మధ్యలోనే ఫీజులు కట్టాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో, ఆర్థిక స్తోమత లేని వందలాది మంది విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోంది. కాలేజీలకు నిధులు రాకపోవడంతో అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదు. ఇది విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సామాజిక హామీ. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠంపై పెట్టి, ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక ‘ఉచితం’గానో లేదా ‘భారం’గానో భావించడం సరికాదు. పేరుకుపోయిన రూ.పదివేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. స్కాలర్‌షిప్ నిధులను ప్రతి నెలా జాప్యం లేకుండా విడుదల చేసేందుకు ‘గ్రీన్ ఛానల్’ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్ కాలేజీల్లో పెంచిన 30–35 శాతం ఫీజులను ప్రభుత్వం భరించాలి లేదా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.
జీవన్
(ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News