Share News

హామీలను గుర్తుచేయడం బెదిరించడం కాదు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:37 AM

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేసి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం రాష్ట్ర సాధన కోసం పోరాడిన...

హామీలను గుర్తుచేయడం బెదిరించడం కాదు!

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేసి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా మా బాధ్యత. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా చాలా రోజులుగా ఆశతో మౌనంగా వేచి చూశాం. ఉద్యోగుల హక్కులు హరించివేస్తున్నప్పుడు, వారు నిర్లక్ష్యానికి గురవుతున్నప్పుడు ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండడం నేరమే అవుతుంది.

కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి పలు సందర్భాలలో ఉద్యోగులపై, ఉద్యోగ సంఘాలపై అసంతృప్తిని, ఒక రకమైన అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్ సభలో టీచర్ల సమస్యల పరిష్కారానికి తనకు మరో రెండేళ్ల సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తూ, టీచర్లను ఇతర సంఘాలతో కలవకూడదని పరోక్షంగా; ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల మాయలో పడవద్దని ప్రత్యక్షంగా సూచించారు. ‘రాబోయే పరీక్షలో మాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం’ అంటూ ఒక పెద్ద ప్రశ్నార్థక అంశాన్ని మా ముందుంచారు. కానీ ఒక విద్యార్థి యూనిట్ పరీక్షలన్నిటిలో పూర్తి మార్కులు సాధించినా, వార్షిక పరీక్షలు సరిగా రాయకపోతే, వచ్చే ఫలితాలకు ఉపాధ్యాయులది బాధ్యత కాదుకదా!

రాష్ట్రం ఏర్పాటుతో తమ సమస్యలు తీరుతాయనే ఆశలు అందరికీ ఉన్నట్లుగానే, 42 రోజుల సకల జనుల సమ్మె చేసి రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యమైన ఉద్యోగులుగా మాకు కూడా ఆశలు ఉన్నాయి. విచిత్రమేమో కానీ గత పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాతనైనా సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే చిన్న చిన్న సమస్యలు మినహా మూల సమస్యల పీటముడి వీడడం లేదు. చేవెళ్ల డిక్లరేషన్‌లో అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలు పేర్కొంటూ... అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ వారి ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులైనా ఆ హామీలను నెరవేర్చలేదు.

డిసెంబర్ 7, 2023న ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ 24న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను కమాండ్ కంట్రోల్ రూంకు ఆహ్వానించడంతో ఉద్యోగ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడింది. 12 ఆర్థిక, 52 ఆర్థికేతర... మొత్తం 64 డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. 30 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, సానుకూలంగా స్పందించటంతో సమస్యల పరిష్కారానికి అనుకూలత ఏర్పడిందని ఉద్యోగులు సంబరపడ్డారు. కానీ వెయ్యి రోజులు గడచినా అవి పరిష్కారం కాలేదు.


రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రిటైర్డ్ ఉద్యోగులంతా కలిపి సుమారు పదమూడు లక్షల ఉద్యోగులవి ప్రధానంగా ఆరు డిమాండ్లు.

1) 2023 జూలై ఒకటి నుంచి రావలసిన పీఆర్సీ ఇవ్వడం. 2) ఆరు పెండింగ్‌ డీఏలను చెల్లించడం. 3) ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపు. 4) కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. 5) ఎంప్లాయిస్ హెల్త్ కార్డుల కోసం గత మూడు నెలలుగా ఉద్యోగుల వాటా 1.5శాతం జీతంలో కట్ చేసినా, నగదు రహిత వైద్యం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు, దీన్ని పరిష్కరించడం. 6) ఉద్యోగ సంఘాల గుర్తింపు. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చారు, కానీ అమలు కాలేదు.

ఒక్కో ఉద్యోగి రిటైర్ అయితే ప్రభుత్వంపై సగటున కోటి రూపాయల భారం పడుతుందని ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభల్లో చెప్పడం, కొన్నిసార్లు పీఆర్సీ కూడా ఇచ్చినామని చెప్పడం పచ్చి అబద్ధం. వాస్తవానికి 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగికి గ్రాట్యుటీ కింద ప్రభుత్వం చెల్లించేది కేవలం పదహారు లక్షలు మాత్రమే. ఏ మాత్రం సర్వీసు తక్కువైనా ఆ మేరకు నిష్పత్తిలో, చెల్లింపులో కోత విధిస్తారు. ఇక మిగతా మొత్తం ఉద్యోగి సర్వీసులో ఉండగా తన వేతనం నుంచి జీపీఎఫ్, టీజీఎల్‌ఐ, జీఐఎస్ కింద పొదుపు చేసుకున్నవి, సరెండర్ లీవు, కమ్యూటేషన్‌కు సంబంధించినవి. ఇవి ప్రభుత్వ నిధులు కావు. ఈ మొత్తం రిటైర్మెంట్ రోజునే చెల్లించాలి, కానీ ఏళ్ల తరబడి చెల్లించడం లేదు. కోర్టులకు వెళ్లేవారికి మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిని కూడా ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తున్నామనడం ప్రజల్లో ఉద్యోగులపై అసూయ ఏర్పడేటట్లు చేయడమే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగర్వాల్ పీఆర్సీ కమిషన్ 29శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు 42 రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధించినందుకు 42శాతం డిమాండ్ చేయగా, అప్పటి ప్రభుత్వం ఒక శాతం అదనంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బిస్వాల్ పీఆర్సీ కమిషన్ 7.5శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేయగా, ప్రభుత్వం 30శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. రెండు సందర్భాలలోనూ డీఏలు పెండింగులో లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా 1–7–2028 నుంచి మూడో పీఆర్సీ రానున్నది, కానీ ప్రస్తుతం 2023 నుంచి రావలసిన రెండో పీఆర్సీ పెండింగ్‌లోనే ఉన్నది. రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించే పెండింగ్ బిల్లులు ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో 2024 నుంచి ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా 15.47శాతం డీఏ రావలసి ఉంది.


అంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క డీఏ కూడా ఉద్యోగులకు రాలేదు. డీఏ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు దయాదక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. దేశంలో పెరుగుతున్న ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ నిర్ణయిస్తుంది. దీనిలో మార్పులకు అవకాశం లేదు. డీఏలు సకాలంలో రాకపోవడం వల్ల పీఆర్సీ–2020 ప్రకారం చిన్న ఉద్యోగి అయితే సంవత్సరానికి రూ.35,272, అలాగే, ఉన్నతాధికారి అయితే రూ.3,00,867 వరకు జీతం ప్రస్తుతం కోల్పోతున్నారు. ఇచ్చినామని చెబుతున్న హెల్త్ కార్డులపై ఎంప్లాయి ఐడీ నెంబర్ ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వెళితే ఐడీ నెంబర్ కలిగిన ఉద్యోగి గుర్తింపు కార్డు లేదని అడ్మిట్ చేసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై చర్చల ఊసే లేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను పునరుద్ధరించిన ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలకు గుర్తింపును మాత్రం ఇవ్వలేదు.

తెలంగాణ ప్రజలకు ఇవ్వని హామీలనెన్నింటినో ఇస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల విషయంలో మాత్రం ఇచ్చిన హామీల అమలు అడిగితే... వాటిని త్వరలోనే అమలు చేస్తామని మరో హామీ మాత్రమే ఇచ్చి, మరో రెండేళ్ల దాకా ఓపిక పట్టండనడం అర్థరహితం, బాధ్యతారాహిత్యం. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట్లోకి చేరాలన్నా ఉద్యోగులే కీలకం. తెలంగాణ రైజింగ్–2047, త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉంటుందనే వాస్తవాన్ని విస్మరించడం సరికాదు. ప్రభుత్వ ఆదాయం పెంచితే ఉద్యోగులకు కూడా పంచుతామన్న మాటలు నీటిమూటలు కారాదు.

ఎంతటి ఉద్యమాలైనా, యుద్ధమైనా చివరకు చర్చలు ఒప్పందాల ద్వారానే ముగింపు పలికేది. ఈ నెల పదో తేదీన తలపెట్టిన ఉద్యోగుల సంకల్పసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టు ద్వారా అనుమతి వచ్చింది. అనంతరం ప్రభుత్వం ఒక మెట్టు దిగి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ అనంతరమే ఆ సభను ఉద్యోగుల జేఏసీ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది కానీ, అది ఉద్యోగుల హక్కుల సాధన ఉద్యమానికి ముగింపు కాదు. ఈసారి ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి తీవ్రమైన ఆందోళనలుగా రూపుదిద్దుకొని దీర్ఘకాలం కొనసాగితే ప్రభుత్వంపై కూడా దుష్ప్రభావం ఉంటుందని పాలకులు గ్రహించాలి.

ఏలూరి శ్రీనివాసరావు

బి.శ్యామ్

మామిడి నారాయణ

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 05:37 AM