Share News

వరిని వదులుకుంటేనే కరువును తట్టుకోగలం!

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:05 AM

ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో తీవ్రమైన పర్యావరణ, వనరుల సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 31 జిల్లాల్లోని 365 మండలాలను అధికారికంగా కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది...

వరిని వదులుకుంటేనే కరువును తట్టుకోగలం!

ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో తీవ్రమైన పర్యావరణ, వనరుల సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 31 జిల్లాల్లోని 365 మండలాలను అధికారికంగా కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఎల్‌నినో సంబంధిత నీటి, విద్యుత్ సంక్షోభం జూలై 2027 వరకు కొనసాగవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ అత్యవసర పరిస్థితి మన వ్యవసాయ వ్యవస్థలోని కొన్ని లోపాలను ఎత్తిచూపుతోంది. అలాగే అధికంగా నీరు అవసరమయ్యే వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడటం ఇక సాధ్యం కాదని నిరూపిస్తోంది.

తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాలంటే పంటల్లో వైవిధ్యం పాటించాలన్నది శాస్త్రీయంగా నిరూపితమైన వ్యూహం. వరి స్థానంలో తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల పొలంలోని మైక్రో క్లైమేట్, నేల భౌతిక స్థితి మారి, కరవు ప్రభావాన్ని అడ్డుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు లోతైన వేర్లు కలిగి, గట్టిపడిన ఉపరితల నేల పొరలను విడగొట్టి, నేల రంధ్రాలను పెంచుతాయి. దీనివల్ల వర్షాలు పడినప్పుడు నీరు భూమిలోకి త్వరగా ఇంకుతుంది. కానీ అలవాటైన వరి సాగు నుంచి సంక్లిష్టమైన ప్రత్యామ్నాయ పంటల విధానంలోకి మారడం చిన్న సన్నకారు రైతులకు పెద్ద సవాలే.

చిన్న రైతులు వరిని వదిలి పప్పుధాన్యాలు, నూనెగింజలు లేదా పత్తి వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మారాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలోని కొన్ని వాస్తవాలను మరిచిపోతున్నది. చిన్న, సన్నకారు రైతులు చాలా తక్కువ లాభాలతో బతుకుతున్నారు. వరి సాగులో చాలావరకు యాంత్రీకరణ జరిగింది. నిల్వ చేయడం సులభం, అలాగే దానికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు కొనుగోలు గ్యారెంటీ ఉంది. కానీ ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక వ్యవసాయ పద్ధతులు అవసరం. తక్కువ తేమను ఉపయోగించుకోవాలంటే సరైన సమయంలో విత్తనాలు వేయడం, నేలను భిన్నంగా తయారు చేయటం, కలుపుతీత, కోతల సమయంలో ప్రత్యేక విధానాలు, జాగ్రత్తలు అవసరమవుతాయి. రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న ఒక చిన్న రైతుకు ఎలాంటి ముందస్తు మద్దతూ ఇవ్వకుండా ఈ కొత్త పంటల బాధ్యతను ఇవ్వడం సరైన విధానం కాదు.


వాతావరణ మార్పులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలపై వివిధ రకాల ప్రభావాన్ని చూపుతున్నాయి. అందువల్ల రైతు వేదికల ద్వారా ఇచ్చే సలహాలు అందరికీ ఒకేలా పనికిరావు. తెలంగాణలో ఉత్తర మండలాల్లో అనూహ్య వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాల చక్రాలను మారుస్తున్నాయి. మధ్య మండలాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోవడం వల్ల నేలలో తీవ్రమైన తేమ కొరత ఏర్పడుతోంది. దక్షిణ మండలాల్లో తక్కువ లోతు ఉన్న నేలల్లో గాలికి నీరు త్వరగా ఆవిరైపోవడం వల్ల వాతావరణం ఏ మాత్రం పొడిబారినా పంటలు వాడిపోతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం ‘మండలాలవారీ వికేంద్రీకృత ప్రత్యామ్నాయ ఉత్పత్తి ప్యాకేజీ’ (MDAPP)ని అమలు చేయాలి. ఈ విధానం నేల రకాలను, భూగర్భ జలాల లభ్యతను అన్ని 621 మండలాల్లో మ్యాపింగ్ చేసి, చిన్న రైతులకు అనువైన ప్రత్యామ్నాయ పంటల జాబితాను అందిస్తుంది.

రాష్ట్రంలోని జోన్ ‘ఎ’లో భూగర్భ జలాలను ఎక్కువగా వాడే నల్లరేగడి నేలలు ముఖ్యంగా ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలోని కొన్ని మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ యాసంగి వరిపై పూర్తిగా నిషేధం విధించాలి. దీని స్థానంలో పత్తితో పాటు కంది, శనగ, మినుము, పెసర లేదా సోయాబీన్ అంతరపంటలుగా వేయాలి. జోన్ ‘బి’లో తక్కువ నీటి మట్టాలు కలిగిన ఎర్ర చెలక నేలలు గల మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల మండలాలు ఉన్నాయి. ఇక్కడ తక్కువ తేమ ఉన్నందున వేరుశనగ, ఆముదాలు, సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు, నువ్వులు వంటి కరవును తట్టుకునే పంటలను వేయాలి. జోన్ ‘సి’లో కాలువ నీటి కొరత కలిగి, అల్లూవియల్ మధ్యస్థ లోమ్ నేలలు గల నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మండలాలు ఉన్నాయి. ఇక్కడ కుసుమలు, ఆవాలు, పెసర, పొద్దుతిరుగుడు, అవిసెలు సాగు చేయాలి.

ఈ ప్యాకేజీని అమలు చేయడానికి భౌతిక సాయిల్ హెల్త్ కార్డ్‌లను డిజిటల్ ‘MDAPP స్మార్ట్ పాస్‌బుక్‌లు’గా మార్చాలి. రైతు తన భూమిని పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు వ్యవస్థ ఆటోమేటిక్‌గా వారి జోన్‌కు సంబంధించిన పంట కోడ్‌ను గుర్తిస్తుంది, నిషేధిత వరి నమోదును నిలిపివేస్తుంది, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన సబ్సిడీలను అందిస్తుంది.

పంట మార్పిడికి ప్రధాన అడ్డంకి చిన్న రైతులు ఎదుర్కొనే తక్షణ పెట్టుబడి కొరత. MDAPP ఈ ఇబ్బందిని తొలగించడానికి పెట్టుబడి సాయాన్ని రెండు విభాగాలుగా విభజిస్తుంది: ఒకటి, ప్రాథమిక రైతు భరోసా సాయం; రెండోది, ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు మాత్రమే ప్రత్యేకంగా అందించే ‘గ్రీన్ ట్రాన్సిషన్ బోనస్’ (GTB) రూ.3,000 (ఎకరానికి ఒక సీజన్‌కు). కొత్త విత్తనాలు, పనిముట్ల కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా ఉండటానికి, ఈ నిధులను ముందే అందిస్తారు. విత్తనాలు వేయడానికి 15 రోజుల ముందే 60శాతం సాయాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 40శాతం నిధులను విత్తిన 30 రోజుల తర్వాత రిమోట్ సెన్సింగ్ లేదా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ధ్రువీకరణ ఆధారంగా విడుదల చేస్తారు.


అంతేకాకుండా, తెలంగాణలోని 2,600కు పైగా రైతు వేదికలను స్థానిక లాజిస్టిక్స్ కేంద్రాలుగా మార్చాలి. పంట నమోదు చేసుకున్న వెంటనే రైతులు తమ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ వోచర్ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) అభివృద్ధి చేసిన 100శాతం సబ్సిడీతో, అధిక దిగుబడినిచ్చే, కరవును తట్టుకునే విత్తనాలను రైతు వేదికల వద్ద పొందవచ్చు. నీటి వినియోగ సాంకేతికతను మార్చడానికి, ప్రత్యామ్నాయ పంటలకు మైక్రో–ఇరిగేషన్ డైరెక్ట్–డెలివరీ (MIDD)ని అనుసంధానించాలి. MDAPP కింద నమోదైన రైతులకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ కిట్లపై 90శాతం సబ్సిడీ ఇవ్వాలి, సాంకేతిక బృందాలు వారంలోనే వీటిని పొలంలో అమర్చాలి.

MDAPP ముఖ్యమైన అడుగు మార్కెట్ ధరల అస్థిరతను తొలగించడం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన సంస్థగా ‘తెలంగాణ ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బోర్డు’ (TACPB)ను ఏర్పాటు చేయాలి. ‘120శాతం కనీస మద్దతు ధర కొనుగోలు ఒప్పందం’ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 20శాతం అదనపు ప్రీమియం ధరతో ప్రత్యామ్నాయ పంటల మొత్తాన్ని కొనుగోలు చేయడానికి ఈ బోర్డు చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది.

వరితో పోలిస్తే పప్పుధాన్యాలు, చిరుధాన్యాల దిగుబడి పరిమాణం తక్కువగా ఉన్నందున, ఆ నష్టాన్ని పూడ్చడానికి ఈ 20శాతం అదనపు బోనస్ చిన్న రైతులకు సహాయపడుతుంది. రైతు వేదికల వద్దే వికేంద్రీకృత తూకం కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు చేసిన 72 గంటల్లోనే నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా, రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దశాబ్దాల కాలపు అత్యంత ఘోరమైన కరవును సమర్థవంతంగా తట్టుకుని నిలబడగలదు.

డా. రమేశ్‌ చెన్నమనేని

వ్యవసాయ నిపుణులు,

హుంబోల్డ్ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు, మాజీ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 12 , 2026 | 01:05 AM