కరువులో రైతు వెన్నంటి ప్రజాప్రభుత్వం!
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:55 AM
తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం లోటు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణంగా 740.6మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 615.5మి.మీ. మాత్రమే నమోదైంది...
తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం లోటు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణంగా 740.6మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 615.5మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 17శాతం లోటు. ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది 139.28 లక్షల ఎకరాల నుంచి ఈ ఏడాది 126.06 లక్షల ఎకరాలకు తగ్గింది. వరి సాగు 69.19లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పరిస్థితిని పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రధాన, మధ్యతరహా జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 179.63 టీఎంసీలే. ఈ నీటి లోటు వ్యవసాయంతోపాటు పశుపోషణ, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరాపైనా ప్రభావం చూపుతోంది.
కరువు పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంట నష్టం, పెట్టుబడి నష్టం, అప్పుల భారం. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయించి, అర్హులైన రైతులకు కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయ నిబంధనల ప్రకారం పరిహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇన్పుట్ సాయం, పంట రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై బ్యాంకులతో సమన్వయం చేస్తోంది. జలాశయాల్లో నీటి లభ్యతను బట్టి యాసంగి సాగు ప్రణాళికను రూపొందిస్తూ, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు, అవసరమైన సహాయం అందిస్తోంది. వ్యవసాయ పనులు తగ్గటం వల్ల గ్రామీణ కూలీల ఆదాయం పడిపోకుండా ఉపాధి హామీ పనులను విస్తరిస్తున్నది. అవసరమైన చోట అదనంగా 50 పనిదినాలు కల్పించేందుకు కేంద్రాన్ని కోరింది.
కరువు తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 18న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర బృందాన్ని పంపి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని, ఎన్డీఆర్ఎఫ్ సహాయం మంజూరు చేయాలని, రాష్ట్ర విపత్తు సహాయ నిధికి కేంద్ర వాటాను విడుదల చేయాలని ఆ తీర్మానం కోరింది. అదనంగా 50 రోజుల ఉపాధి కల్పన, ఎరువుల సరఫరా, వ్యవసాయ విద్యుత్ అవసరాలు, ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ వంటి అంశాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మరోపక్క, కేంద్రం నిధుల కోసం వేచి ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ ఉపశమన చర్యలను కొనసాగిస్తోంది. కానీ కరువు వంటి విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ విషయంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ బాధ్యతను గుర్తించాలి. రాష్ట్రానికి రావాల్సిన కరువు సహాయ నిధులు, ప్రత్యేక ప్యాకేజీ సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి చొరవ చూపాలి. ప్రధానమంత్రిని తెలంగాణకు ఆహ్వానించి, కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేలా చేసి రైతుల పరిస్థితిని, పంట నష్టాన్ని, నీటి కొరతను ప్రత్యక్షంగా చూపించాలి.
కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో ఆలస్యం జరిగిందని విమర్శిస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, వ్యయం, ఆశించిన సాగునీటి ప్రయోజనాలు అందకపోవడం వంటి అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతను కూడా చర్చించాలి. కాగ్ 2024 ఫిబ్రవరి 15న శాసనసభలో ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ఆడిట్ నివేదికలో పలు కీలక అంశాలను వెల్లడించింది. వాటిపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రచారం చేసిన నాయకులు, నేడు అదే ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ అవసరం ఏర్పడటానికి కారణాలేమిటో వివరించాలి.
గత ప్రభుత్వ తప్పులను ప్రస్తావించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడం లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, పునరుద్ధరణ విషయంలో నిపుణుల సాంకేతిక పరిశీలన, భద్రతా ప్రమాణాలు, అవసరమైన అనుమతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి అవసరం ఎంత ఉన్నా, సాంకేతిక పరిశీలనను పక్కనపెట్టి బ్యారేజీలను వినియోగించడం సరికాదు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సమయపాలనతో కూడిన ప్రణాళిక రూపొందించారు. పనులకు సంబంధించిన సంస్థలను సిద్ధం చేసి, సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పునరుద్ధరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వర్షపాతం, జలాశయాల నీటి నిల్వలు, పంటల సాగు, పంట నష్టం, తాగునీటి సరఫరా, గ్రామీణ ఉపాధి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రైతులు, కూలీలు, సామాన్య ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరువు ప్రభావాన్ని తగ్గించడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రణాళికాబద్ధంగా నివారణ, ఉపశమన చర్యలను అమలు చేస్తోంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా సమష్టిగా వ్యవహరించాల్సిన సంక్షోభకాలం ఇది.
చనగాని దయాకర్
టీపీసీసీ జనరల్ సెక్రటరీ
ఈ వార్తలూ చదవండి
పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ