Share News

తెలంగాణ అభివృద్ధి ఆ మూడు జిల్లాలకే పరిమితమా?

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:56 AM

తెలంగాణ రాష్ట్రంలోనైనా అన్ని జిల్లాల సమతుల వృద్ధి, అభివృద్ధి సాధించే నమూనాను అమలు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తారని ఉద్యమ సమయంలో..

తెలంగాణ అభివృద్ధి ఆ మూడు జిల్లాలకే పరిమితమా?

తెలంగాణ రాష్ట్రంలోనైనా అన్ని జిల్లాల సమతుల వృద్ధి, అభివృద్ధి సాధించే నమూనాను అమలు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తారని ఉద్యమ సమయంలో పౌర సమాజం ఆశించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమై ఇతర జిల్లాలను నిర్లక్ష్యం చేశారనే కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. అందుకే నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, బుద్ధిజీవులు తెగించి పోరాడారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైనా వెనుకబడిన జిల్లాల పరిస్థితి మారలేదని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన కులాల జనాభా ఉంది. 2026–27 రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమర్పించిన రోజు ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర అభివృద్ధి తీరుకు సంబంధించిన గణాంకాలు ఉత్తర తెలంగాణ ప్రాంత పౌర సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలకే పరిమితం కావడం గమనించవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలకులు హైదరాబాద్‌ పరిసరాల కేంద్రంగా ఐటీ హబ్, ఫార్మాస్యుటికల్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు కన్‌స్ర్టక్షన్, రియల్ ఎస్టేట్ వ్యవస్థల అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వనరులు, దేశ విదేశీ పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడిగా రాజధాని నగరం చుట్టూ ప్రవహింప చేశారు. వందలాది కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా ఎదిగాయి.


హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదుగుతున్నది. ఇప్పటికే కోటీ 20 లక్షల జనాభాతో హైదరాబాద్‌ నగరం కాలుష్యం, క్రైమ్ రేటు, వరదల బీభత్సం పెరిగిపోతున్నది. ప్రభుత్వం హైదరాబాదు నగర అభివృద్ధినే రాష్ట్ర అభివృద్ధిగా ప్రదర్శిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పారిశ్రామిక మౌలిక వసతులపై అత్యధికంగా పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడే అనేక కార్పొరేట్ సంస్థల స్థాపన, విస్తరణ జరిగి ఆదాయాలు, లాభాలు అనేక రెట్లు పెరిగాయి. ఆ మూడు జిల్లాల తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే రెండు మూడు రెట్లు అధికం. పైన పటారం లోన లొటారం వలె తెలంగాణ పేదరికంలో కూడా సంపన్న రాష్ట్రంగా పరిగణించబడుతున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా తగిన మొత్తంలో నిధులు ఇవ్వడం లేదు. గత 11 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.74,396 (2014) నుంచి రూ.4,18,931 (2025–26) స్థాయికి వృద్ధి చెందింది కానీ ఈ పెరుగుదల వల్ల అత్యధిక ప్రయోజనం రాజధాని నగరం ఆవరించి ఉన్న ఆ మూడు జిల్లాలకు, కొన్ని కార్పొరేటు కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది. వివిధ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేపట్టకపోవడం వల్ల తెలంగాణ జిల్లాలు కేవలం వ్యవసాయంపై ఆధారపడి సుస్థిర, సమగ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూనే దూర ప్రాంత జిల్లాలను విస్మరించకూడదు.

ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 02:56 AM