Share News

కుల దాడులకు అడ్డా తెలంగాణ

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:50 AM

తెలంగాణ రాష్ట్ర సాధన తమ జీవితాలను మారుస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం, మార్పు జరుగుతుందన్న సరికొత్త ఆశలతో దళితులు ఉద్యమంలో అహర్నిశలూ పాల్గొన్నారు. గొంగడి కప్పుకొని, భుజాన డప్పు వేసుకుని...

కుల దాడులకు అడ్డా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సాధన తమ జీవితాలను మారుస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం, మార్పు జరుగుతుందన్న సరికొత్త ఆశలతో దళితులు ఉద్యమంలో అహర్నిశలూ పాల్గొన్నారు. గొంగడి కప్పుకొని, భుజాన డప్పు వేసుకుని ఆటపాటలతో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటుతో సామాజిక న్యాయం వైపు అడుగులు పడతాయని, వెనుకబడిన దళితుల జీవితాల మార్పునకు, విముక్తికి నాంది అని బలంగా విశ్వసించి ఉద్యమంలో ప్రధాన భాగమై, ముక్తకంఠంతో రాష్ట్ర ఆవశ్యకతను గొంతెత్తి నినదించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నం అయ్యాయి. తెలంగాణలో మునుపెన్నడూ లేనన్ని కుల హత్యలు, పరువు హత్యలు, వెలి వెతలు, భౌతికదాడులు జరుగుతున్నాయి. దళితులు వీటిని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు.

అక్టోబర్ 1న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2023–26లో 9,102 అట్రాసిటీ కేసులు నమోదు కాగా, వాటిలో కేవలం 32 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. నేరం రుజువు చేయడంలో, శిక్షలు వేయించడంలో పోలీసు దర్యాప్తు, న్యాయ వ్యవస్థల పనితీరు, ఉదాసీనత ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, ఎన్‌సీఆర్‌బీ నివేదికలు దళితులపై వివక్ష, దాడుల తీవ్రత ఏటా పెరుగుతోందని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ కోర్టుల్లో పెండింగ్ కేసుల చిట్టా నానాటికీ పెరుగుతూనే ఉంది. పోలీసులేమో అగ్రకులాలకు, వాళ్ల అధికార బలాలకు అండగా నిలుస్తూ, కేసులను స్టేషన్ బయటే రాజీ చేయడానికి ముందుంటున్నారు తప్ప, బాధితులకు న్యాయం చేయడం లేదు. 2016–24 మధ్య పోలీస్ స్టేషన్లలో 11,799 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో మనకు అవగతమవుతుంది. రాష్ట్రంలోని కోర్టుల్లో 45,439 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. శిక్షల రేటు కేవలం 4–5శాతమే కాగా, కోర్టుల్లో కేసుల పెండింగ్ 90 శాతం కంటే ఎక్కువగా ఉంది.

తెలంగాణలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు ప్రతి ఏటా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఘటన జరిగినా దాన్ని ఒక నేరంగా చూసి వదిలేస్తున్నారు తప్ప, కారణాల పూర్వాపరాల లోతైన పరిశీలన, శాస్త్రీయమైన దర్యాప్తు, మేధోపరమైన చర్చ మాత్రం చేయడం లేదు. వాస్తవానికి దళితులపై ఈ దాడులు కొత్తేమీ కాదు. భూమి, సంపద, అధికారం, సమాజంపై ఏకఛత్రాధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా సాగుతున్న అశాంతి, హింసాత్మక భావజాలం నుంచే ఇవన్నీ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి.


తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక న్యాయం కోసం, కుల పెత్తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని చెబుతాం. కానీ ఆ ఉద్యమ నాయకత్వం కూడా ఊళ్లలో తమ పెత్తనం చేజారకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్న తీరుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గువ్వలేగి, సిరిసిల్ల జిల్లా రామోజీపేటల్లో అంబేడ్కర్ విగ్రహాలు పెట్టనివ్వకుండా దాడులు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం కేవలం రాయి కాదు. దళితుల ఉనికికి, ఆత్మగౌరవానికి, ప్రశ్నించే తత్వానికి దృఢమైన చిహ్నం. ఇది జీర్ణించుకోలేకనే కుల పక్షపాతం జడలువిప్పి విలయనర్తనం చేస్తోంది. ఒకవైపు పెరుగుతున్న హింస దళితుల ఆకాంక్షలు పెరుగుతున్నాయనడానికి సంకేతమైతే, మరోవైపు ఆ ఆకాంక్షలపై పెత్తందారుల ఎదురుదాడికి నిదర్శనమే దాడులకు కారణం. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఇంకోటుంది. ఒకప్పుడు అణచివేతకు, వివక్షకు గురైన వెనుకబడిన శూద్ర కులాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ, ఆర్థిక స్వావలంబన పొంది రాజకీయ ఆధిపత్యం కోసం దళితులపై దాడులకు దిగుతున్నాయి. ఆధిపత్య, భూస్వాముల్లాగే గ్రామాల్లో పెత్తనం చేయాలనుకుంటున్నాయి. దళితులు తమ ముందు తలవంచి, తమ చెప్పు చేతల్లో ఉండాలని భావిస్తున్నాయి. అలా జరగని పక్షంలో దూకుడుగా దాడులకు దిగుతున్నాయి. నిన్నటి బాధితులే, నేటి బాధిత దళిత కులాలపై దాడులు జరపడం వర్తమాన సమాజాన్ని పట్టిపీడిస్తున్న విషాదం.

ఇప్పటికైనా ప్రభుత్వం, సమాజం కళ్లు తెరవాలి. దాడి జరిగిన తర్వాత నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే న్యాయం జరగదు. చట్టాల అమలులో నిర్లక్ష్యం, నిందితులకు శిక్షలు పడకపోవడం వల్ల దళితులకు న్యాయం అందడం లేదు. ఫలితంగా బాధితులు దాడితో ఒకసారి, న్యాయం కోసం ఎదురుచూస్తూ మరోసారి నష్టపోతున్నారు. అట్రాసిటీల నిరోధక చట్టం ఉండటమే కాదు, దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసే చిత్తశుద్ధి కూడా ప్రభుత్వానికి అవసరం. పోలీసులు, అధికారులు, న్యాయ వ్యవస్థ కులాలకు అతీతంగా బాధ్యతతో పనిచేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వాలు చట్టాల అమలుతో పాటు సమాజంలో సమానత్వ భావనను పెంపొందించాలి. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

డా. సుమన్ దామెర

అసిస్టెంట్ ప్రొఫెసర్, మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి.

Updated Date - Nov 05 , 2026 | 03:50 AM