కాంట్రాక్ట్ అధ్యాపకుల శ్రమదోపిడీ ఆగేదెన్నడు?
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:22 AM
ఒకవైపు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యాసంస్థల నిర్మాణం.. నలందా– తక్షశిలల నాటి ఘనత... ఏఐ యుగంలో సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థుల తయారీ... అంటూ వెలువడే ప్రకటనల వెనక ఒక చేదు నిజం...
ఒకవైపు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యాసంస్థల నిర్మాణం.. నలందా– తక్షశిలల నాటి ఘనత... ఏఐ యుగంలో సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థుల తయారీ... అంటూ వెలువడే ప్రకటనల వెనక ఒక చేదు నిజం దాగి ఉంది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో గత పాతికేళ్లుగా యూజీసీ నిర్దేశించిన అత్యున్నత విద్యార్హతలు (పీజీ, పీహెచ్‌డీ, నెట్/సెట్) కలిగి బోధిస్తున్న దాదాపు 1,200 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్ర ఆర్థిక, ఉద్యోగ భద్రతా సంక్షోభంలో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా వీరి వేతనాలు 2019 నాటి స్థాయిలోనే నిలిచిపోయాయి.
అదే తరగతి గదిలో, అదే సిలబస్‌ను బోధిస్తూ, అదే విశ్వవిద్యాలయ పరీక్షా బాధ్యతలు నిర్వహిస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకుల మధ్య వేతనాల్లో 167 శాతం వరకు వ్యత్యాసం ఉండటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లు కల్పించిన సమానత్వ హక్కుకే భంగం. షా సమీర్ భరత్‌భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ (2025), స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగ్జిత్‌సింగ్ (2016) వంటి సుప్రీంకోర్టు తీర్పులు సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని బలపరిచాయి. జీవోఎంఎస్ నెంబర్ 15 (2019) ద్వారా రెగ్యులర్ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఏడో యూజీసీ పే స్కేల్ అమలైంది. దీంతో బేసిక్ పే రూ.21,600 నుంచి రూ.57,700కు, అంటే 167.6శాతం పెరిగింది. ఇందులో ఇంకా డీఏ, ఇతర అలవెన్సులు కలపలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకుల బేసిక్ పే రూ.37,800 నుంచి రూ.57,700కు, అంటే కేవలం 52.6 శాతం మాత్రమే పెంచి ఫిట్‌మెంట్ బెనిఫిట్‌ను నిరాకరించారు. అలాగే జీవో ఆర్టీ నంబర్ 222 ప్రకారం డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇస్తూ, విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంవత్సరానికి ఒక రోజు ‘బ్రేక్’ పేరుతో వేతనం కోత విధించడం వివక్షగా కనిపిస్తోంది. హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులకు రూ.57,700 బేసిక్ పేతో పాటు సుమారు రూ.16,156 డీఏ, అంటే నెలకు రూ.73,856కు పైగా గ్రాస్ శాలరీ లభిస్తోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ యూనివర్సిటీ 2021 నుంచే డీఏ, హెచ్‌ఆర్‌ఏలను చెల్లిస్తోంది. తెలంగాణలో మాత్రం డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీహెచ్‌డీ ఇన్సెంటివ్ వంటి ప్రయోజనాలు లేక ఇతర ప్రాంతాలతో పోలిస్తే సుమారు 25శాతం ఆదాయ వ్యత్యాసం ఉందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యలో 74శాతం ఖాళీల సమస్య మరింత ఆందోళనకరం. మొత్తం 2,878 రెగ్యులర్ పోస్టుల్లో కేవలం 753 పోస్టులు మాత్రమే భర్తీ కాగా, 2,125 పోస్టులు అంటే 74శాతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులతో చౌకగా పనిచేయించుకుంటూ దీర్ఘకాలంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు. దీనివల్ల బోధన, పరిశోధన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీర్ఘకాలంగా పనిచేస్తున్న 1,200 మంది అధ్యాపకులు ఉండగా వారికి న్యాయం చేయకుండా కొత్త నియామకాలకు వెళ్లడం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఏడో యూజీసీ పే స్కేల్ రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీహెచ్‌డీ ఇన్సెంటివ్, మెడికల్ అలవెన్స్ అమలు చేయాలి. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను వారికి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్యాప్ శాలరీ విధానాన్ని రద్దు చేసి పన్నెండు నెలల పూర్తి వేతనం చెల్లించాలి. ఉన్నత విద్యకు నిధులు పెంచి, విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ పారదర్శక నియామకాలు చేపట్టాలి. కోటి ఆశలతో తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటింది. విద్యా వికాసం అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అధ్యాపకుడికి గౌరవప్రదమైన జీవితం, న్యాయమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడమే నిజమైన విద్యా వికాసం. 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయడం తెలంగాణ ఉన్నత విద్య భవిష్యత్తును కాపాడటమే.
డా. దీకొండ తిరుపతి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజి
ఈ వార్తలు కూడా చదవండి
రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..